సాక్షి, చెన్నై: భార్య మీనాక్షి మరణంతో తీవ్ర మనోవేదనలో ఉన్న జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ (78) గుండెపోటుతో గురువారం మృతిచెందారు. ఈ సమాచారంతో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. తమిళనాడు, కేరళ, రాజస్తాన్, ఆంధ్రా హైకోర్టులలోనే కాదు సుప్రీంకోర్టులోనూ అనేక కీలక కేసులకు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తి ఏఆర్ లక్ష్మణన్. పదవీ విరమణ అనంతరం చెన్నైలో భార్య మీనాక్షితో కలిసి ఉంటున్నారు. గతవారం మనుమడి వివాహం నిమిత్తం చెన్నై నుంచి శివగంగై వెళ్లారు.
ఈ వేడుక అనంతరం హఠాత్తుగా ఆయన సతీమణి మీనాక్షి అనారోగ్యం బారినపడి మంగళవారం మృతిచెందారు. భార్య మరణంతో ఏఆర్ లక్ష్మణన్ తీవ్ర మనోవేదనలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చింది. తొలుత శివగంగై జిల్లా కారైక్కుడి, ఆ తర్వాత తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ లక్షణన్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబీకులు తీవ్ర మనోవేదనలో పడ్డారు. ఈ సమాచారంతో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, డీఎంకే అధ్యక్షుడు , ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
దేవకోట్టై నుంచి ఢిల్లీ వరకు..
శివగంగై జిల్లా దేవకోట్టైకు చెందిన ఏఆర్ లక్ష్మణన్ చిన్నతనం నుంచి న్యాయశాస్త్రం అభ్యషించాలని ఆశించారు. పట్టుదలతో ముందుకు సాగారు. శివగంగైలో ప్రాథమిక, తిరుచ్చిలో ఉన్నత విద్యను అభ్యసించారు. చెన్నై న్యాయ కళాశాలలో లా చదివారు. చెన్నైకు చెందిన న్యాయవాది జీవానందం వద్ద జూనియర్‌గా చేరి ముందుకు సాగారు. 1988లో మద్రాసు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా అవతరించారు. 1990లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
1997లో కేరళ హైకోర్టు ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా, ఆ తర్వాత రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో పనిచేశారు. 2002 నుంచి 2007 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ సమయంలో అనేక కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చారు. ఇందులో పబ్లిక్ స్థలాల్లో ధూమపానం నిషేధం అన్నది కీలకం. పదవీ విరమణ అనంతరం న్యాయ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ముల్లై పెరియార్ జలవివాదం వ్యవహారంలో తమిళనాడు ప్రతినిధిగా కీలక పాత్రను పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment