రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు ఈనెల 11కు వాయిదా వేసింది.
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు ఈనెల 11కు వాయిదా వేసింది. ఈ పదవికి ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే మోడి ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ బీసీసీఐ ఆ ఫలితాలను ఇప్పుడే ప్రకటించవద్దని, తమ వాదనలను వినాల్సిందిగా ఇదివరకే సుప్రీం కోర్టును కోరింది. మంగళవారమే విచారణ జరగాల్సి ఉన్నా బోర్డు మరింత సమయం కోరడంతో వచ్చే వారానికి కేసు వాయిదా వేసింది.
చండిలాకు బీసీసీఐ సమన్లు
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కున్న రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు అజిత్ చండిలాకు బీసీసీఐ సమన్లు పంపింది. నేడు (బుధవారం) తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. దోషిగా తేలితే చండిలాపై బోర్డు 5 ఏళ్లు లేదా జీవితకాల నిషేధం విధించే అవకాశాలున్నాయి.