జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన లీగల్ కౌన్సిల్ మెహమూద్ అబ్ది ధృవీకరించారు. ఈనెల 19న ఆర్‌సీఏ ఎన్నికలు జరుగనున్నాయి. ఐపీఎల్‌లో ఆర్థిక అవకతవకల కారణంగా మోడిపై బీసీసీఐ ఇప్పటికే జీవితకాల బహిష్కరణ విధించింది. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే.
‘ఆర్‌సీఏ మాజీ అధ్యక్షుడు లలిత్ మోడి ఈనెల 19న జరిగే ఎన్నికల్లో పోటీపడనున్నారు. తనపై జీవితకాల వేటు వేసిన బీసీసీఐని ఆయన సవాల్ చేయనున్నారు. పోటీ విషయంలో ఆయనకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నాగ్‌పూర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇప్పటికే ఆయన అర్హులైన జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా రాజస్థాన్ తమ స్పోర్ట్స్ యాక్ట్-2005 ప్రకారం క్రీడలను నిర్వహిస్తుంది. ఆయా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ల నుంచి మాకు మద్దతు లభిస్తోంది. కచ్చితంగా మా గ్రూపు విజయం సాధిస్తుంది’ అని అబ్ది అన్నారు. ఈ ఎన్నికల పరిశీలకులుగా జస్టిస్ కస్లివాల్‌ను సుప్రీం కోర్టు నియమించింది.
ఆర్‌సీఏ ఎన్నికల బరిలో లలిత్ మోడి
Published Wed, Dec 11 2013 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement