ఆర్‌సీఏ అధ్యక్షుడిగా లలిత్ మోడి | Lalit Modi elected as RCA president | Sakshi
Sakshi News home page

ఆర్‌సీఏ అధ్యక్షుడిగా లలిత్ మోడి

Published Wed, May 7 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

ఆర్‌సీఏ అధ్యక్షుడిగా లలిత్ మోడి

ఆర్‌సీఏ అధ్యక్షుడిగా లలిత్ మోడి

 24-5 ఓట్లతో రాంపాల్‌పై గెలుపు
 ఫలితాలను ప్రకటించిన రిటైర్డ్ జస్టిస్ కస్లివాల్
 కొద్దిగంటల్లోనే ఆర్‌సీఏపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు
 
 జైపూర్: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడి... రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాలుగు నెలల కిందట జరిగిన ఎన్నికల ఫలితాలను... కోర్టు నియమించిన పరిశీలకుడు రిటైర్డ్ జస్టిస్ ఎన్.ఎమ్. కస్లివాల్ మంగళవారం ప్రకటించారు. ఈ ఫలితాల్లో మోడి 24-5 తేడాతో తన ప్రత్యర్థి రాంపాల్ శర్మపై విజయం సాధించి అధ్యక్ష పీఠానికి మార్గం సుగమం చేసుకున్నారు. మొత్తం 33 ఓట్లలో రాంపాల్‌కు ఐదు మాత్రమే దక్కాయి. అయితే ఫలితాలు ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీసీసీఐ.... మోడికి షాకిచ్చింది. ఆర్‌సీఏపై సస్పెన్షన్ విధిస్తూ కొత్త అంకానికి తెరతీసింది. అసోసియేషన్ కార్యకలాపాలను నిర్వహించేందుకు త్వరలో అడ్‌హక్ కమిటీని నియమించనుంది.
 
 ఉపాధ్యక్షుడిగా ఆబ్ది
 ఆర్‌సీఏ తాజా ఫలితాల్లో ఉపాధ్యక్షుడిగా మహ్మద్ ఆబ్ది; కార్యదర్శిగా సోమేంద్ర తివారీ; కోశాధికారిగా పవన్ గోయల్ ఎన్నికయ్యారు. మోడి లండన్‌లో ఉంటున్నా అసోసియేషన్ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ఆయనకు ఉందని ఆబ్ది అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ను ఉపయోగించుకుని ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా కార్యక్రమాలు చేపడతారన్నారు. భారత్‌లో భద్రతా పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మోడి ఇక్కడకు వస్తారని చెప్పారు. బీసీసీఐలో శ్రీనివాసన్ ఇంకా జోక్యం చేసుకుంటున్నారని ఆబ్ది ఆరోపించారు. తాత్కాలిక అధ్యక్షులు గవాస్కర్, శివలాల్ యాదవ్... ఆయన గీసిన గీతను దాటడం లేదన్నారు.
 
 కోర్టుకెళ్తాం...: ఆర్‌సీఏ
 బీసీసీఐ చర్యలపై హైకోర్టును సంప్రదిస్తామని మోడి తరఫు లాయర్ మహ్మద్ ఆబ్ది తెలిపారు. ‘రాష్ట్రంలోని క్రీడా చట్టం ప్రకారం మేం పని చేస్తున్నాం. ఆర్‌సీఏను సస్పెండ్ చేసే హక్కు బీసీసీఐకి లేదు. ఎందుకంటే అది కేవలం రిజిస్టర్డ్ బాడీ మాత్రమే. ఈ విషయాన్ని అన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఒక వ్యక్తిపై కక్ష సాధించేందుకు అసోసియేషన్‌పై నిషేధం విధించడం సరైంది కాదు. ఈ విషయంపై వీలైనంత త్వరగా బీసీసీఐ పత్యేక ఏజీఎమ్ ఏర్పాటు చేయాలని కొంత మంది సభ్యులు కోరుతున్నారు. అక్కడ ఇది చర్చకు వచ్చే అవకాశం ఉంది’ అని ఆబ్ది వివరించారు.
 
 ‘బీసీసీఐలో పాగాకు తొలి అడుగు’
 లండన్: ఆర్‌సీఏ ఎన్నికల్లో గెలవడం... బీసీసీఐలో తిరిగి పాగా వేయడానికి తొలి అడుగు అని మోడి వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా పెద్ద విజయం. ఆర్‌సీఏలో నెలకొన్న సౌకర్యాలపై గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నా. ఈ గెలుపు మాకు తొలి అడుగు. క్రికెట్‌ను ప్రక్షాళన చేయాలి. ఐపీఎల్ ఫిక్సింగ్‌పై విచారణ జరిపేందుకు ముద్గల్ కమిటీని నియమించి సుప్రీంకోర్టు మంచి పని చేసింది. ఆర్‌సీఏ కార్యక్రమాలను మెరుగుపర్చడమే నా ముందున్న లక్ష్యం’ అని మోడి వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా భారత్‌కు తిరిగి వస్తానని చెప్పిన మోడి బీసీసీఐ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
 
 అసలు కథ ఇది...
 ఐపీఎల్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని మోడిని బహిష్కరించిన బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో గత నాలుగేళ్లుగా లండన్‌లో నివసిస్తున్న మోడి ఈ అంశంపై చాలాసార్లు కోర్టుల్లో పోరాడినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. అయితే ఆర్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైతే బోర్డుతో నేరుగా సంబంధాలు జరిపే అవకాశం ఉండటంతో ఎన్నికల బరిలోకి దిగాడు. కానీ ఎన్నికల్లో పాల్గొనకుండా బీసీసీఐ చాలా విధాలుగా అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది.
 
 చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఫలితాల విడుదల్లో జాప్యం జరిగినా చివరకు మోడి అధ్యక్షుడిగా ఎన్నికవడం బోర్డుకు రుచించలేదు. దీంతో సస్పెన్షన్ ఆయుధాన్ని ప్రయోగించింది. ‘సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా బోర్డు నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వారిపై చర్య తీసుకునే హక్కు బీసీసీఐకి ఉంది. ఇదే తరహాలో బోర్డు నియమావళిలోని నిబంధన 32 (7) ప్రకారం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్... ఆర్‌సీఏ మెంబర్‌షిప్‌ను సస్పెండ్ చేశారు’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement