ముంబై: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అధ్యక్షుడిగా ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి నియామకాన్ని అడ్డుకునేందుకు బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈమేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. క్రికెట్ బోర్డు నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నప్పటికీ లెక్కచేయకుండా గత నెల 19న జరిగిన ఆర్‌సీఏ ఎన్నికల్లో మోడి అధ్యక్ష బరిలోకి దిగారు. వచ్చే వారం సుప్రీం కోర్టు ప్రకటించే ఈ ఫలితాల్లో మోడి దాదాపుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
ఆర్‌సీఏ అనేది రాజస్థాన్ క్రీడా చట్టం కిందికి వస్తుందని, ఈ ఎన్నికల్లో బోర్డు నిషేధం పనిచేయదని మోడి మద్దతుదారులు వాదిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చట్టంపై ఆర్‌సీఏ మాజీ కార్యదర్శి కిశోర్ రుంగ్తా సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు బీసీసీఐ కూడా దీంట్లో ఇంప్లీడ్ అయ్యింది. ఈనెల 6న ఇది విచారణకు రానుంది. ఆర్‌సీఏలో మోడి తిరిగి క్రియాశీలకంగా మారితే బోర్డు ప్రతిష్ట దెబ్బతింటుందని, మోడి అభ్యర్థిత్వంపై బీసీసీఐ అభ్యంతరాలను ఆర్‌సీఏ పట్టించుకోకపోవడంతో అతడి నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకోకూడదని తమ పిటిషన్‌లో పేర్కొంది.
మోడిపై సుప్రీంకు వెళ్లిన బోర్డు
Published Fri, Jan 3 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement