ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌పై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి లాయర్ మెహమూద్ అబ్ది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా హక్కుల విషయంలో క్రికెట్ బోర్డుకు శ్రీనివాసన్ రూ.2,882 కోట్ల మేర నష్టం కలిగించాడని ఆరోపించారు. ఆయతో పాటు ఐపీఎల్ స్పాన్సరర్స్ మల్టీ స్క్రీన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎస్‌ఎం) అధికారులపై క్రిమినల్ కేసును దాఖలు చేయాలని గంగానగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో అబ్ది ఈ ఫిర్యాదు చేశారు.
ఈ అసోసియేషన్‌కు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఉంది. ‘సెప్టెంబర్ 23న మాకు అబ్ది లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. శ్రీనివాసన్ ఇతరులపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆయన కోరారు. అబ్ది నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశాం. అయితే ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల నుంచి ఇంకా ఎలాంటి స్టేట్‌మెంట్ తీసుకోలేదు. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణను ప్రారంభించాం.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. మా నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. వారు దీన్ని కేసు పెట్టదగిన నేరమా? కాదా? అని నిర్ణయిస్తారు’ అని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామేశ్వర్ సూప్లే వివరించారు. మరోవైపు తామెలాంటి తప్పు చేయలేదని, పోలీసులకు సహకరిస్తామని బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ తెలిపారు.
శ్రీనివాసన్‌పై మోడి లాయర్ ఫిర్యాదు
Published Fri, Oct 25 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement