N.srinivasan
-
ఎవరైనా రూ.12.5 కోట్లు వదులుకుంటారా: రైనా
ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌బై ప్రకటించిన వెంటనే సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే త్వరలో యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్లో సీఎస్కే(చెన్నై సూపర్‌కింగ్స్) తరుపున రైనా ఆడతాడని అందరు భావించారు. తన మేనమామ దారుణ హత్య నేపథ్యంలో హుటాహుటిన భారత్‌కు బయల్దేరాడు. అయితే సీఎస్కే యజమాని ఎన్.శ్రీనివాసన్‌తో పొసగకనే రైనా ఇంటిబాట పట్టాడని పుకార్లు వచ్చాయి. అయితే రైనా మాత్రం శ్రీనివాసన్ తనకు తండ్రి లాంటివారని చెబుతున్నాడు. ఈ అంశంపై ఎన్.శ్రీనివాసన్ స్పందిస్తూ.. రైనా చెప్పింది నిజమేనని, అతనిని తన సొంత కొడుకు లాగా చూసుకున్నట్లు శ్రీనివాసన్ తెలిపారు. శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఐపీఎల్లో సీఎస్కే వరుస విజయాలకు ప్రధాన కారణం ఆటగాళ్ల వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే అని తెలిపారు. గత నలబై సంవత్సరాలుగా ఇండియా సిమెంట్స్ క్రికెట్ ఫ్రాంచైజీలతో సంబంధం ఉంది. ఐపీఎల్లో రైనా ఆడాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు శ్రీనివాసన్ స్పందిస్తూ.. తాము టీమ్‌ను మాత్రమే ఫ్రాంచైజీగా(కొనుగోలు) తీసుకున్నామని, ఆటగాళ్లను కాదని తెలిపారు. కాగా రైనా ఐపీఎల్లో ఆడతాడో లేదో తాను చెప్పలేనని, తాను జట్టుకు కెప్టెన్‌ను కాదని అన్నారు. సీఎస్కేకు అద్భుతమైన కెప్టెన్ ఉండగా ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని శ్రీనివాసన్ పేర్కొన్నాడు. అయితే తాజాగా రైనా స్పందిస్తూ తనకు, చెన్నై టీంకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. కుటుంబం కోసమే ఐపీఎల్ నుంచి వెనక్కొచ్చానని పేర్కొన్నాడు. తనకు సీఎస్కే తో రూ.12.5 కోట్ల కాంట్రాక్టు ఉందని, చిన్న కారణాలతో ఎవరైనా రూ.12.5 కోట్లు వదులుకుంటారా అని ప్రశ్నించారు. శ్రీనివాసన్ తనకు తండ్రిలాంటి వారని, ఆయన తనకు అండగా నిలిచారని ఒకవేళ వీలు కుదిరితే ఈ సీజన్లోనే చెన్నైకి ఆడతానని రైనా స్పష్టం చేశారు. చదవండి: రైనా ఎగ్జిట్‌కు ప్రధాన కారణం అదేనా? -
అధ్యక్షుడిగా పోటీ పడేది ఎవరు?
కొనసాగుతున్న సస్పెన్స్ చెన్నై: బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగేందుకు ఇంకా ఒక రోజు సమయమే మిగిలి ఉన్నా బోర్డు అధ్యక్షుడిగా బరిలో ఉండబోయేదెవరో ఇంకా తేలలేదు. ఎన్.శ్రీనివాసన్ వర్గంతో పాటు ప్రత్యర్థి వర్గం కూడా ఈ విషయంలో నోరు మెదపడం లేదు. ఈనెల 2న జరిగే ఈ ఎన్నికల్లో శ్రీని పోటీ పడడం లేదు కాబట్టి తనకు అనుకూలమైన వ్యక్తిని బరిలోకి దించే అవకాశం ఉంది. అటు శ్రీని వైరి వర్గం కూడా దీటైన అభ్యర్థి కోసం పావులు కదుపుతోంది. ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్ వైపు వీరు మొగ్గు చూపుతున్నా ఆయన నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకుంటే నూతన అధ్యక్షుడి ఎన్నికల్లో అధికార బీజేపీ కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే మొత్తం 31 ఓట్లలో ఎనిమిది ఓట్లను ఇది ప్రభావితం చేయనుంది. ఈనేపథ్యంలో ఇటీవల శరద్ పవార్ ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే మోదీ నుంచి ఆయనకు ఎలాంటి హామీ లభించలేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తేల్చారు. -
ఐపీఎల్‌కు దూరంగా ఉంటా: శ్రీనివాసన్
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే... ఐపీఎల్ పాలన వ్యవహారాలకు, ఇతర అంశాలకు దూరంగా ఉంటానని ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి అండర్ టేకింగ్‌ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీని తరఫు లాయర్ కపిల్ సిబల్ కోర్టుకు వెల్లడించారు. ఒకవేళ బోర్డు అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైనా... ప్రతిపాదిత హైపవర్ ప్యానెల్ క్లీన్చిట్ ఇచ్చే వరకు ఐపీఎల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోరన్నారు. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం కూడా విచారణ కొనసాగించింది. మరోవైపు ప్రతిపాదిత హైపవర్ కమిటీ ఏర్పాటును బీసీసీఐ వ్యతిరేకించింది. శ్రీనివాసన్ అంశంలోగానీ, ముద్గల్ కమిటీ నివేదిక ఆధారంగా దోషులపై ఈ కమిటీ చర్యలు తీసుకోవడంగానీ సాధ్యంకాదని పేర్కొంది. ‘కమిటీ ఏర్పాటు వల్ల బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి, నిర్ణయం తీసుకునే అధికారంపై ప్రభావం పడుతుంది. ఒకవేళ కచ్చితంగా కమిటీనే కావాలనుకుంటే బోర్డు గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకోవాలి’ అని బీసీసీఐ న్యాయవాది సీఏ సుందరం తెలిపారు. ఎన్నికలు జనవరి 31 వరకు వాయిదా బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం, ఆఫీసు బేరర్ల ఎన్నికలను వచ్చే ఏడాది జనవరి 31 వరకు వాయిదా వేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. షెడ్యూల్ ప్రకారం ఏజీఎమ్ ఈనెల 17న జరగాల్సి ఉంది. కానీ ఆ తేదీలోపు ఈ కేసు విచారణ పూర్తయ్యేటట్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
‘జోక్యం చేసుకోలేము’
ఏజీఎంలో శ్రీనివాసన్ పాల్గొనే అంశంపై సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో పాల్గొనకుండా ఎన్.శ్రీనివాసన్‌ను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం గత నెల 30న జరగాల్సిన ఏజీఎం శ్రీనివాసన్ కోసమే నవంబర్ 20కి వాయిదా వేశారని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై విచారణ చేస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. ‘వచ్చే నెల 10న మాకు ముద్గల్ నివేదిక అందుతుంది. అది వచ్చే దాకా వేచి చూద్దాం. ఆ తర్వాతే బోర్డు ఎన్నికల గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనకుండా శ్రీనివాసన్‌ను అడ్డుకోవాలని మీరు (సీఏబీ) కోరినా నివేదికలో ఆయన నిర్దోషిగా తేలితే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం మాకు ఏజీఎంపై ఎలాంటి ఆందోళన లేదు’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్ఎంఐ కలీఫుల్లాలతో కూడిన బెంచ్ తేల్చి చెప్పింది. -
మళ్లీ శ్రీనివాసన్‌నే ఎన్నుకుందాం!
అనధికార సమావేశంలో బీసీసీఐ సభ్యుల నిర్ణయం చెన్నై: బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్.శ్రీనివాసన్‌ను మరోసారి ఎన్నుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్)పై చర్చించేందుకు ఆదివారం అనధికారికంగా సమావేశమైన 21 మంది బోర్డు సభ్యుల్లో ఎక్కువ మంది ఆయనకే మద్దతు పలికారు. ఈసారి ఈస్ట్‌జోన్ సభ్యులు మద్దతిచ్చిన వ్యక్తే అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈస్ట్‌జోన్‌కు చెందిన ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు నేరుగా, ఒకరు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని శ్రీనికి మద్దతిచ్చారు. మరోవైపు నవంబర్ తొలి వారంలో స్పాట్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ తుది నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనుంది. దీంతో ఈనెల 30న జరగాల్సిన ఏజీఎమ్‌ను అప్పటి వరకు వాయిదా వేయాలని నిర్ణయించారు. దీనికోసం ఈనెల 26నే వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. -
శ్రీని కోసమే బోర్డు పనిచేస్తోంది
అబ్ది ఆరోపణ న్యూఢిల్లీ: ఆర్సీఏ అధ్యక్షుడు లలిత్ మోడిపై ఎన్.శ్రీనివాసన్‌కు ఉన్న ద్వేషాన్ని సంతృప్తి పరిచే విధంగానే బీసీసీఐ నడుచుకుంటోందని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మెహమూద్ అబ్ది ధ్వజమెత్తారు. జీవిత కాల నిషేధానికి గురైన మోడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకే ఆర్‌సీఏను సస్పెండ్ చేశామని బీసీసీఐ ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. ‘ఆర్‌సీఏపై నిషేధం చాలా హేయమైన చర్య. ఇది అనైతికం. ఈ అంశంలో నీతి నియమాల గురించి బీసీసీఐ మాట్లాడుతున్న విధానం అహంకారపూరితంగా ఉంది. నిజానికి బోర్డు ఇంకా శ్రీనివాసన్ పాలనలోనే ఉంది. ఈ కారణంగానే ఆర్‌సీఏపై వేటు పడింది. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్.. శ్రీని చేతిలో కీలుబొమ్మ లాంటి వారు’ అని అబ్ది విమర్శించారు. -
విచారణ కమిటీ ఏర్పాటుపై తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ఆరోపణలను విచారించాల్సిన కమిటీ ఏర్పాటును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎన్.శ్రీనివాసన్‌తో పాటు మరో 12మందిపై విచారణ జరిపేందుకు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిషన్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారనే కథనాలు వినిపించాయి. అయితే ఈ కమిటీపై బీసీసీఐ అభ్యంతరం లేవనెత్తింది. ఈ కమిషన్ స్థానంలో తాజాగా మరో కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో జస్టిస్ ఏకే పట్నాయక్‌తో కూడిన బెంచ్ తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇంతకుముందు ఇదే అంశంపై బోర్డు వర్కింగ్ కమిటీ... త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ముద్గల్ కమిటీయే ఈ విచారణకు ముందుకు వస్తే బాగుంటుందని సూచనప్రాయంగా వెల్లడించింది. దీనికి అటు ముద్గల్ కమిటీ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే ఆ కమిటీపై తమకు నమ్మకం లేదని, వారు ఇప్పటిదాకా అందించిన నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీసీఐ ఆరోపించింది. శ్రీనివాసన్, మరో 12 మందిపై ముద్గల్ కమిటీ చేసిన ఆరోపణలపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయానికి రాలే దని, కొత్తగా ఏర్పాటయ్యే కమిటీ ఈ వ్యవహారాన్ని చూస్తుందని కోర్టు తెలిపింది. కమిటీ నివేదికలో ఉన్న విషయాలను రహస్యంగా ఉంచేందుకే ముద్గల్ కమిటీకి విచారణ అధికారం అప్పగించాలని భావించామని, మరో కమిటీ వస్తే ఇందులోని విషయాలు వారికి కూడా తెలిసిపోతాయని కోర్టు అభిప్రాయపడింది. సిద్ధంగా ఉన్న ముద్గల్ కమిటీ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపేందుకు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తమ సంసిద్ధతను తెలిపింది. ఈ విషయంలో తమకు సహాయకంగా ఉండేందుకు సీబీఐ (స్పెషల్ డెరైక్టర్) మాజీ అధికారి ఎంఎల్ శర్మ సేవలను వినియోగించుకుంటామని కోర్టుకు తెలిపింది. శర్మతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నైలకు చెందిన ఒక్కో పోలీస్ అధికారి... ఓ మాజీ క్రికెటర్ ఉంటాడని బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. -
సందిగ్ధంలో శ్రీనివాసన్
రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి ఆదేశాలను పునః సమీక్షించమని సుప్రీంకోర్టునే కోరే అవకాశం! చెన్నై: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఎన్. శ్రీనివాసన్ సందిగ్ధావస్థకు లోనవుతున్నారు. కోర్టు చెప్పినదాని ప్రకారం రాజీనామా చేస్తే ఎలాంటి వివాదం లేకుండా సమస్య సమసిపోతుంది. అయితే వెంటనే పదవి నుంచి తప్పుకోకుండా న్యాయపరమైన ఇతర ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నారు. తనను తప్పుకోమంటూ జస్టిస్ పట్నాయక్ బెంచ్ ఆదేశమిస్తే దానిపై అప్పీలు చేయాలని భావిస్తున్నారు. అప్పీలు చేయడానికి శ్రీనివాసన్ ముందు రెండు రకాల అవకాశాలున్నాయి. ఇందులో మొదటిది రివ్యూ పిటిషన్ ద్వారా... రెండోది క్యురేటివ్ పిటిషన్ ద్వారా అప్పీలు చేయవచ్చు. అయితే ఈ రెండు మార్గాల్లోనూ పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని న్యాయ పరిజ్ఞానం ఉన్న బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. ‘సాధారణంగా రివ్యూ, క్యురేటివ్ రెండింటికీ న్యాయపరంగా పరిమితులు ఉన్నాయి. రివ్యూ అంటే సవాల్ చేయడంలాంటిది కాదు. అయితే అప్పీల్‌ను పరిశీలనలోకి తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా న్యాయమూర్తుల విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. అదే విధంగా క్యూరేటివ్ పిటిషన్ పరిస్థితి కూడా ఇలాగే ఉండవచ్చు’ అని ఆయన అన్నారు. శ్రీనివాసన్‌కు శస్త్ర చికిత్స సుప్రీంకోర్టు సూచనలపై శ్రీనివాసన్ తన మౌనాన్ని కొనసాగిస్తున్నారు. బుధవారం ఆయన కంటికి కాటరాక్ట్ సర్జరీ జరిగింది. ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడిని పరామర్శించేందుకు ఆయన న్యాయవాది పీఎస్ రామన్ వచ్చారు. ఆయన కూడా తాజా పరిణామాలపై, తదుపరి చర్యలపై మాట్లాడేందుకు నిరాకరించారు. -
తప్పుకుంటారా...తప్పించాలా!
శ్రీనివాసన్‌కు సుప్రీంకోర్టు అల్టిమేటం న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు సంబంధించి అవినీతి వ్యవహారాల్లో పారదర్శక విచారణ కోసం బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ రెండు రోజుల్లోగా తన పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుపై జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తన అభిప్రాయాలు వెల్లడించింది. నేరుగా ‘ఆదేశం’ ఇవ్వకపోయినా... సుప్రీంకోర్టు ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంది. ‘శ్రీనివాసన్ రాజీనామా చేయాలి. లేదంటే అలాంటి ఆదేశాలు జారీ చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు. ఇన్ని ఆరోపణల తర్వాత కూడా ఆయన ఎలా కొనసాగుతారు. ఇది క్రికెట్‌కు మంచిది కాదు’ అని పట్నాయక్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు సంబంధించి ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో చాలా తీవ్రమైన ఆరోపణలు, కీలకాంశాలు ఉన్నాయని, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బోర్డు అధ్యక్షుడు పక్కకు తప్పుకుంటే గానీ, వాస్తవాలు వెల్లడి కావని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసుపై గురువారంనాడు కూడా వాదనలు కొనసాగుతాయి. నివేదికలో ఉన్న వివరాలు, పేర్లు బయటపెట్టరాదని ఈ విచారణ సందర్భంగా బీసీసీఐ న్యాయవాదులు మరోసారి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశాలను తాను ఇంకా పూర్తిగా చదవలేదని చెప్పిన శ్రీనివాసన్ ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అయితే బోర్డు ఉపాధ్యక్షుడు రవి సావంత్ మాత్రం శ్రీనికి రాజీనామా తప్ప మరో మార్గం లేదని అన్నారు. అధ్యక్ష బరిలో శివలాల్ యాదవ్! సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడమే మంచిదని బీసీసీఐలోని ముగ్గురు ఉపాధ్యక్షులు రవి సావంత్, శివలాల్ యాదవ్, చిత్రక్ మిత్రా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రాబోయే రెండు రోజుల్లో శ్రీనివాసన్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ ఉపాధ్యక్షుడు, సౌత్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శివలాల్ యాదవ్ అధ్యక్షుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కూడా శ్రీనివాసన్ తాత్కాలికంగా తప్పుకున్నప్పుడు శివలాల్ పేరు వినిపించినా... దాల్మియాకు పగ్గాలు దక్కాయి. అయితే అప్పట్లో తాత్కాలికంగానే ఆయన పక్కన ఉన్నారు. కానీ ఈసారి రాజీనామా చేయాలంటూ నేరుగా సుప్రీంకోర్టే చెబుతోంది. కాబట్టి ఇప్పుడు పూర్థిస్థాయి అధ్యక్షుడి అవసరం బీసీసీఐకి ఉంది. ‘నాకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నేను దాని వెంట పరుగెత్తడం లేదు. రాకపోయినా ఇబ్బంది లేదు. ఇన్నాళ్లు ఉపాధ్యక్షుడిగా పెద్ద హోదాలోనే పని చేశాను కాబట్టి అతిగా ఆశించడం లేదు’ అని శివలాల్ ‘సాక్షి’తో తన అభిప్రాయం వెల్లడించారు. -
ఐఓఏ పీఠంపై రామచంద్రన్
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నూతన అధ్యక్షుడిగా ప్రపంచ స్క్వాష్ సమాఖ్య అధ్యక్షుడు నారాయణస్వామి రామచంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎన్.శ్రీనివాసన్‌కు స్వయానా సోదరుడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో రామచంద్రన్‌తోపాటు ప్రధాన కార్యదర్శిగా భారత ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు రాజీవ్ మెహతా, కోశాధికారిగా అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నాలు కూడా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఎనిమిది ఉపాధ్యక్ష పదవుల కోసం తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడడంతో అనివార్యంగా జరిగిన ఎన్నికల్లో భారత రోయింగ్ సమాఖ్య చీఫ్ రాజ్‌లక్ష్మి సింగ్ దేవ్ ఓటమిపాలయ్యారు. ఉపాధ్యక్షులుగా అనురాగ్ ఠాకూర్, అఖిలేశ్ దాస్‌గుప్తా, జనార్దన్‌సింగ్ గెహ్లాట్, ఆర్.కె.ఆనంద్, జి.ఎస్.మంధర్, తర్లోచన్‌సింగ్, బీరేంద్ర ప్రసాద్ బైశ్యా, పర్మిందర్‌సింగ్ దిండ్సాలు ఎన్నికయ్యారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రతినిధులు పీర్ మీరో, ఫ్రాన్సిస్కో జె.ఎలిజాల్డే, హుసేన్ అల్ ముసాలమ్లు ఈ ఎన్నికలకు పరిశీలకులుగా వ్యవహరించారు. తాజా ఎన్నికలతో ఐఓఏపై ఐఓసీ విధించిన నిషేధం ఎత్తివేసేందుకు మార్గం సుగమమైంది. ఐఓఏలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుండడం, ఒలింపిక్ చార్టర్‌కు విరుద్ధంగా కళంకిత వ్యక్తులు పదవులు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఐఓసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే 2012 నవంబర్‌లో ఐఓఏ ఎన్నికలు జరిగి అధ్యక్ష, కార్యదర్శులుగా అభయ్‌సింగ్ చౌతాలా, లలిత్ భానోత్లు ఎన్నికైనా వారిని ఐఓసీ గుర్తించలేదు. సరికదా... తిరిగి ఎన్నికలు నిర్వహిస్తేనే నిషేధం ఎత్తివేతపై పరిశీలిస్తామని మెలిక పెట్టింది. తాజా ఎన్నికలతో ఐఓఏకు క్లీన్ కార్యవర్గం లభించినట్లేనని ఐఓసీ భావిస్తోంది. సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ ముగిసే ఈ నెల 23 లోగా తాము ఐఓసీ చీఫ్‌కు నివేదిక సమర్పిస్తామని ఎన్నికలకు పరిశీలకుడిగా వ్యవహరించిన రాబిన్ మిచెల్ తెలిపారు. ఇదే జరిగితే ఐఓఏపై 14 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తే సోచి ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో భారత అథ్లెట్ల చేతిలో కనిపించని జాతీయ పతాకాన్ని ముగింపు వేడుకల్లో చూసే అవకాశం దక్కవచ్చు. -
ఐసీసీ చైర్మన్ గా శ్రీనివాసన్ ఎంపిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఎంపికయ్యారు. త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నఆయన రెండేళ్లు పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ పాలక మండలి సమావేశం ఆయన్నుశనివారం చైర్మన్ గా ఎన్నుకుంది. శ్రీనివాసన్ కు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు మద్దతుగా నిలివడంతో ఆయన ఎన్నికకు మార్గం సుగుమమైంది. పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికాలు శ్రీనివాసన్ విముఖత వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు గురువారం చెన్నైలో జరిగే బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈమేరకు చర్చ జరిగింది. ఆ పదవి విషయంలో ఆయనకు బీసీసీఐ నుంచి పూర్తి మద్దతు నిలిచింది. కానీ ఐసీసీలో ఇంతకాలం చైర్మన్ పదవి లేకపోవడం గమనార్హం. -
భారత్ బలంగా ఉంటే క్రికెట్‌కు మంచిది
కొత్త నిబంధనలను సమర్థించుకున్న శ్రీనివాసన్ న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో చేయబోయే కొత్త మార్పులు క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తాయని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ అన్నారు. కొన్ని సభ్య దేశాలనుంచి విమర్శలు వస్తున్నా తాజా ప్రతిపాదనలను ఆయన సమర్ధించుకున్నారు. భారత క్రికెట్ ఎంత బలంగా ఉంటే ప్రపంచ క్రికెట్‌కు అంత మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్రపంచ క్రికెట్‌కు నాయకత్వం వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ఐసీసీ కొత్త పద్ధతిని మేం సమర్థవంతంగా అమలు చేస్తాం. ఇది ప్రపంచ క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఆర్ధికపరంగా భారత్ బలంగా ఉండటం అందరికీ అవసరం’ అని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 8న సింగపూర్‌లో ఐసీసీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. కొత్త ప్రతిపాదనలు అనూహ్యమేమీ కాదని, చాలా ముందే అన్ని దేశాలకు తాను వివరించానని శ్రీనివాసన్ చెప్పారు. ‘మా ప్రతిపాదనల గురించి చెప్పి సలహాలు, సూచనలు స్వేచ్ఛగా చెప్పాలని కోరాం. అయితే ఎవరో ఒకరు ముందుగా డ్రాఫ్ట్ సిద్ధం చేయాలి కాబట్టి ఆ బాధ్యత మేం తీసుకున్నాం. అనేక సవరణల తర్వాతే ప్రస్తుత ప్రతిపాదనలను తయారుచేశాం’ అని శ్రీనివాసన్ వివరించారు. మూడు దేశాలతో ఏర్పాటు చేస్తున్న కమిటీ, ఐసీసీలో ఉన్న ఇతర కమిటీల్లాంటిదేనని...ఐసీసీ బోర్డుకే అన్ని నిర్ణయాధికారాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. కొత్త ప్రతిపాదనలతో ఎఫ్టీపీ రద్దవుతుందని, పెద్ద జట్ల దయపై ఇతర టీమ్‌లు ఆధార పడి ఉండాల్సి వస్తుందన్న వాదనను ఆయన కొట్టి పారేశారు. ‘ ప్రస్తుత ఎఫ్టీపీ ఎలాంటి గ్యారంటీ లేకుండానే సాగుతోంది. అదేమీ న్యాయపత్రం కాదు. దానికీ ఎవరూ కట్టుబడటం లేదు. అయితే ఇకపై ద్వైపాక్షిక ఒప్పందాలు అంతకంటే బలంగా ఉంటాయి. ఎఫ్టీపీ మరింత సమర్ధంగా పని చేస్తుంది. అసోసియేట్ దేశాలు కూడా సత్తా ఉంటే పెద్ద జట్లతో ఆడే అవకాశం మేం కల్పిస్తాం. అయితే ఇదేమీ ఒక్క సారిగా జరగదు. ఇది 10-20 ఏళ్ల ప్రక్రియ’ అని శ్రీనివాసన్ వివరణ ఇచ్చారు. -
విచారణకు హాజరైన గురునాథ్
చెన్నై: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్లు... ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారిస్తోన్న ముద్గల్ కమిటీ ముందు హాజరయ్యారు. సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ చెన్నైలో వరుసగా అందర్నీ విచారిస్తోంది. అయితే విచారణకు హాజరైన మెయ్యప్పన్ మాత్రం తాను ఏ విషయాన్ని వెల్లడించలేనని ఓ లేఖను కమిటీకి అందజేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్ శ్రీకాంత్, ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ రామన్లను కూడా ఈ కమిటీ ప్రశ్నించింది. మరో రెండు రోజుల్లో బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ రవి సావంత్‌ను విచారించనుంది. ముగ్గురు సభ్యుల ఈ కమిటీ ఇప్పటి వరకు శ్రీశాంత్, చండిలా, సిద్ధార్ధ్త్రివేది, ఢిల్లీ, ముంబై పోలీసు అధికారులతో పాటు అనేక మందిని విచారించి వివరాలు సేకరించింది. -
సచిన్.. ప్రపంచంలోనే మేటి ఆటగాడు
సాక్షి, తిరుమల: సచిన్ టెండూల్కర్ ప్రపంచంలోనే మేటి క్రికెటర్ అని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అన్నారు. బుధవారం ఆయన తిరుమలకు వచ్చారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి, దర్శనంతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ముంబైలో జరిగే సచిన్ టెండూల్కర్ చివరి టెస్టును ప్రతి ఒక్కరూ చూసి ఆనందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తిరుమలేశుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీవారి ఆలయం ముందు శ్రీనివాసన్ -
శ్రీనివాసన్‌కు ఎదురుదెబ్బ
జైపూర్: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిక్సింగ్ ఆరోపణలతో ఆయనతోపాటు చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ మాజీ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని గంగానగర్ డిస్ట్రిక్ట్ అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సతీష్ చంద్రా గోద్రా... జ్యోతినగర్ పోలీసులను ఆదేశించారు. ఐపీఎల్-6లో మే 12న జరిగిన చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు గురైందని కోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన జడ్జి పై ఆదేశాలు జారీ చేశారు. గంగానగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి తరఫు లాయర్ మహ్మద్ అబ్ది అక్టోబర్ 26, 28న ఈ పిటిషన్ వేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసం మ్యాచ్‌ల సందర్భంగా శ్రీనివాసన్, గురునాథ్‌లు చెన్నై జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని అబ్ది ఆరోపించారు. ఫిక్సింగ్‌కు సంబంధించి శ్రీనివాసన్ కుమారుడు అశ్విన్, బీసీసీఐ మాజీ చీఫ్ ఐఎస్ బింద్రా చేస్తున్న ఆరోపణలు ఆయన విశ్వసనీయతను శంకిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పిటిషన్లో జతపర్చిన అబ్ది శ్రీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
మెయ్యప్పన్ గురించి తెలిసింది చెప్పండి
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ కార్యరంగంలోకి దిగింది. ఈ విషయంపై ఎవరిదగ్గరైనా కీలక సమారం ఉంటే తమకు మెయిల్ చేయాల్సిందిగా కోరింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ఈ త్రిసభ్య ప్యానెల్ పనిచేస్తుంది. గురునాథ్‌పై గతంలో బీసీసీఐ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీకి వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) సుప్రీంలో కేసు వేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా గురునాథ్ వ్యవహారంపై తిరిగి సుప్రీం కోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గురునాథ్ గురించి ఎవరిదగ్గరైనా అతి కీలక సమాచారం ఉంటే వారిని సభ్యులు వ్యక్తిగతంగా ఆహ్వానించి కలుస్తారు. వీరి వివరాలను కమిటీ గోప్యంగా ఉంచనుంది. కమిటీ పనితీరు గురించి పూర్తి వివరాలను త్వరలోనే బీసీసీఐకి పంపుతామని ఈ త్రిసభ్య కమిటీ కార్యదర్శి విదుష్పత్ సింఘానియా తెలిపారు. -
శ్రీనివాసన్‌పై మోడి లాయర్ ఫిర్యాదు
ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌పై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి లాయర్ మెహమూద్ అబ్ది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా హక్కుల విషయంలో క్రికెట్ బోర్డుకు శ్రీనివాసన్ రూ.2,882 కోట్ల మేర నష్టం కలిగించాడని ఆరోపించారు. ఆయతో పాటు ఐపీఎల్ స్పాన్సరర్స్ మల్టీ స్క్రీన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎస్ఎం) అధికారులపై క్రిమినల్ కేసును దాఖలు చేయాలని గంగానగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో అబ్ది ఈ ఫిర్యాదు చేశారు. ఈ అసోసియేషన్‌కు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఉంది. ‘సెప్టెంబర్ 23న మాకు అబ్ది లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. శ్రీనివాసన్ ఇతరులపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆయన కోరారు. అబ్ది నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేశాం. అయితే ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల నుంచి ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణను ప్రారంభించాం. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మా నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. వారు దీన్ని కేసు పెట్టదగిన నేరమా? కాదా? అని నిర్ణయిస్తారు’ అని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రామేశ్వర్ సూప్లే వివరించారు. మరోవైపు తామెలాంటి తప్పు చేయలేదని, పోలీసులకు సహకరిస్తామని బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ తెలిపారు. -
డిసెంబర్లో సఫారీ పర్యటన!
లండన్: కొనసాగుతుందా.. లేదా అనే సందిగ్ధంలో ఉన్న భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన దాదాపుగా ఖరారైనట్టే. డిసెంబర్లో రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, ఓ వార్మప్ గేమ్‌తో పాటు రెండు టెస్టులు జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) అధ్యక్షుడు క్రిస్ నెన్‌జాని ఐసీసీ బోర్డు సమావేశాల సందర్భంగా ఈ టూర్‌పై ఓ అంగీకారానికి వచ్చారు. ఈనెల 26న చెన్నైలో జరిగే బోర్డు వర్కింగ్ కమిటీలో ఈ టూర్‌ను లాంఛనంగా ప్రకటించనున్నారు. డిసెంబర్ తొలి వారంలో వన్డే సిరీస్ ప్రారంభమై బాక్సింగ్ డే టెస్టుతో పర్యటన ముగుస్తుంది. గత జూలైలో భారత్‌ను సంప్రదించకుండానే టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు సీఎస్ఏ సీఈ హరూన్ లోర్గాట్తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ పర్యటనపై భారత్ విముఖంగా ఉంటూ వస్తోంది. అయితే పర్యటన రద్దయితే ఎదురయ్యే ఆర్థిక నష్టాన్ని అంచనా వేసుకున్న సీఎస్ఏ దిద్దుబాటు చర్యలకు దిగింది. లోర్గాట్‌ను లాంగ్ లీవ్‌లో పంపడమే కాకుండా భవిష్యత్‌లో బీసీసీఐతో ఎలాంటి సంప్రదింపులకు దిగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. -
శ్రీనివాసన్‌కు పచ్చజెండా
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికై కూడా బాధ్యతలకు దూరంగా ఉంటున్న ఎన్.శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఐపీఎల్ వ్యవహారాల్లో తలదూర్చకుండా బోర్డు అధ్యక్షుడిగా తన విధులు నిర్వర్తించుకునేందుకు జస్టిస్ ఏకే పట్నాయక్, జేఎస్ కేహర్తో కూడిన బెంచ్ మంగళవారం అనుమతిచ్చింది. శ్రీని అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వివాదంలో ఇరుక్కున్నపట్నించీ ఆయన బీసీసీఐ చీఫ్ పదవికి దూరంగా ఉంటున్నారు. గత నెల 29న ఏజీఎంలో మరో ఏడాదిపాటు ఆయన బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కేసు వేయడంతో తీర్పు వచ్చేదాకా పదవికి దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నాటి తీర్పుతో దాదాపు నాలుగు నెలల అనంతరం ఆయన బోర్డు కార్యకలాపాల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. త్రిసభ్య కమిటీ నియామకం ఐపీఎల్-6లో వెలుగు చూసిన బెట్టింగ్ వ్యవహారంపై మరోసారి విచారణ కోసం హర్యానా-పంజాబ్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీకి సుప్రీం ఆమోదముద్ర వేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్ కుంద్రాపై వచ్చిన బెట్టింగ్ ఆరోపణలపై ఈ కమిటీ స్వతంత్రంగా విచారణ జరిపి నాలుగు నెలల్లోగా తమ నివేదికను కోర్టుకు అందిస్తుంది. ఈ కమిటీలో సభ్యులుగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్.నాగేశ్వరరావు, అస్సాం క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు నిలయ్ దత్తా ఉన్నారు. ఈ విచారణలో ఎన్.శ్రీనివాసన్ ఎట్టి పరిస్థితిల్లోనూ జోక్యం చేసుకోరాదని, అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా ఆదేశించింది. అటు ఈ విచారణ పూర్తయ్యేదాకా శ్రీనివాసన్‌ను బోర్డు పదవికి దూరంగా ఉంచాలని సీఏబీ చేసిన విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది. తాము ఏర్పాటు చేసిన కమిటీపై ఎలాంటి అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని, కమిటీతో శ్రీనివాసన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. సీఏబీ పిటిషన్లో పేర్కొన్న అన్ని అంశాలను కమిటీ పరిగణలోకి తీసుకుని విచారిస్తుందని హామీ ఇచ్చింది. నివేదిక సమర్పించాక తీర్పు వెలువరిస్తామని పేర్కొంది. తీర్పుతో సంతోషంగా ఉన్నా: శ్రీనివాసన్ భారత క్రికెట్ బోర్డు చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించేందుకు సుప్రీం కోర్టు తనకు అనుమతివ్వడంపై ఎన్.శ్రీనివాసన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘బోర్డు అధ్యక్షుడిగా నా బాధ్యతలు నెరవేర్చాలని సుప్రీం చెప్పినట్టుగా భావిస్తున్నాను. ఈ తీర్పుపై చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే బోర్డు కార్యకలాపాలు సజావుగా నడిచేందుకు ఒకరు కావాలి. ఇక నూతన కమిటీ నియామకంపై నేను ఎలాంటి కామెంట్స్ చేయదలుచుకోలేదు. సుప్రీం కోర్టే నేరుగా దీన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో నేను భాగస్వామిని కాను’ అని అన్నారు. బీసీసీఐ హర్షం బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ బాధ్యతలు తీసుకోవడంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై సీనియర్ ఆఫీస్ బేరర్లు హర్షం వ్యక్తం చేశారు. ‘న్యాయవ్యవస్థపై మాకు నమ్మకముంది. బోర్డు అధ్యక్షుడిగా శ్రీనివాసన్ బాధ్యతలు తీసుకోనుండడంపై సంతోషంగా ఉన్నాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. ఈ తీర్పు శ్రీనివాసన్‌కు పెద్ద ఊరటనిస్తుందని, సభ్యులు ఆయన సామర్థ్యంపై నమ్మకముంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఉపాధ్యక్షుడు చిత్రక్ మిత్రా కూడా ఈ తీర్పును స్వాగతించారు. -
చెన్నై జట్టును నడిపించింది గురునాథే: హస్సీ
న్యూఢిల్లీ: తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌కు చెన్నై సూపర్ కింగ్ జట్టుతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం క్రికెట్ అంటే మక్కువ కారణంగానే స్టేడియంలో కనిపించేవాడని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ చెబుతున్నప్పటికీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. సాక్షాత్తూ చెన్నైజట్టు ఆటగాడే గురునాథ్ గురించి నిజం చెప్పేశాడు. సీఎస్కే జట్టును గురునాథ్ నడిపించేవాడని ఓపెనర్ మైక్ హస్సీ కుండబద్దలు కొట్టాడు. తను రాసిన ‘అండర్నీత్ ది సదరన్ క్రాస్’ అనే పుస్తకంలో ఈ విషయాలు చెప్పాడు. ‘మా జట్టు ఓనర్ ఇండియా సిమెంట్స చీఫ్ ఎన్.శ్రీనివాసన్. ఆయన బీసీసీఐకి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జట్టుపై పూర్తి బాధ్యతలను గురునాథ్‌కు అప్పగించారు. కెప్లెర్ వెస్సెల్సతో కలిసి గురునాథ్ జట్టును నడిపించాడు’ అని ఆ పుస్తకంలో వివరించాడు. ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో గురునాథ్‌పై ముంబై పోలీసులు చార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. జట్టుకు సంబంధించిన కీలక విషయాలను బుకీలకు చేరవేశాడని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ గురునాథ్‌కు జట్టుకు ఎలాంటి సబంధం లేదని శ్రీనివాసన్ చెబుతూ వస్తున్నారు. -
ఐపీఎల్‌కు దూరంగా ఉండండి!
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కార్యకలాపాలకు మాత్రం దూరంగా ఉండాలని ఎన్. శ్రీనివాసన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. స్పాట్ ఫిక్సింగ్ విచారణ మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ అంశంలో ఆయన జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ తన విశ్వసనీయతను కోల్పోయిందని ఏకే పట్నాయక్, కేఎస్ కేహార్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ‘శ్రీనివాసన్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. అయితే ఐపీఎల్ వ్యవహారాల్లో పాల్గొనరాదు. ఫిక్సింగ్ విచారణను అధ్యక్షుడిగా ఆయన ఏ మేరకు ప్రభావితం చేస్తారో చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం. ఐపీఎల్‌కు సంబంధించి అనేక అంశాలు బయటికి వస్తున్నాయి. మొత్తానికి బీసీసీఐ ద్వారా ఏదో పెద్ద తప్పే జరిగింది. బోర్డు ఈ తరహాలో ఎందుకు విశ్వసనీయత కోల్పోయిందో చెప్పగలరా’ అని కోర్టు వ్యాఖ్యానించింది. మరో వైపు స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని విచారించేందుకు అరుణ్ జైట్లీ లేదా వినయ్ దత్తా నేతృత్వంలో ఒక కమిటీ వేస్తామంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ (సీఏబీ)కు శ్రీనివాసన్ సూచించడాన్ని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. ‘అంతగా తొందర పడవద్దు. మీ ప్రతిపాదనను మాత్రమే సీఏబీకి చెప్పండి. దానిని పరిశీలించే అవకాశం వారికి ఇవ్వండి’ అని సూచించింది. మరో వైపు సీఏబీ తరఫు న్యాయవాదిగా వ్యవహరిస్తున్న హరీష్ సాల్వే...ఐపీఎల్ కూడా బీసీసీఐలో భాగమేనని, కాబట్టి మొత్తం విచారణనంతటినీ బోర్డు పరిధి నుంచి తప్పించాలని కోరారు. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేశారు. -
శ్రీనివాసన్.. మరో ఏడాది
చెన్నై: అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత సంపన్నమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తనకు ఎదురులేదని ఎన్.శ్రీనివాసన్ నిరూపించుకున్నారు. ఆదివారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన మరో ఏడాది పాటు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఎంపిక లాంఛనమే అయ్యింది. అలాగే తనను వ్యతిరేకిస్తూ వచ్చిన వారికి ఆయా కమిటీల్లో స్థానం లేకుండా చేసి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌పై బెట్టింగ్ కేసులో చార్జిషీట్ నమోదు కావడంతో పాటు బోర్డు ఎన్నికల్లో పోటీ చేయకుండా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైనా ఇవేవీ తన ప్రస్థానానికి అడ్డు రావని ఈ తమిళనాడు వ్యాపారవేత్త నిరూపించుకున్నారు. అయితే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆయన పదవీ బాధ్యతలు తీసుకునే అవకాశం లేదు. ఆయనపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ సుప్రీంలో వేసిన కేసులో తీర్పు వచ్చేదాకా ఈ హోదాకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఫైనాన్స్ కమిటీ చీఫ్‌గా గోకరాజు దక్షిణాది యూనిట్ల నుంచి తన ఎంపికపై మొదట్లో వ్యతిరేకత కనబరిచిన ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ), గోవా క్రికెట్ సంఘం (జీసీఏ) ప్రతినిధులను శ్రీనివాసన్ ప్రముఖంగా గుర్తించారు. ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజును అత్యంత కీలకమైన బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ చీఫ్‌గా నియమించారు. గురునాథ్ బెట్టింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్‌పై తొలుత గళమెత్తిన జ్యోతిరాధిత్య సింధియా స్థానంలో గంగరాజు నియామకం జరిగింది. ఇక జీసీఏ అధ్యక్షుడు వినోద్ ఫడ్కేకు మీడియా కమిటీ హెడ్‌గా బాధ్యతలు అప్పగించారు. బోర్డు ఉపాధ్యక్షుడుగా హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శి శివలాల్ యాదవ్ పదవిని పొడిగించారు. అండర్-19 సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చంద్రకాంత్ పండిట్ స్థానంలో కానర్ విలియమ్స్‌ను తీసుకున్నారు. ఇతర ముఖ్య నియామకాల్లో బోర్డు కార్యదర్శిగా సంజయ్ పటేల్, సంయుక్త కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్, కోశాధికారిగా అనిరుధ్ చౌధురి, నూతన ఉపాధ్యక్షులుగా రాజీవ్ శుక్లా (సెంట్రల్ జోన్), ఎస్పీ బన్సాల్ (నార్త్ జోన్), రవి సావంత్ (వెస్ట్ జోన్), చిత్రక్ మిత్ర (ఈస్ట్ జోన్), టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా అనిల్ కుంబ్లే కొనసాగనున్నారు. దాల్మియాపై శీతకన్ను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న జగ్మోహన్ దాల్మియాను నూతన కమిటీ నియామకాల్లో పెద్దగా ప్రాముఖ్యం లేని పదవిని కట్టబెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రకటించిన నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కమిటీకి ఈ వెటరన్ బెంగాలీని హెడ్‌గా నియమించారు. ఈ పదవి తీసుకునేందుకు ముందుగా ఆసక్తి చూపని దాల్మియా.. మున్ముందు శ్రీనివాసన్ మరింత ఇబ్బందిపెట్టే అవకాశం ఉండడంతో అంగీకరించక తప్పలేదు. నిజానికి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)లో ఉన్న ఆయన జూనియర్లను ఇంతకంటే మంచి కమిటీల్లో నియమించారు. క్యాబ్ సంయుక్త కార్యదర్శులు సుబీర్ గంగూలీని అత్యంత శక్తివంతమైన ఐపీఎల్ పాలకమండలి సభ్యునిగా.... సుజన్ ముఖర్జీని ఎన్సీఏ సబ్ కమిటీలో నియమించారు. ఐపీఎల్ చీఫ్‌గా బిస్వాల్ ఐపీఎల్ నూతన చైర్మన్‌గా ఒరిస్సా క్రికెట్ సంఘం అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఎన్నికయ్యారు. 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టుకు బిస్వాల్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరించారు. రాజీవ్ శుక్లా ఈ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎంపిక అనివార్యమైంది. ఏజీఎంకు ముందు ఐపీఎల్ చైర్మన్ పదవికి జగ్మోహన్ దాల్మియా పేరు కూడా పరిశీలనలో ఉండడంతో ఆదివారం నాటి సమావేశంలో ఈమేరకు సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే దాల్మియా (73 ఏళ్లు), బిస్వాల్ (43) మధ్య వయస్సు తేడా ఈ ఎంపికలో కీలక పాత్ర వహించింది. లీగ్ సందర్భంగా విపరీతంగా ప్రయాణాలు చేయాల్సి రావడంతో పాటు తీవ్ర ఒత్తిడిని కూడా అధిగమించాల్సి ఉంటుంది. దీంతో యువ పరిపాలకుడు, శ్రీనివాసన్‌కు అత్యంత సన్నిహితుడైన బిస్వాల్ వైపే ఏజీఎం మొగ్గు చూపింది. 2007లో తొలి టి20 ప్రపంచకప్ సాధించిన ధోని సేనను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీలో బిస్వాల్ సభ్యుడుగా ఉన్నారు. -
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసనే
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్.శ్రీనివాసన్ కొనసాగనున్నారు. అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు (శనివారం) ముగిసేసరికి ఆయన ఒక్కరే రేసులో ఉన్నారు. కాగా తీర్పు వెలువరించేవరకు బాధ్యతలు చేపట్టరాదని సుప్రీం కోర్టు షరతు విదించడంతో ఆయన పదవికి కొన్నిరోజులు దూరంగా ఉండకతప్పదు. ఇక బోర్డు ఉపాధ్యక్షుడిగా శివలాల్ యాదవ్ ఎన్నికయ్యారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి బీహార్ క్రికెట్ సంఘం శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో శ్రీని పోటీచేసేందుకు కోర్టు అనుమతించినా తీర్పు వచ్చేదాకా బాధ్యతలు చేపట్టరాదని ఆదేశించింది. శ్రీని అల్లుడు, చెన్నయ్ జట్టు మాజీ టీమ్ ప్రిన్సిపాల్ గురునాథ్ మేయప్పన్‌పై బెట్టింగ్ ఆరోపణలు వచ్చాక ఆయన బోర్డు పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగారు. -
పోటీ చేసి గెలిచినా...
న్యూఢిల్లీ : బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈనెల 29న జరగాల్సిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరుపుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. అలాగే తమ ఆఫీస్ బేరర్ల ఎన్నికకు కూడా మార్గం సుగమం చేసింది. దీంతో మరోసారి అధ్యక్ష పదవిపై కన్నేసిన శ్రీనివాసన్‌కు అన్ని అడ్డంకులు తొలగినట్టే. అయితే ఇక్కడ సుప్రీం కోర్టు ఓ మెలిక పెట్టింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా మరో ఏడాదికి ఎన్నికైనప్పటికీ ఆయనపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) వేసిన పిటిషన్‌పై కోర్టు నిర్ణయం వెలువడేదాకా బాధ్యతలు తీసుకోవడానికి వీలుండదు. ‘ఆయన (శ్రీనివాసన్) అల్లుడి పేరు చార్జిషీట్లో ఉన్నప్పుడు ఇంకా ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా ఎందుకున్నారు? మరోసారి ఎన్నిక కావాలని అంత ఆతృత ఎందుకు? కేసు మొత్తం పూర్తయ్యేదాకా ఆయన బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు వీల్లేదు’ అని జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ జేఎస్ శేఖర్లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై విచారణ సాగుతున్నందున ఆయన మామ శ్రీనివాసన్‌ను బోర్డు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా చూడాలని గత సోమవారం సీఏబీ కార్యదర్శి ఆదిత్య వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: శ్రీనివాసన్ ఆదివారం జరిగే బోర్డు ఏజీఎంలో తాను అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ‘ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏజీఎంకు హాజరుకానీయకుండా నన్నెవరూ ఆపలేరు. నా కామెంట్స్ తీసుకునేముందు సుప్రీం కోర్టు ఏం చెప్పిందో గమనించండి. అసలు ఎన్నికల్లో నేనెందుకు పోటీ చేయకూడదు? ఎన్నికయ్యాక బాధ్యతలు తీసుకోవద్దని చెప్పిన కోర్టు వ్యాఖ్యలపై నేను స్పందించను. ఈ విషయంలో మీరేమైనా రాసుకోండి. అయితే నిజాలే రాయండి’ అని మీడియాకు శ్రీనివాసన్ హితవు పలికారు. సందిగ్ధంలో బోర్డు శ్రీనివాసన్ పోటీపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై బీసీసీఐలో సందిగ్ధత నెలకొంది. సాంకేతికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. ఒకవేళ ఆదివారం నాటి ఏజీఎంలో శ్రీని తిరిగి ఎన్నికైనప్పటికీ వెంటనే బాధ్యతలు తీసుకునేందుకు వీలుండదు. ప్రస్తుతం రోజువారీ వ్యవహారాలను తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా పర్యవేక్షిస్తున్నప్పటికీ సంతకాలు చేసే అధికారం మాత్రం శ్రీనివాసన్‌కే ఉంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం బోర్డు అధ్యక్షుడిగా శ్రీనివాసన్ బాధ్యతలు తీసుకోవడం కుదరదు. దీంతో బీసీసీఐకి ముఖ్య నాయకుడు అంటూ ఎవరూ ఉండరు. ఈనేపథ్యంలో సంతకాలు చేసే అధికారం కూడా దాల్మియాకు ఇవ్వడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. సంజయ్ పటేల్‌కు కొనసాగింపు చెన్నై: బీసీసీఐ అధ్యక్ష పదవిని మరోసారి చేపట్టేందుకు ఎన్నికల బరిలో నిలువనున్న ఎన్.శ్రీనివాసన్ తన టీమ్‌లో పలు మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక కార్యదర్శిగా ఉన్న సంజయ్ పటేల్‌ను పూర్తి స్థాయిలో నియమించే అవకాశం ఉంది. ‘సంజయ్ పటేల్ పనితీరుపై శ్రీనివాసన్ పూర్తి సంతృప్తిగా ఉన్నారు. క్లిష్ట సమయంలో ఆయ శ్రీనికి అండగా నిలవడమే కాకుండా బహిరంగంగా మద్దతు పలికారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే కోశాధికారిగా వ్యవహరిస్తున్న ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి సవానీ పదవి మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. సవానీ స్థానంలో మరో వ్యక్తిని కోశాధికారిగా నియమించేందుకు శ్రీని మొగ్గు చూపుతున్నారు. ఈ పదవికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు, కేరళ సీఏ చీఫ్ టీసీ మాథ్యూ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. -
శ్రీనివాసన్ ఎంపిక లాంఛనమే(నా)!
ముంబై: బీసీసీఐ అధ్యక్ష పదవిని మరో ఏడాది పాటు కొనసాగించుకునేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నారు. ఈనెల 29న చెన్నైలో జరిగే బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరుగనుంది. అయితే శ్రీని పోటీని అడ్డుకోవాలంటూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) ఇదివరకే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది నేడు (శుక్రవారం) విచారణకు రానుంది. ఒకవేళ ఈ తీర్పు వ్యతిరేకంగా వస్తే తప్ప శ్రీనివాసన్ ఎన్నిక దాదాపు లాంఛనమే కానుంది. దక్షిణాది యూనిట్ల నుంచి ఆయనకు పూర్తి మద్దతు లభించింది. ఇప్పటిదాకా ఆరు క్రికెట్ సంఘాలలో గోవా క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) శ్రీనికి మద్దతిచ్చే విషయంలో కాస్త డోలాయమనంగా వ్యవహరించినా ప్రస్తుతం స్పష్టంగానే ఉన్నాయి. మిగిలిన తమిళనాడు, హైదరాబాద్, కేరళ, కర్ణాటక ముందు నుంచే శ్రీనికి గట్టి మద్దతుదారులుగా నిలిచాయి. అలాగే నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులకు ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తి జోన్ నుంచి కనీసం రెండు యూనిట్లు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ శ్రీనికి ఎదురులేకుండా ఉంది. ఇప్పటికే ఈ సభ్యులందరినీ మూడు రోజుల ఆహ్లాదకర పర్యటన పేరిట మహాబలిపురానికి ఆహ్వానించారు. వీరిలో చాలామంది అక్కడే ఉన్నారు. మరోవైపు ఈయనకు పోటీగా నిలుస్తారని ప్రచారం జరుగుతున్న మాజీ అధ్యక్షులు శశాంక్ మనోహర్, శరద్ పవార్ ఇప్పటిదాకా ఈ విషయంలో బహిరంగంగా స్పందించింది లేదు. కాబట్టి... బీసీసీఐ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ తమిళనాడు బిజినెస్‌మ్యాన్ మరో ఏడాది పదవీ బాధ్యతలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.