బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసనే
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్.శ్రీనివాసన్ కొనసాగనున్నారు. అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు (శనివారం) ముగిసేసరికి ఆయన ఒక్కరే రేసులో ఉన్నారు. కాగా తీర్పు వెలువరించేవరకు బాధ్యతలు చేపట్టరాదని సుప్రీం కోర్టు షరతు విదించడంతో ఆయన పదవికి కొన్నిరోజులు దూరంగా ఉండకతప్పదు. ఇక బోర్డు ఉపాధ్యక్షుడిగా శివలాల్ యాదవ్ ఎన్నికయ్యారు.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి బీహార్ క్రికెట్ సంఘం శ్రీనివాసన్కు వ్యతిరేకంగా ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో శ్రీని పోటీచేసేందుకు కోర్టు అనుమతించినా తీర్పు వచ్చేదాకా బాధ్యతలు చేపట్టరాదని ఆదేశించింది. శ్రీని అల్లుడు, చెన్నయ్ జట్టు మాజీ టీమ్ ప్రిన్సిపాల్ గురునాథ్ మేయప్పన్పై బెట్టింగ్ ఆరోపణలు వచ్చాక ఆయన బోర్డు పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగారు.