
విరాట్ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని దాదా మరోసారి వివరణ ఇచ్చాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్ మొత్తం నుంచి తప్పుకోవాలని మాత్రమే తాను సూచించానని పేర్కొన్నాడు. అది కూడా కోహ్లి మంచికోసమే తాను చెప్పానని తెలిపాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గంగూ భాయ్ ఈ వివరణ ఇచ్చాడు.
కాగా, 2021లో అనూహ్య పరిణామాల నడుమ విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తొలుత పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న రన్ మెషీన్ ఆతర్వాత కెప్టెన్సీ నుంచి పూర్తిగా వైదొలిగాడు. తనను సంప్రదించకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని అప్పట్లో కోహ్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంలో నాటి బీసీసీఐ బాస్ గంగూలీ కీలకపాత్ర పోషించాడని కోహ్లి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తనకు ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తదనంతరం కూడా ఈ విషయంపై కోహ్లి-గంగూలీ మధ్య పరోక్ష యుద్దం జరిగింది. వీరిద్దరూ ఒకరికొరకు ఎదురుపడినప్పుడు కూడా పలకరించుకునేవారు కాదు. ఐపీఎల్ 2023 సందర్భంగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కోహ్లి కెప్టెన్సీ నుంచి దిగిపోయాక తదనంతర పరిణామాల్లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని సారథ్యంలోనే టీమిండియా ఇటీవల వన్డే ప్రపంచకప్ ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న టీమిండియా ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలై మూడోసారి ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment