Roger Binny: ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, మాజీలు, విశ్లేషకులు టీమిండియాను ఏకి పారేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే సోషల్‌మీడియా వేదికగా భారత ఆటగాళ్లను ఓ రేంజ్‌లో ఎండగడుతున్నారు. మాజీలు, విశ్లేషకులు సైతం ఎన్నడూ లేనంతగా స్వరం పెంచి టీమిండియా వైఫల్యాలను తూర్పారబెడుతున్నారు.
బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ సైతం టీమిండియాను వదిలిపెట్టలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ చేసిన సెంచరీలే భారత్‌కు ఆసీస్‌కు మధ్య వత్యాసమని తెలిపాడు. హెడ్, స్మిత్ భాగస్వామ్యమే టీమిండియా కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు.
ఈ పార్ట్‌నర్‌షిపే ఆసీస్ టీమిండియాపై ఆధిక్యత ప్రదర్శించేలా చేసిందని అన్నాడు. హెడ్, స్మిత్ సెంచరీ చేయకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపాడు. భారత ఆటగాళ్ల పోరాటం మూలాన మ్యాచ్ ఆఖరి రోజు వరకు వచ్చింది కాని, నా దృష్టిలో టీమిండియా తొలి రోజే ఓడిపోయిందంటూ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: ఐపీఎల్‌లో అలా అడగడం లేదు కదా.. రోహిత్ శర్మపై మాజీ లెజెండ్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment