
ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలండ్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో 5 వికెట్లతో ఇరగదీసిన ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్.. ఈ శతాబ్దంలోనే (21) టెస్ట్‌ల్లో అత్యుత్తమ బౌలింగ్ యావరేజ్(కనీసం 30 వికెట్లు తీసిన బౌలర్లలో) కలిగిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బోలండ్ తానాడిన 8 మ్యాచ్‌ల్లో 14.57 సగటున 33 వికెట్లు పడగొట్టాడు. ఈ శతాబ్దంలో గడిచిన 22 ఏళ్లలో ఇంత తక్కువ బౌలింగ్ యావరేజ్ కలిగిన బౌలర్ ఎవరూ లేరు.
కాగా, డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో బోలండ్ టీమిండియా పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, శ్రీకర్ భరత్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన బోలండ్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి మరోసారి గిల్ వికెట్‌ను, కీలకమైన విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వికెట్లను దక్కించుకున్నాడు. 34 ఏళ్ల బోలండ్ ఇప్పటివరకు ఆడిన 8 టెస్ట్‌ల్లో ఆసీస్ పాలిట ట్రంప్ కార్డుగా నిలిచాడు. నిప్పులు చెరిగే వేగంతో బౌలింగ్ చేసే ఇతను ముఖ్యంగా సొంత దేశంలో పిచ్‌లపై చెలరేగిపోతాడు.
ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది.
-జాన్‌పాల్, సాక్షి వెబ్‌డెస్క్
చదవండి: WTC Final 2023: ఐపీఎల్ నుంచి నేరుగా వచ్చి ఆడితే ఇలాగే ఉంటది..!