మోడిపై వేటుకు రంగం సిద్ధం
చెన్నై: బీసీసీఐకి కొరకరాని కొయ్యలా తయారైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై జీవిత కాల బహిష్కరణకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై బోర్డు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై నేడు (బుధవారం) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) జరగనుంది. ఈ మీటింగ్‌కు బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షత వహించనున్నారు.
ప్రధానంగా ఇందులో మోడిపై వేటు గురించి చర్చించనున్నారు. జీవిత కాల బహిష్కరణ విధించాలంటే సమావేశంలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుంది. మొత్తం 31 యూనిట్లలో కనీసం 21 ఓట్లు మోడిపై వేటుకు అనుకూలంగా పడాలి. పంజాబ్ (పీసీఏ) తప్ప ఇతర యూనిట్లు మోడికి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా లేవు. అంతకుముందు ఈ మీటింగ్ జరగకుండా మోడి పాటియాల హౌస్ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా ఢిల్లీ హైకోర్టు మాత్రం బీసీసీఐకి అనుకూలంగా తీర్పునిచ్చింది.
చూస్తూ ఊరుకోను: మోడి
శ్రీనివాసన్ మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికై భారత క్రికెట్‌ను నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని లలిత్ మోడి హెచ్చరించారు. శ్రీనివాసన్ చేసిన కొన్ని అనైతిక పనులకు తాను కూడా బాధ్యత వహించాల్సి ఉందని అంగీకరించారు. నిషేధం విధించినా బాధపడేది లేదని, ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నానని గుర్తుచేశారు.
27న శ్రీనివాసన్ పోటీపై విచారణ
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ మరోసారి ఎన్నికల బరిలో నిలవకుండా అడ్డుకోవాలని బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ఈనెల 27న విచారణకు రానుంది. ఈనెల 29న చెన్నైలో జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో మరో ఏడాది పదవి కోసం శ్రీనివాసన్ పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోటీపై అత్యవసరంగా విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్, సీఏబీ కార్యదర్శి ఆదిత్య వర్మ కోర్టును కోరారు. దీనికి స్పందించిన జస్టిస్ ఏకే పట్నాయక్ సమాధానమిస్తూ శుక్రవారం విచారిస్తామని చెప్పారు.