లలిత్ మోడి
చెన్నై: జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్నప్పటికీ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) ఎన్నికల బరిలోకి దిగిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి వ్యవహారంపై బీసీసీఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశంలో చర్చించనుంది. నేడు (శనివారం) చెన్నైలో ఈ సమావేశం జరుగనుంది. ఈనేపథ్యంలో బోర్డు గుర్తింపు పొందిన అన్ని యూనిట్ల ప్రతినిధులు ఈ మీటింగ్‌కు హాజరుకానున్నారు. దీంట్లో మోడి భవితవ్యంతో పాటు ఆర్‌సీఏపై నిషేధం విధిస్తే ఎదురయ్యే పరిస్థితులపై చర్చ జరిగే వీలుంది.
సుప్రీం కోర్టు నియమించిన ఎన్నికల పరిశీలకుడి అనుమతితో మోడి ఈ ఎన్నికల్లో పోటీ చేయగా అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ‘క్రికెట్‌కు, క్రికెటర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీసీసీఐ ఎప్పటికీ పనిచేయదు. మేం ఏ నిర్ణయం తీసుకున్నా రాజస్థాన్ క్రికెటర్లకు ఎలాంటి సమస్య ఉండబోదు. అలాగే మోడి తిరిగి క్రికెట్ కార్యకలాపాల్లోకి రావాలనే ప్రయత్నంపై కూడా చర్చించనున్నాం. అతడిపై ఏ చర్య అయినా తీసుకునే ముందు అందరి సభ్యుల వాదనను వింటాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు.
అబ్ది వివరిస్తారు: ఆర్‌సీఏ
జైపూర్: లలిత్ మోడి తమ ఎన్నికల బరిలోకి దిగిన వైనంపై బీసీసీఐ వర్కింగ్ కమిటీ ముందు వాదన వినిపించేందుకు ఆర్‌సీఏ.. మెహమూద్ అబ్దిని నియమించుకుంది. ‘బీసీసీఐ ప్రజాస్వామిక పద్ధతిలో సమావేశానికి నన్ను అనుమతిస్తుందనే నమ్మకం ఉంది. లేకుంటే ప్రతీ సభ్యున్ని వ్యక్తిగతంగా కలుసుకుని పరిస్థితిని వివరిస్తాను. రాజస్థాన్ క్రీడా చట్టం కింద ఆర్‌సీఏ నడుస్తోంది కాబట్టి మోడిపై బీసీసీఐ నిషేధం లెక్కలోకి రాదు’ అని అబ్ది తెలిపారు.