సందిగ్ధంలో శ్రీనివాసన్
రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి
ఆదేశాలను పునః సమీక్షించమని
సుప్రీంకోర్టునే కోరే అవకాశం!
చెన్నై: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఎన్. శ్రీనివాసన్ సందిగ్ధావస్థకు లోనవుతున్నారు. కోర్టు చెప్పినదాని ప్రకారం రాజీనామా చేస్తే ఎలాంటి వివాదం లేకుండా సమస్య సమసిపోతుంది. అయితే వెంటనే పదవి నుంచి తప్పుకోకుండా న్యాయపరమైన ఇతర ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నారు. తనను తప్పుకోమంటూ జస్టిస్ పట్నాయక్ బెంచ్ ఆదేశమిస్తే దానిపై అప్పీలు చేయాలని భావిస్తున్నారు.
అప్పీలు చేయడానికి శ్రీనివాసన్ ముందు రెండు రకాల అవకాశాలున్నాయి. ఇందులో మొదటిది రివ్యూ పిటిషన్ ద్వారా... రెండోది క్యురేటివ్ పిటిషన్ ద్వారా అప్పీలు చేయవచ్చు. అయితే ఈ రెండు మార్గాల్లోనూ పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని న్యాయ పరిజ్ఞానం ఉన్న బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. ‘సాధారణంగా రివ్యూ, క్యురేటివ్ రెండింటికీ న్యాయపరంగా పరిమితులు ఉన్నాయి. రివ్యూ అంటే సవాల్ చేయడంలాంటిది కాదు. అయితే అప్పీల్‌ను పరిశీలనలోకి తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా న్యాయమూర్తుల విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. అదే విధంగా క్యూరేటివ్ పిటిషన్ పరిస్థితి కూడా ఇలాగే ఉండవచ్చు’ అని ఆయన అన్నారు.
శ్రీనివాసన్‌కు శస్త్ర చికిత్స
సుప్రీంకోర్టు సూచనలపై శ్రీనివాసన్ తన మౌనాన్ని కొనసాగిస్తున్నారు. బుధవారం ఆయన కంటికి కాటరాక్ట్ సర్జరీ జరిగింది. ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడిని పరామర్శించేందుకు ఆయన న్యాయవాది పీఎస్ రామన్ వచ్చారు. ఆయన కూడా తాజా పరిణామాలపై, తదుపరి చర్యలపై మాట్లాడేందుకు నిరాకరించారు.