‘జోక్యం చేసుకోలేము’
ఏజీఎంలో శ్రీనివాసన్ పాల్గొనే అంశంపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో పాల్గొనకుండా ఎన్.శ్రీనివాసన్‌ను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం గత నెల 30న జరగాల్సిన ఏజీఎం శ్రీనివాసన్ కోసమే నవంబర్ 20కి వాయిదా వేశారని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై విచారణ చేస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది.
‘వచ్చే నెల 10న మాకు ముద్గల్ నివేదిక అందుతుంది. అది వచ్చే దాకా వేచి చూద్దాం. ఆ తర్వాతే బోర్డు ఎన్నికల గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనకుండా శ్రీనివాసన్‌ను అడ్డుకోవాలని మీరు (సీఏబీ) కోరినా నివేదికలో ఆయన నిర్దోషిగా తేలితే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం మాకు ఏజీఎంపై ఎలాంటి ఆందోళన లేదు’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్‌ఎంఐ కలీఫుల్లాలతో కూడిన బెంచ్ తేల్చి చెప్పింది.