శ్రీని వల్లే బీసీసీఐకి భారీ నష్టం
ముంబై: ఐపీఎల్ రెండో సీజన్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కమిషనర్ లలిత్ మోడి మరోసారి బీసీసీఐ చీఫ్ ఎన్.శ్రీనివాసన్‌పై విరుచుకుపడ్డారు. ఆయన చేసిన తప్పిదాల వల్లే బోర్డుకు ఏకంగా 633 మిలియన్ డాలర్ల మేర నష్టం ఏర్పడిందని ఘాటుగా ఆరోపించారు. దీనికి సంబంధించిన రహస్య డాక్యుమెంట్స్‌ను కూడా మోడి బహిర్గతం చేశారు. 2009లో జరిగిన ఐపీఎల్-2లో చాలా తెలివిగా తన పొరపాట్లను కప్పిపుచ్చుకున్నాడని చెప్పారు. బీసీసీఐ ఆమోదం లేకుండానే దక్షిణాఫ్రికాలో బోర్డు తరఫున బ్యాంక్ ఖాతాను తెరవాలని అక్కడి క్రికెట్ సంఘాన్ని కోరాడని మోడి అన్నారు.
‘2009 మార్చి 30న బీసీసీఐ తరఫున దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్‌ఏ)తో శ్రీనివాసన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సీఎస్‌ఏ వారి దేశంలో బ్యాంకు ఖాతాను తెరిచి ఐపీఎల్ టోర్నీ నిర్వహించాలి. ఇది బీసీసీఐ ఖాతానే అయినప్పటికీ సీఎస్‌ఏ ఖాతాగా చలామణీలో ఉంటుంది. అంతకన్నా ముందు మార్చి 25న ఐపీఎల్ చైర్మన్ సహా అందరికీ ఆయన పలు సూచనలను జారీ చేశారు. బీసీసీఐ తరఫున చెల్లింపులు చేసేందుకు సీఎస్‌ఏ ప్రత్యేక ఖాతాను నిర్వహిస్తుందని, డబ్బులు ఖాళీ అయినప్పుడు తిరిగి బోర్డు భర్తీ చేస్తుందని, టోర్నీ ముగిశాక సీఎస్‌ఏ సెటిల్‌మెంట్ కోసం తుది స్టేట్‌మెంట్ పంపుతుందన్నారు. దీంతో ఆ ఖాతాను ఎవరు నిర్దేశిస్తున్నారో స్పష్టంగానే తెలుస్తోంది. శ్రీనివాసన్ ఆమోదం పొందాకే ఎలాంటి చెల్లింపులైనా జరుగుతాయి. అన్ని బిల్లులు కూడా తుది ఆమోదం కోసం ఆయన దగ్గరకే వెళ్లాయి.
అసలు ఈ వ్యవహారంలో సీఎస్‌ఏతో కానీ కార్యదర్శితో కానీ చైర్మన్ హోదాలో నేను ఎలాంటి సమావేశాలకు హాజరు కాలేదు. అలాగే ఆర్‌బీఐ అంగీకారం లేకుండానే బోర్డు నుంచి నిధులు దక్షిణాఫ్రికాకు తరలివెళ్లాయి. ఇది ఫెమా నిబంధనలను ఉల్లంఘించడమే. ఇలా రూ. 1,079 కోట్ల మేర అతిక్రమణ జరిగింది. దీనికి జరిమానాగా మూడు రెట్లు అంటే రూ. 3,237 కోట్లను బోర్డు చెల్లించాల్సి ఉంది. మరోవైపు శ్రీని మొండి వైఖరి వ ల్లే కొచ్చి టస్కర్స్, సహారా పుణే వారియర్స్ జట్లు ఐపీఎల్ నుంచి బయటికి వెళ్లాయి. దీంతో బోర్డుకు 633 మిలియన్ డాలర్ల నష్టం ఏర్పడింది’ అని మోడి తాను విడుదల చేసిన డాక్యుమెంట్‌లో తెలిపారు.