ఐపీఎల్‌కు దూరంగా ఉంటా: శ్రీనివాసన్
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే... ఐపీఎల్ పాలన వ్యవహారాలకు, ఇతర అంశాలకు దూరంగా ఉంటానని ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి అండర్ టేకింగ్‌ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీని తరఫు లాయర్ కపిల్ సిబల్ కోర్టుకు వెల్లడించారు.
ఒకవేళ బోర్డు అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైనా... ప్రతిపాదిత హైపవర్ ప్యానెల్ క్లీన్‌చిట్ ఇచ్చే వరకు ఐపీఎల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోరన్నారు. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం కూడా విచారణ కొనసాగించింది. మరోవైపు ప్రతిపాదిత హైపవర్ కమిటీ ఏర్పాటును బీసీసీఐ వ్యతిరేకించింది.
శ్రీనివాసన్ అంశంలోగానీ, ముద్గల్ కమిటీ నివేదిక ఆధారంగా దోషులపై ఈ కమిటీ చర్యలు తీసుకోవడంగానీ సాధ్యంకాదని పేర్కొంది. ‘కమిటీ ఏర్పాటు వల్ల బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి, నిర్ణయం తీసుకునే అధికారంపై ప్రభావం పడుతుంది. ఒకవేళ కచ్చితంగా కమిటీనే కావాలనుకుంటే బోర్డు గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకోవాలి’ అని బీసీసీఐ న్యాయవాది సీఏ సుందరం తెలిపారు.
ఎన్నికలు జనవరి 31 వరకు వాయిదా
బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం, ఆఫీసు బేరర్ల ఎన్నికలను వచ్చే ఏడాది జనవరి 31 వరకు వాయిదా వేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. షెడ్యూల్ ప్రకారం ఏజీఎమ్ ఈనెల 17న జరగాల్సి ఉంది. కానీ ఆ తేదీలోపు ఈ కేసు విచారణ పూర్తయ్యేటట్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.