భారత్ బలంగా ఉంటే క్రికెట్‌కు మంచిది
కొత్త నిబంధనలను సమర్థించుకున్న శ్రీనివాసన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో చేయబోయే కొత్త మార్పులు క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తాయని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ అన్నారు. కొన్ని సభ్య దేశాలనుంచి విమర్శలు వస్తున్నా తాజా ప్రతిపాదనలను ఆయన సమర్ధించుకున్నారు. భారత క్రికెట్ ఎంత బలంగా ఉంటే ప్రపంచ క్రికెట్‌కు అంత మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్రపంచ క్రికెట్‌కు నాయకత్వం వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ఐసీసీ కొత్త పద్ధతిని మేం సమర్థవంతంగా అమలు చేస్తాం.
ఇది ప్రపంచ క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఆర్ధికపరంగా భారత్ బలంగా ఉండటం అందరికీ అవసరం’ అని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 8న సింగపూర్‌లో ఐసీసీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. కొత్త ప్రతిపాదనలు అనూహ్యమేమీ కాదని, చాలా ముందే అన్ని దేశాలకు తాను వివరించానని శ్రీనివాసన్ చెప్పారు.
‘మా ప్రతిపాదనల గురించి చెప్పి సలహాలు, సూచనలు స్వేచ్ఛగా చెప్పాలని కోరాం. అయితే ఎవరో ఒకరు ముందుగా డ్రాఫ్ట్ సిద్ధం చేయాలి కాబట్టి ఆ బాధ్యత మేం తీసుకున్నాం. అనేక సవరణల తర్వాతే ప్రస్తుత ప్రతిపాదనలను తయారుచేశాం’ అని శ్రీనివాసన్ వివరించారు. మూడు దేశాలతో ఏర్పాటు చేస్తున్న కమిటీ, ఐసీసీలో ఉన్న ఇతర కమిటీల్లాంటిదేనని...ఐసీసీ బోర్డుకే అన్ని నిర్ణయాధికారాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. కొత్త ప్రతిపాదనలతో ఎఫ్‌టీపీ రద్దవుతుందని, పెద్ద జట్ల దయపై ఇతర టీమ్‌లు ఆధార పడి ఉండాల్సి వస్తుందన్న వాదనను ఆయన కొట్టి పారేశారు.
‘ ప్రస్తుత ఎఫ్‌టీపీ ఎలాంటి గ్యారంటీ లేకుండానే సాగుతోంది. అదేమీ న్యాయపత్రం కాదు. దానికీ ఎవరూ కట్టుబడటం లేదు. అయితే ఇకపై ద్వైపాక్షిక ఒప్పందాలు అంతకంటే బలంగా ఉంటాయి. ఎఫ్‌టీపీ మరింత సమర్ధంగా పని చేస్తుంది. అసోసియేట్ దేశాలు కూడా సత్తా ఉంటే పెద్ద జట్లతో ఆడే అవకాశం మేం కల్పిస్తాం. అయితే ఇదేమీ ఒక్క సారిగా జరగదు. ఇది 10-20 ఏళ్ల ప్రక్రియ’ అని శ్రీనివాసన్ వివరణ ఇచ్చారు.