ఐఓఏ పీఠంపై రామచంద్రన్
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నూతన అధ్యక్షుడిగా ప్రపంచ స్క్వాష్ సమాఖ్య అధ్యక్షుడు నారాయణస్వామి రామచంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎన్.శ్రీనివాసన్‌కు స్వయానా సోదరుడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో రామచంద్రన్‌తోపాటు ప్రధాన కార్యదర్శిగా భారత ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు రాజీవ్ మెహతా, కోశాధికారిగా అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నాలు కూడా పోటీ లేకుండా ఎన్నికయ్యారు.
ఎనిమిది ఉపాధ్యక్ష పదవుల కోసం తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడడంతో అనివార్యంగా జరిగిన ఎన్నికల్లో భారత రోయింగ్ సమాఖ్య చీఫ్ రాజ్‌లక్ష్మి సింగ్ దేవ్ ఓటమిపాలయ్యారు. ఉపాధ్యక్షులుగా అనురాగ్ ఠాకూర్, అఖిలేశ్ దాస్‌గుప్తా, జనార్దన్‌సింగ్ గెహ్లాట్, ఆర్.కె.ఆనంద్, జి.ఎస్.మంధర్, తర్లోచన్‌సింగ్, బీరేంద్ర ప్రసాద్ బైశ్యా, పర్మిందర్‌సింగ్ దిండ్సాలు ఎన్నికయ్యారు.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రతినిధులు పీర్ మీరో, ఫ్రాన్సిస్కో జె.ఎలిజాల్డే, హుసేన్ అల్ ముసాలమ్‌లు ఈ ఎన్నికలకు పరిశీలకులుగా వ్యవహరించారు.
తాజా ఎన్నికలతో ఐఓఏపై ఐఓసీ విధించిన నిషేధం ఎత్తివేసేందుకు మార్గం సుగమమైంది. ఐఓఏలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుండడం, ఒలింపిక్ చార్టర్‌కు విరుద్ధంగా కళంకిత వ్యక్తులు పదవులు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఐఓసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే 2012 నవంబర్‌లో ఐఓఏ ఎన్నికలు జరిగి అధ్యక్ష, కార్యదర్శులుగా అభయ్‌సింగ్ చౌతాలా, లలిత్ భానోత్‌లు ఎన్నికైనా వారిని ఐఓసీ గుర్తించలేదు. సరికదా... తిరిగి ఎన్నికలు నిర్వహిస్తేనే నిషేధం ఎత్తివేతపై పరిశీలిస్తామని మెలిక పెట్టింది.
తాజా ఎన్నికలతో ఐఓఏకు క్లీన్ కార్యవర్గం లభించినట్లేనని ఐఓసీ భావిస్తోంది. సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ ముగిసే ఈ నెల 23 లోగా తాము ఐఓసీ చీఫ్‌కు నివేదిక సమర్పిస్తామని ఎన్నికలకు పరిశీలకుడిగా వ్యవహరించిన రాబిన్ మిచెల్ తెలిపారు.
ఇదే జరిగితే ఐఓఏపై 14 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తే సోచి ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో భారత అథ్లెట్ల చేతిలో కనిపించని జాతీయ పతాకాన్ని ముగింపు వేడుకల్లో చూసే అవకాశం
దక్కవచ్చు.