శ్రీనివాసన్‌కు పచ్చజెండా
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికై కూడా బాధ్యతలకు దూరంగా ఉంటున్న ఎన్.శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఐపీఎల్ వ్యవహారాల్లో తలదూర్చకుండా బోర్డు అధ్యక్షుడిగా తన విధులు నిర్వర్తించుకునేందుకు జస్టిస్ ఏకే పట్నాయక్, జేఎస్ కేహర్‌తో కూడిన బెంచ్ మంగళవారం అనుమతిచ్చింది.
శ్రీని అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వివాదంలో ఇరుక్కున్నపట్నించీ ఆయన బీసీసీఐ చీఫ్ పదవికి దూరంగా ఉంటున్నారు. గత నెల 29న ఏజీఎంలో మరో ఏడాదిపాటు ఆయన బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కేసు వేయడంతో తీర్పు వచ్చేదాకా పదవికి దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నాటి తీర్పుతో దాదాపు నాలుగు నెలల అనంతరం ఆయన బోర్డు కార్యకలాపాల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.
త్రిసభ్య కమిటీ నియామకం
ఐపీఎల్-6లో వెలుగు చూసిన బెట్టింగ్ వ్యవహారంపై మరోసారి విచారణ కోసం హర్యానా-పంజాబ్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీకి సుప్రీం ఆమోదముద్ర వేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్ కుంద్రాపై వచ్చిన బెట్టింగ్ ఆరోపణలపై ఈ కమిటీ స్వతంత్రంగా విచారణ జరిపి నాలుగు నెలల్లోగా తమ నివేదికను కోర్టుకు అందిస్తుంది. ఈ కమిటీలో సభ్యులుగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్.నాగేశ్వరరావు, అస్సాం క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు నిలయ్ దత్తా ఉన్నారు.
ఈ విచారణలో ఎన్.శ్రీనివాసన్ ఎట్టి పరిస్థితిల్లోనూ జోక్యం చేసుకోరాదని, అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా ఆదేశించింది. అటు ఈ విచారణ పూర్తయ్యేదాకా శ్రీనివాసన్‌ను బోర్డు పదవికి దూరంగా ఉంచాలని సీఏబీ చేసిన విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది. తాము ఏర్పాటు చేసిన కమిటీపై ఎలాంటి అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని, కమిటీతో శ్రీనివాసన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. సీఏబీ పిటిషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలను కమిటీ పరిగణలోకి తీసుకుని విచారిస్తుందని హామీ ఇచ్చింది. నివేదిక సమర్పించాక తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.
తీర్పుతో సంతోషంగా ఉన్నా: శ్రీనివాసన్
భారత క్రికెట్ బోర్డు చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించేందుకు సుప్రీం కోర్టు తనకు అనుమతివ్వడంపై ఎన్.శ్రీనివాసన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘బోర్డు అధ్యక్షుడిగా నా బాధ్యతలు నెరవేర్చాలని సుప్రీం చెప్పినట్టుగా భావిస్తున్నాను. ఈ తీర్పుపై చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే బోర్డు కార్యకలాపాలు సజావుగా నడిచేందుకు ఒకరు కావాలి. ఇక నూతన కమిటీ నియామకంపై నేను ఎలాంటి కామెంట్స్ చేయదలుచుకోలేదు. సుప్రీం కోర్టే నేరుగా దీన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో నేను భాగస్వామిని కాను’ అని అన్నారు.
బీసీసీఐ హర్షం
బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ బాధ్యతలు తీసుకోవడంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై సీనియర్ ఆఫీస్ బేరర్లు హర్షం వ్యక్తం చేశారు. ‘న్యాయవ్యవస్థపై మాకు నమ్మకముంది. బోర్డు అధ్యక్షుడిగా శ్రీనివాసన్ బాధ్యతలు తీసుకోనుండడంపై సంతోషంగా ఉన్నాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. ఈ తీర్పు శ్రీనివాసన్‌కు పెద్ద ఊరటనిస్తుందని, సభ్యులు ఆయన సామర్థ్యంపై నమ్మకముంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఉపాధ్యక్షుడు చిత్రక్ మిత్రా కూడా ఈ తీర్పును స్వాగతించారు.