తప్పుకుంటారా...తప్పించాలా!
శ్రీనివాసన్‌కు సుప్రీంకోర్టు అల్టిమేటం
న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు సంబంధించి అవినీతి వ్యవహారాల్లో పారదర్శక విచారణ కోసం బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ రెండు రోజుల్లోగా తన పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుపై జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తన అభిప్రాయాలు వెల్లడించింది. నేరుగా ‘ఆదేశం’ ఇవ్వకపోయినా... సుప్రీంకోర్టు ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంది. ‘శ్రీనివాసన్ రాజీనామా చేయాలి. లేదంటే అలాంటి ఆదేశాలు జారీ చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు.
ఇన్ని ఆరోపణల తర్వాత కూడా ఆయన ఎలా కొనసాగుతారు. ఇది క్రికెట్‌కు మంచిది కాదు’ అని పట్నాయక్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు సంబంధించి ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో చాలా తీవ్రమైన ఆరోపణలు, కీలకాంశాలు ఉన్నాయని, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బోర్డు అధ్యక్షుడు పక్కకు తప్పుకుంటే గానీ, వాస్తవాలు వెల్లడి కావని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసుపై గురువారంనాడు కూడా వాదనలు కొనసాగుతాయి. నివేదికలో ఉన్న వివరాలు, పేర్లు బయటపెట్టరాదని ఈ విచారణ సందర్భంగా బీసీసీఐ న్యాయవాదులు మరోసారి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశాలను తాను ఇంకా పూర్తిగా చదవలేదని చెప్పిన శ్రీనివాసన్ ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అయితే బోర్డు ఉపాధ్యక్షుడు రవి సావంత్ మాత్రం శ్రీనికి రాజీనామా తప్ప మరో మార్గం లేదని అన్నారు.
అధ్యక్ష బరిలో శివలాల్ యాదవ్!
సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడమే మంచిదని బీసీసీఐలోని ముగ్గురు ఉపాధ్యక్షులు రవి సావంత్, శివలాల్ యాదవ్, చిత్రక్ మిత్రా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రాబోయే రెండు రోజుల్లో శ్రీనివాసన్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ ఉపాధ్యక్షుడు, సౌత్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శివలాల్ యాదవ్ అధ్యక్షుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కూడా శ్రీనివాసన్ తాత్కాలికంగా తప్పుకున్నప్పుడు శివలాల్ పేరు వినిపించినా... దాల్మియాకు పగ్గాలు దక్కాయి. అయితే అప్పట్లో తాత్కాలికంగానే ఆయన పక్కన ఉన్నారు.
కానీ ఈసారి రాజీనామా చేయాలంటూ నేరుగా సుప్రీంకోర్టే చెబుతోంది. కాబట్టి ఇప్పుడు పూర్థిస్థాయి అధ్యక్షుడి అవసరం బీసీసీఐకి ఉంది. ‘నాకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నేను దాని వెంట పరుగెత్తడం లేదు. రాకపోయినా ఇబ్బంది లేదు. ఇన్నాళ్లు ఉపాధ్యక్షుడిగా పెద్ద హోదాలోనే పని చేశాను కాబట్టి అతిగా ఆశించడం లేదు’ అని శివలాల్ ‘సాక్షి’తో తన అభిప్రాయం వెల్లడించారు.