సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు తలపెట్టిన ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వేను జూన్ 1న ప్రారంభించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రధానమంత్రి అందుబాటులో లేకున్నా 135 కిమీ పొడవైన ఈ మార్గాన్ని అదేరోజున జాతికి అంకితం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ వే ద్వారా న్యూఢిల్లీతో ఘజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుధ్ నగర్ (గ్రేటర్ నోయిడా) పల్వాల్‌లకు సిగ్నల్ రహిత కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఈస్ర్టన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు పూర్తయ్యాయని కేంద్రం ఏప్రిల్‌లో సుప్రీం కోర్టుకు వివరించింది.
అయితే ఈ ఏడాది జూన్ నాటికి పశ్చిమ ఎక్స్‌ప్రెస్ వే పనులు పూర్తవుతాయని హర్యానా ప్రభుత్వం సుప్రీం బెంచ్‌కు నివేదించింది. యూపీలో ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులకు ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయని గత ఏడాది డిసెంబర్‌లో ఎన్‌హెచ్‌ఏఐ సుప్రీంకు తెలిపింది. ఢిల్లీకి రాకుండా సరిహద్దు రాష్ట్రాలకు ట్రాఫిక్‌ను మళ్లించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశాలతో 2006లో రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా రెండు ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించాలని నిర్ణయించారు. పర్యావరణవేత్త ఎంసీ మెహతా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment