![శ్రీనివాసన్‌కు మరో చిక్కు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/1/61377811160_625x300.jpg.webp?itok=XmX5rcKO)
శ్రీనివాసన్‌కు మరో చిక్కు
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి చురుగ్గా బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్న ఎన్.శ్రీనివాసన్ మరికొంత కాలం నిరీక్షించక తప్పేట్లు లేదు. అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై బోర్డు ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిషన్ కు చట్టబద్ధత లేదంటూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) గతంలో బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. వీరి వాదనను ఏకీభవిస్తూనే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విచారణ చేసుకోవచ్చని హైకోర్టు బోర్డుకు సూచించింది.
దీనిని వ్యతిరేకిస్తూ సీఏబీ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎప్‌ఎల్‌పీ) దాఖలు చేసింది. ఈనెల 7న బోర్డు కూడా బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంలో ఎప్‌ఎల్‌పీ వేసింది. భారత క్రికెట్ బోర్డు ప్రైవేట్ బాడీ అయినప్పుడు సీఏబీ పిల్‌ను హైకోర్టు ఎలా స్వీకరించిందని ప్రశ్నించింది.
దీనికి ఈనెల 29లోగా సమాధానమివ్వాల్సిందిగా ఇద్దరు జడ్జిల బెంచ్ సీఏబీని ఆదేశించింది. నేడు (శుక్రవారం) జరిగే విచారణలో సుప్రీం తీర్పు శ్రీనివాసన్‌కు అనుకూలంగా వస్తే ఆయన వెంటనే అధ్యక్ష పదవి స్వీకరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు విచారణలో ఏమైనా ఆలస్యం ఎదురైతే మాత్రం వచ్చే నెలలో పదవీ కాలం ముగిసిపోయే శ్రీనివాసన్‌కు ఇబ్బందే. మామూలు పరిస్థితుల్లోనైతే మరో ఏడాది పొడిగింపునకు అవకాశం ఉండేది.