ఐపీఎల్‌కు దూరంగా ఉండండి!
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కార్యకలాపాలకు మాత్రం దూరంగా ఉండాలని ఎన్. శ్రీనివాసన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. స్పాట్ ఫిక్సింగ్ విచారణ మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ అంశంలో ఆయన జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ తన విశ్వసనీయతను కోల్పోయిందని ఏకే పట్నాయక్, కేఎస్ కేహార్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ‘శ్రీనివాసన్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. అయితే ఐపీఎల్ వ్యవహారాల్లో పాల్గొనరాదు. ఫిక్సింగ్ విచారణను అధ్యక్షుడిగా ఆయన ఏ మేరకు ప్రభావితం చేస్తారో చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం.
ఐపీఎల్‌కు సంబంధించి అనేక అంశాలు బయటికి వస్తున్నాయి. మొత్తానికి బీసీసీఐ ద్వారా ఏదో పెద్ద తప్పే జరిగింది. బోర్డు ఈ తరహాలో ఎందుకు విశ్వసనీయత కోల్పోయిందో చెప్పగలరా’ అని కోర్టు వ్యాఖ్యానించింది. మరో వైపు స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని విచారించేందుకు అరుణ్ జైట్లీ లేదా వినయ్ దత్తా నేతృత్వంలో ఒక కమిటీ వేస్తామంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ (సీఏబీ)కు శ్రీనివాసన్ సూచించడాన్ని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది.
‘అంతగా తొందర పడవద్దు. మీ ప్రతిపాదనను మాత్రమే సీఏబీకి చెప్పండి. దానిని పరిశీలించే అవకాశం వారికి ఇవ్వండి’ అని సూచించింది. మరో వైపు సీఏబీ తరఫు న్యాయవాదిగా వ్యవహరిస్తున్న హరీష్ సాల్వే...ఐపీఎల్ కూడా బీసీసీఐలో భాగమేనని, కాబట్టి మొత్తం విచారణనంతటినీ బోర్డు పరిధి నుంచి తప్పించాలని కోరారు. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేశారు.