కోల్‌కతా: ఈ నెలాఖరున జరిగే వార్షిక సాధారణ సమావేశానికి (ఏజీఎం) ముందు బీసీసీఐ వర్కింగ్ కమిటీ నేడు (ఆదివారం) చివరిసారి భేటీ కానుంది. అధ్యక్ష పదవికి దూరంగా ఉంటున్న ఎన్.శ్రీనివాసన్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. ద్విసభ్య కమిషన్‌పై బాంబే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసినప్పటికీ అక్కడ శ్రీనివాసన్‌కు ఉపశమనం లభించలేదు. ఈనెల 11న వీరి వాదనలు విననుంది. ఈనేపథ్యంలో తను చైర్మన్ హోదాలో పాల్గొంటారా? లేదా అనేది తేలాల్సి ఉంది.
ఈ విషయంలో స్పందించేందుకు ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా నిరాకరించారు. ‘నాకే విషయమూ తెలీదు. వర్కింగ్ కమిటీ మీటింగ్ గురించి నన్నేమీ అడగకండి. సమావేశం ముగిశాక మీకే విషయం తెలుస్తుంది. ఏజీఎంను ఎప్పుడు జరపాలనే అంశం మాత్రం కీలకం కానుంది’ అని దాల్మియా అన్నారు. ఆగస్టు 2న జరగాల్సిన వర్కింగ్ కమిటీలోనే శ్రీనివాసన్ బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్నా సాంకేతిక కారణాల వల్ల ఆ మీటింగ్ జరుగలేదు.