చెన్నై: చుట్టూ ఎన్ని సమస్యలున్నా బీసీసీఐ అధ్యక్ష పదవిని మరోసారి చేపట్టేందుకే ఎన్.శ్రీనివాసన్ మొగ్గు చూపుతున్నారు. గురునాథ్‌పై పోలీసులు నమోదు చేసిన చార్జిషీట్ అనంతరం కూడా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దానికి, తాను పదవి చేపట్టేందుకు సంబంధమేమిటని ఎదురు ప్రశ్నించారు. ‘అసలు నేనెందుకు తప్పుకోవాలి? నేనేమీ అనర్హతకు గురి కాలేదు.
గురునాథ్ ఒకవేళ తప్పు చేస్తే చట్టం చూసుకుంటుందని నేనెప్పటి నుంచో చెబుతున్నాను. మీడియానే ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఊదరగొడుతోంది. నాపై ఎలాంటి కేసులు లేవనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక బోర్డు నియమించిన ద్విసభ్య కమిషన్ గురించి నేనేమీ మాట్లాడను. ఆ విషయం ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉంది’ అని మీడియాతో శ్రీనివాసన్ అన్నారు. అలాగే గురునాథ్‌పై నమోదైన చార్జిషీట్‌ను తానింత వరకు చూడలేదని చెప్పారు. ‘కేసుల విషయంపై తేల్చుకోవాల్సింది గురునాథ్ మాత్రమే. ఒకవేళ అతడిపై చార్జిషీట్ దాఖలైతే చట్టం చూసుకుంటుంది. ఇప్పటికే తనపై సస్పెన్షన్ వేటు వేశాం. ఇక అతడికి ఆటతో ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసు నుంచి విముక్తి లభించేందుకు అతడే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నాకెలాంటి సంబంధం లేదు’ అని శ్రీనివాసన్ తేల్చి చెప్పారు. మరోవైపు ఈనెల 29న జరిగే వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశానికి మీడియా ఎలా ఫీలయినా తాను అధ్యక్షత వహిస్తానని, తిరిగి ఎన్నిక కూడా కావచ్చని చెప్పారు.
నేనెందుకు తప్పుకోవాలి?: శ్రీనివాసన్
Published Sun, Sep 22 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement