‘కుంభకోణ’ దారుణంపై నేడే తీర్పు
చెన్నై, సాక్షి ప్రతినిధి : తంజావూరు జిల్లా కుంభకోణం కాశీరామన్ వీధిలో శ్రీకృష్ణ ఆధ్యాత్మిక సంస్థ సాయంతో నడుస్తున్న ప్రాథమిక పాఠశాల, సరస్వతీ పాఠశాల, శ్రీకృష్ణ మహిళా ఉన్నత పాఠశాల, ఈ మూడూ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. 2004 జూలై 16న ఉదయం పాఠశాల గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించగా 94 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యూరు. పాఠశాల కరస్పాండెంట్ పళనిస్వామి, రిజిస్ట్రార్ సరస్వతి, ప్రధానోపాధ్యాయురాలు శాంతలక్ష్మి తదితరులతోపాటూ విద్యాశాఖకు చెందిన అధికారులు మొత్తం 24 మందిపై కుంభకోణం పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగినపుడు అందరినీ అరెస్ట్ చేయగా తరువాత బెయిల్‌పై వచ్చారు.
ఈ కేసుకు సంబంధించి 2005లో కుంభకోణం కోర్టులో చార్జిషీటు దాఖలైంది. నిందితులకు 2006లో చార్జిషీటు ప్రతులను అందజేశారు. నిందితుల్లో పాఠశాల కరస్పాండెంట్ పళనిస్వామి అల్లుడు, పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు ప్రభాకరన్ అప్రూవర్లుగా మారారు. విద్యాశాఖ డెరైక్టర్ కన్నన్, సీఈవో ముత్తుపళనిస్వామి, తహశీల్దారు పరమశివంను హైకోర్టు విడిచిపెట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు 512 మంది సాక్షులను విచారించారు. ఈ నెల 31వ తేదీలోగా కేసు విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలని ఈ ఏడాది మే 5న సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఆ ఆదేశాలను అనుసరించి ఈనెల 30వ తేదీన (నేడు) తీర్పును వెల్లడిస్తున్నట్లు తంజావూరు జిల్లా మొదటి శ్రేణి మేజిస్ట్రేటు మహ్మమద్ ఆలీ ప్రకటించారు. తుది తీర్పు వెలువడనున్న దృష్ట్యా చార్జిషీటులోని 21 మంది బుధవారం కోర్టుకు హాజరుకానున్నారు. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో కోర్టు పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.