శ్రీనివాసన్.. మరో ఏడాది | N. Srinivasan gets one-year extension as BCCI president, Ranjib Biswal named IPL chairman | Sakshi
Sakshi News home page

శ్రీనివాసన్.. మరో ఏడాది

Published Mon, Sep 30 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

శ్రీనివాసన్.. మరో ఏడాది

శ్రీనివాసన్.. మరో ఏడాది

 చెన్నై: అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత సంపన్నమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తనకు ఎదురులేదని ఎన్.శ్రీనివాసన్ నిరూపించుకున్నారు. ఆదివారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన మరో ఏడాది పాటు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఎంపిక లాంఛనమే అయ్యింది. అలాగే తనను వ్యతిరేకిస్తూ వచ్చిన వారికి ఆయా కమిటీల్లో స్థానం లేకుండా చేసి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు.
 
 అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌పై బెట్టింగ్ కేసులో చార్జిషీట్ నమోదు కావడంతో పాటు బోర్డు ఎన్నికల్లో పోటీ చేయకుండా సుప్రీం కోర్టులో పిటిషన్  దాఖలైనా ఇవేవీ తన ప్రస్థానానికి అడ్డు రావని ఈ తమిళనాడు వ్యాపారవేత్త నిరూపించుకున్నారు. అయితే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆయన పదవీ బాధ్యతలు తీసుకునే అవకాశం లేదు. ఆయనపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ సుప్రీంలో వేసిన కేసులో తీర్పు వచ్చేదాకా ఈ హోదాకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.
 
 ఫైనాన్స్ కమిటీ చీఫ్‌గా గోకరాజు
 దక్షిణాది యూనిట్ల నుంచి తన ఎంపికపై మొదట్లో వ్యతిరేకత కనబరిచిన ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ), గోవా క్రికెట్ సంఘం (జీసీఏ) ప్రతినిధులను శ్రీనివాసన్ ప్రముఖంగా గుర్తించారు. ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజును అత్యంత కీలకమైన బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ చీఫ్‌గా నియమించారు. గురునాథ్ బెట్టింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్‌పై తొలుత గళమెత్తిన జ్యోతిరాధిత్య సింధియా స్థానంలో గంగరాజు నియామకం జరిగింది. ఇక జీసీఏ అధ్యక్షుడు వినోద్ ఫడ్కేకు మీడియా కమిటీ హెడ్‌గా బాధ్యతలు అప్పగించారు.
 
 బోర్డు ఉపాధ్యక్షుడుగా హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శి శివలాల్ యాదవ్ పదవిని పొడిగించారు. అండర్-19 సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చంద్రకాంత్ పండిట్ స్థానంలో కానర్ విలియమ్స్‌ను తీసుకున్నారు. ఇతర ముఖ్య నియామకాల్లో బోర్డు కార్యదర్శిగా సంజయ్ పటేల్, సంయుక్త కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్, కోశాధికారిగా అనిరుధ్ చౌధురి, నూతన ఉపాధ్యక్షులుగా రాజీవ్ శుక్లా (సెంట్రల్ జోన్), ఎస్‌పీ బన్సాల్ (నార్త్ జోన్), రవి సావంత్ (వెస్ట్ జోన్), చిత్రక్ మిత్ర (ఈస్ట్ జోన్), టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా అనిల్ కుంబ్లే కొనసాగనున్నారు.
 
 దాల్మియాపై శీతకన్ను
 బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న జగ్మోహన్ దాల్మియాను నూతన కమిటీ నియామకాల్లో పెద్దగా ప్రాముఖ్యం లేని పదవిని కట్టబెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రకటించిన నార్త్ ఈస్ట్ డెవలప్‌మెంట్ కమిటీకి ఈ వెటరన్ బెంగాలీని హెడ్‌గా నియమించారు.
 
 ఈ పదవి తీసుకునేందుకు ముందుగా ఆసక్తి చూపని దాల్మియా.. మున్ముందు శ్రీనివాసన్ మరింత ఇబ్బందిపెట్టే అవకాశం ఉండడంతో అంగీకరించక తప్పలేదు. నిజానికి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)లో ఉన్న ఆయన జూనియర్లను ఇంతకంటే మంచి కమిటీల్లో నియమించారు. క్యాబ్ సంయుక్త  కార్యదర్శులు సుబీర్ గంగూలీని అత్యంత శక్తివంతమైన ఐపీఎల్ పాలకమండలి సభ్యునిగా.... సుజన్ ముఖర్జీని ఎన్‌సీఏ సబ్ కమిటీలో నియమించారు.
 
 ఐపీఎల్ చీఫ్‌గా బిస్వాల్
 ఐపీఎల్ నూతన చైర్మన్‌గా ఒరిస్సా క్రికెట్ సంఘం అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఎన్నికయ్యారు. 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టుకు బిస్వాల్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరించారు. రాజీవ్ శుక్లా ఈ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎంపిక అనివార్యమైంది. ఏజీఎంకు ముందు ఐపీఎల్ చైర్మన్ పదవికి జగ్మోహన్ దాల్మియా పేరు కూడా పరిశీలనలో ఉండడంతో ఆదివారం నాటి సమావేశంలో ఈమేరకు సుదీర్ఘ చర్చ జరిగింది.
 
 అయితే దాల్మియా (73 ఏళ్లు), బిస్వాల్ (43) మధ్య వయస్సు తేడా ఈ ఎంపికలో కీలక పాత్ర వహించింది. లీగ్ సందర్భంగా విపరీతంగా ప్రయాణాలు చేయాల్సి రావడంతో పాటు తీవ్ర ఒత్తిడిని కూడా అధిగమించాల్సి ఉంటుంది. దీంతో యువ పరిపాలకుడు, శ్రీనివాసన్‌కు అత్యంత సన్నిహితుడైన బిస్వాల్ వైపే ఏజీఎం మొగ్గు చూపింది. 2007లో తొలి టి20 ప్రపంచకప్ సాధించిన ధోని సేనను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీలో బిస్వాల్ సభ్యుడుగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement