కొనసాగుతున్న సస్పెన్స్
చెన్నై: బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగేందుకు ఇంకా ఒక రోజు సమయమే మిగిలి ఉన్నా బోర్డు అధ్యక్షుడిగా బరిలో ఉండబోయేదెవరో ఇంకా తేలలేదు. ఎన్.శ్రీనివాసన్ వర్గంతో పాటు ప్రత్యర్థి వర్గం కూడా ఈ విషయంలో నోరు మెదపడం లేదు. ఈనెల 2న జరిగే ఈ ఎన్నికల్లో శ్రీని పోటీ పడడం లేదు కాబట్టి తనకు అనుకూలమైన వ్యక్తిని బరిలోకి దించే అవకాశం ఉంది.
అటు శ్రీని వైరి వర్గం కూడా దీటైన అభ్యర్థి కోసం పావులు కదుపుతోంది. ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్ వైపు వీరు మొగ్గు చూపుతున్నా ఆయన నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకుంటే నూతన అధ్యక్షుడి ఎన్నికల్లో అధికార బీజేపీ కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే మొత్తం 31 ఓట్లలో ఎనిమిది ఓట్లను ఇది ప్రభావితం చేయనుంది. ఈనేపథ్యంలో ఇటీవల శరద్ పవార్ ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే మోదీ నుంచి ఆయనకు ఎలాంటి హామీ లభించలేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తేల్చారు.