న్యూఢిల్లీ: తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌కు చెన్నై సూపర్ కింగ్ జట్టుతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం క్రికెట్ అంటే మక్కువ కారణంగానే స్టేడియంలో కనిపించేవాడని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ చెబుతున్నప్పటికీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. సాక్షాత్తూ చెన్నైజట్టు ఆటగాడే గురునాథ్ గురించి నిజం చెప్పేశాడు. సీఎస్‌కే జట్టును గురునాథ్ నడిపించేవాడని ఓపెనర్ మైక్ హస్సీ కుండబద్దలు కొట్టాడు. తను రాసిన ‘అండర్‌నీత్ ది సదరన్ క్రాస్’ అనే పుస్తకంలో ఈ విషయాలు చెప్పాడు. ‘మా జట్టు ఓనర్ ఇండియా సిమెంట్‌స చీఫ్ ఎన్.శ్రీనివాసన్. ఆయన బీసీసీఐకి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జట్టుపై పూర్తి బాధ్యతలను గురునాథ్‌కు అప్పగించారు. కెప్లెర్ వెస్సెల్‌సతో కలిసి గురునాథ్ జట్టును నడిపించాడు’ అని ఆ పుస్తకంలో వివరించాడు.
ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో గురునాథ్‌పై ముంబై పోలీసులు చార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. జట్టుకు సంబంధించిన కీలక విషయాలను బుకీలకు చేరవేశాడని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ గురునాథ్‌కు జట్టుకు ఎలాంటి సబంధం లేదని శ్రీనివాసన్ చెబుతూ వస్తున్నారు.