Gurunath Meiyappan
-
మేయప్పన్‌ను పక్కన పెట్టాం: శ్రీనివాసన్
చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఐపీఎల్ మ్యాచ్‌లలో ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో బీసీసీఐని పక్కన పెట్టలేమని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని శ్రీనివాసన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. గురునాథ్ మేయప్పన్‌ను ఇప్పటికే పక్కన పెట్టామని శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఎలాంటి శిక్ష విధించాలో నిర్ణయించాల్సిందిగా ముద్గల్ కమిటీకే చెప్పాలని ఆయన కోరారు. -
గురునాథ్ పై ధోని ఎప్పుడు మాట్లాడలేదు: బీసీసీఐ
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్‌పై ధోని ఎలాంటి ప్రకటనలు చేయలేదని బీసీసీఐ శుక్రవారం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ధోనిపై అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఆయన్నితప్పుగా చిత్రీకరిస్తోందని బీసీసీఐ ఈ సందర్బంగా మీడియాను విమర్శించింది. గురువారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణాంశాలను కూడా మీడియా వక్రీకరించిందని బీసీసీఐ విమర్శించింది. గురునాథ్ మేయప్పన్ కేవలం క్రికెట్ ఔత్సాహికడేనని ధోని ఎప్పుడూ ఎక్కడ అనలేదని బీసీసీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. -
స్నేహపూర్వక బెట్టింగ్ చేశా!
విచారణలో మెయ్యప్పన్ న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్న గురునాథ్ మెయ్యప్పన్ పోలీసుల విచారణలో తన తప్పును అంగీకరించినట్టు సమాచారం. బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్‌తో కలిసి స్నేహపూర్వక బెట్టింగ్ చేశానని తెలిపినట్టు ఓ హిందీ చానల్లో కథనం ప్రసారమైంది. పోలీసుల విచారణ నివేదికను కౌన్సిల్ గౌతమ్ భరద్వాజ్, విదుష్పత్ సింఘానియా కోర్టుకు అందించారు. విందూకు బుకీలతో నేరుగా సంబంధాలున్నాయని, అతని ద్వారా మెయ్యప్పన్ పందేలు కాసేవాడని పేర్కొన్నారు. -
'బెట్టింగ్స్, కుంభకోణాలు ఆటలో భాగమే'
బెంగళూరు: ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై సమర్పించిన జస్టిస్ ముద్గల్ కమిటీ నివేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధినేత విజయ్ మాల్యా స్పందించారు. ప్రతి క్రీడలోనూ కుంభకోణాలు ఓ భాగంగా మారాయి అని మాల్యా వ్యాఖ్యానించారు. అయితే సంపన్న క్రికెట్ క్రీడగా మారిన ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ ను కుంభకోణాలు ఏమి చేయలేవని ఆయన అన్నారు. ప్రతి క్రీడలో బెట్టింగ్, ఫిక్సింగ్ లు సర్వసాధారణమయ్యాయి అని మాల్యా తెలిపారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఐపీఎల్ కు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతునే ఉంది అని ఆయన అన్నారు. కాని అలాంటి కుంభకోణాలు ఐపీఎల్ లో చోటు చేసుకోవడం దురదృష్టకరం అని అన్నారు. బీసీసీఐ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ్ మేయప్పన్ ఐపీఎల్ లో బెట్టింగ్ పాల్పడ్డారని, ఆరు భారత క్రికెటర్లకు కూడా బెట్టింగ్ లో హస్తం ఉందని జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-7 టోర్ని కొసం జరుగుతున్న వేలం సందర్భంగా విజయ్ మాల్యా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. -
'మిస్టర్ కూల్' పాత్రపై అనేక అనుమానాలు!
ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక భారత క్రికెట్ రంగాన్ని మరోసారి కుదిపేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న టాప్ క్రికెటర్ల పేర్లు జస్టిస్ ముకుల్ నివేదికలో వెలుగు చూడటం క్రికెట్ పండితులను, అధికారులను, అభిమానులను కలవరపరుస్తోంది. ముఖ్యంగా భారత క్రికెటర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాల పేర్లు నివేదికలో ఉండటం క్రికెట్ ఆటపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో శ్రీశాంత్ తోపాటు మరికొంత మంది కీలక ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో క్రికెట్ రంగం ఉలిక్కి పడింది. రాజస్థాన్ రాయల్స్ తోపాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ఫిక్సింగ్ ఆరోపణల్లో ఎదుర్కోవడం మరింత ఆందోళన కలిగించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యమే ఫిక్సింగ్ కు పాల్పడినట్టు, ఆ జట్టు యజమాని, బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ కీలక సూత్రధారి అంటూ ఆరోపణలు వెల్లువెత్తడం సంచలనం రేపింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి సైతం ఫిక్సింగ్ కుంభకోణంలో పాత్ర ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ కుంభకోణంలో అరెస్టైన దారాసింగ్ తనయుడు విందూ దారా సింగ్ తో ధోనీ సతీమణి సాక్షి సన్నిహితంగా మెలగడం అనేక విమర్శలకు తావిచ్చింది. ఫిక్సింగ్ కుంభకోణంలో ధోనీ పాత్రపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత ఫిక్సింగ్ కుంభకోణంలో తనపై వచ్చిన ఆరోపణలు సమాధానమిస్తూ.. కాలమే సమాధానం చెపుతుంది అని అప్పట్లో వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. శ్రీశాంత్ తోపాటు, ఇతర క్రికెటర్లు అరెస్ట్ కావడం, ఇదే కేసులో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ్ మేయప్పన్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత క్రికెట్ ప్రతిష్టకు మచ్చ తెచ్చిన ఫిక్సింగ్ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశిస్తూ పంజాబ్, హర్యానా మాజీ చీఫ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టి.. సోమవారం నాడు నివేదిక సమర్పించింది. మేయప్పన్ పిక్సింగ్ కు పాల్పడ్డారనే ఈ కమిటీ నిగ్గు తేల్చింది. మేయప్పన్ ఓ ఔత్సాహికుడు మాత్రమేనని, ఆయనకు జట్టు వ్యహరాల్లో పాత్ర లేదంటూ గతంలో ధోనీ మీడియాకు వివరించారు. కానీ ప్రతి మ్యాచ్ జరగడానికి ముందు ధోనీ, ఫ్లెమింగ్ తో కలిసి జట్టు వ్యూహాలను రచించేవారమని మేయప్పన్ వెల్లడించారు. ఫ్లెమింగ్ తో కలిసి జట్టు వేలం గురించి తాను చర్చించానని మేయప్పన్ తెలిపారు. జట్టులో మేయప్పన్ పాత్ర కీలకమే అని దాన్ని బట్టి అర్ధమవుతోంది. కానీ బీసీసీఐ చీఫ్, భారత కెప్టెన్ ధోనీ మాత్రం వీలైనంతవరకు మేయప్పన్ పై వచ్చిన ఆరోపణల తీవ్రత తగ్గించేందుకు గతంలో ప్రయత్నించారన్నది తాజా వివేదికలో వెల్లడవుతోంది. ముకుల్ కమిటీ నివేదిక వెల్లడైన నేపథ్యంలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిక్సింగ్ కుంభకోణంలో పాత్ర ప్రత్యక్షంగా ఉందని తెలిసినా మేయప్పన్ ను ధోనీ ఎందుకు వెనుకేసుకొచ్చాడు? పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన బీసీసీఐ చీఫ్ అల్లుడిని కాపాడాల్సిన అవసరం ధోనీకి ఏముంది? విందూ సింగ్ తో ధోనీ సతీమణి సన్నిహిత సంబంధాలు ఫిక్సింగ్ కు దారితీశాయా? స్పాట్ ఫిక్సింగ్ లో దోనీ పాత్ర కూడా ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ ప్రతిష్ట గంగలో కలువక ముందే ధోనీ స్పందించాల్సిన సమయం వచ్చిందని పలువురు పండితులు అంటున్నారు. ముకుల్ కమిటీ నివేదిక వెల్లడైన నేపథ్యంలో అన్ని వేళ్లు ధోనీ వైపే ఉన్నాయి. ఫిక్సింగ్ కుంభకోణంలో తనపై వస్తున్న ఆరోపణల్ని, తన పాత్రపై వస్తున్న అనుమానాలకు ధోనీ ఎలా సమాధానం చెబుతాడో వేచి చూడాల్సిందే. -
జీవితకాలపు వేటు వేయాల్సిందే: మోడీ
బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్, అతని అల్లుడు గురునాథ్ మేయప్పన్ పై జీవితకాలపు నిషేధం విధించాలని బహిష్కృత ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ డిమాండ్ చేశారు. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో గురునాథ్ మేయప్పన్ పై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ ముగ్దల్ కమిటి నేరారోపణ చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఇండియా సిమెంట్ యాజమాన్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై చర్యలు తీసుకోవడానికి అధికారులు నిద్ర మత్తు నుంచి బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది లలిత్ మోడీ ట్విటర్ లో తెలిపారు. ఈ వ్యవహారం గురించి నేనెప్పటి నుంచో చెబుతున్నాను. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై జీవితకాలపు బహిష్కరణ విధించాలి అని ఆయన అన్నారు. నివేదిక కాపీ కోసం వేచి చూస్తున్నాను. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని బెట్టింగ్, ఫిక్సింగ్ పాల్పడితే.. నిబంధనల ప్రకారం వేటు వేయాలని ఆయన అన్నారు. -
స్పాట్ ఫిక్సింగ్ లో మేయప్పన్ కు ఎదురుదెబ్బ!
బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు మాజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని గురునాథ్ మేయప్పన్ మళ్లీ కష్టాల్లో పడ్డారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ సోమవారం నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయప్పన్ పాత్ర ఉందంటూ ముగ్దల్ కమిటీ నేరారోపణ చేసింది. ముగ్లల్ కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశాలకు మేయప్పన్ సమాధానమివ్వాలని ఆదేశించారు. మేయప్పన్ క్రికెట్ ఔత్సాహికుడు అంటూ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలను విచారణ కమిటి తిరస్కరించింది. మద్రాస్ హై కోర్టుకు చెందిన ఇద్దరు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ టి జయరామ చౌతా, ఆర్ బాలసుబ్రమణ్యంతో కూడిన దిసభ్య కమిటీ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బీహార్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేయడంతో గత సంవత్సరం ముగ్దల్ కమిటిని ఏర్పాటు చేశారు. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా ఆటగాళ్లను, జర్నలిస్టులను, జట్టు యాజమాన్యాన్ని, పోలీసులను, అవినీతి నిరోధక ఆధికారులను, వివిధ వ్యక్తులతోపాటు టాప్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, ఇతరులను కమిటీ విచారించింది. -
చెన్నై జట్టును నడిపించింది గురునాథే: హస్సీ
న్యూఢిల్లీ: తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌కు చెన్నై సూపర్ కింగ్ జట్టుతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం క్రికెట్ అంటే మక్కువ కారణంగానే స్టేడియంలో కనిపించేవాడని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ చెబుతున్నప్పటికీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. సాక్షాత్తూ చెన్నైజట్టు ఆటగాడే గురునాథ్ గురించి నిజం చెప్పేశాడు. సీఎస్కే జట్టును గురునాథ్ నడిపించేవాడని ఓపెనర్ మైక్ హస్సీ కుండబద్దలు కొట్టాడు. తను రాసిన ‘అండర్నీత్ ది సదరన్ క్రాస్’ అనే పుస్తకంలో ఈ విషయాలు చెప్పాడు. ‘మా జట్టు ఓనర్ ఇండియా సిమెంట్స చీఫ్ ఎన్.శ్రీనివాసన్. ఆయన బీసీసీఐకి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జట్టుపై పూర్తి బాధ్యతలను గురునాథ్‌కు అప్పగించారు. కెప్లెర్ వెస్సెల్సతో కలిసి గురునాథ్ జట్టును నడిపించాడు’ అని ఆ పుస్తకంలో వివరించాడు. ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో గురునాథ్‌పై ముంబై పోలీసులు చార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. జట్టుకు సంబంధించిన కీలక విషయాలను బుకీలకు చేరవేశాడని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ గురునాథ్‌కు జట్టుకు ఎలాంటి సబంధం లేదని శ్రీనివాసన్ చెబుతూ వస్తున్నారు. -
ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసుల చార్జిషీట్
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగిన శ్రీనివాసన్ అల్లుడు, చెన్నయ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మాజీ టీమ్ ప్రిన్సిపాల్ గురునాథ్ మేయప్పన్ తదితరులపై ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్ సహా మరో 20 మంది పేర్లు ఉన్నాయి. పాకిస్థాన్ అంపైర్ అసద్ రవూఫ్, 15 మంది బుకీల పేర్లను ఇందులో ప్రస్తావించారు. ముంబై పోలీసులు మొత్తం 11,500 పేజీల నివేదికను రూపొందించారు. 2013 ఐపీఎల్ సీజన్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై మేయప్పన్, దారా సింగ్‌ను గతంలో ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. -
మళ్లీ పోటీ చేస్తా: మీడియాకు శ్రీనివాసన్ సవాల్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, ఇతర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎన్ శ్రీనివాసన్ బోర్దు ఎన్నికల్లో టాప్ పోస్ట్ కు పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 29న జరిగే ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటి పడుతానని ఆయన తెలిపారు. బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో శ్రీనివాసన్ మాట్లాడుతూ.. మీడియా తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఎన్నికల్లో పోటికి నిలబడుతానని సవాల్ విసిరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో తన అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తడంతో శ్రీనివాసన్ రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలనంతరం శ్రీనివాసన్ పక్కకు తప్పించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్ మోహన్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు.