'మిస్టర్ కూల్' పాత్రపై అనేక అనుమానాలు!
'మిస్టర్ కూల్' పాత్రపై అనేక అనుమానాలు!
Published Tue, Feb 11 2014 12:51 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక భారత క్రికెట్ రంగాన్ని మరోసారి కుదిపేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న టాప్ క్రికెటర్ల పేర్లు జస్టిస్ ముకుల్ నివేదికలో వెలుగు చూడటం క్రికెట్ పండితులను, అధికారులను, అభిమానులను కలవరపరుస్తోంది. ముఖ్యంగా భారత క్రికెటర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాల పేర్లు నివేదికలో ఉండటం క్రికెట్ ఆటపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో శ్రీశాంత్ తోపాటు మరికొంత మంది కీలక ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో క్రికెట్ రంగం ఉలిక్కి పడింది.
రాజస్థాన్ రాయల్స్ తోపాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ఫిక్సింగ్ ఆరోపణల్లో ఎదుర్కోవడం మరింత ఆందోళన కలిగించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యమే ఫిక్సింగ్ కు పాల్పడినట్టు, ఆ జట్టు యజమాని, బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ కీలక సూత్రధారి అంటూ ఆరోపణలు వెల్లువెత్తడం సంచలనం రేపింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి సైతం ఫిక్సింగ్ కుంభకోణంలో పాత్ర ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ కుంభకోణంలో అరెస్టైన దారాసింగ్ తనయుడు విందూ దారా సింగ్ తో ధోనీ సతీమణి సాక్షి సన్నిహితంగా మెలగడం అనేక విమర్శలకు తావిచ్చింది. ఫిక్సింగ్ కుంభకోణంలో ధోనీ పాత్రపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత ఫిక్సింగ్ కుంభకోణంలో తనపై వచ్చిన ఆరోపణలు సమాధానమిస్తూ.. కాలమే సమాధానం చెపుతుంది అని అప్పట్లో వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.
శ్రీశాంత్ తోపాటు, ఇతర క్రికెటర్లు అరెస్ట్ కావడం, ఇదే కేసులో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ్ మేయప్పన్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత క్రికెట్ ప్రతిష్టకు మచ్చ తెచ్చిన ఫిక్సింగ్ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశిస్తూ పంజాబ్, హర్యానా మాజీ చీఫ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టి.. సోమవారం నాడు నివేదిక సమర్పించింది. మేయప్పన్ పిక్సింగ్ కు పాల్పడ్డారనే ఈ కమిటీ నిగ్గు తేల్చింది. మేయప్పన్ ఓ ఔత్సాహికుడు మాత్రమేనని, ఆయనకు జట్టు వ్యహరాల్లో పాత్ర లేదంటూ గతంలో ధోనీ మీడియాకు వివరించారు. కానీ ప్రతి మ్యాచ్ జరగడానికి ముందు ధోనీ, ఫ్లెమింగ్ తో కలిసి జట్టు వ్యూహాలను రచించేవారమని మేయప్పన్ వెల్లడించారు. ఫ్లెమింగ్ తో కలిసి జట్టు వేలం గురించి తాను చర్చించానని మేయప్పన్ తెలిపారు. జట్టులో మేయప్పన్ పాత్ర కీలకమే అని దాన్ని బట్టి అర్ధమవుతోంది. కానీ బీసీసీఐ చీఫ్, భారత కెప్టెన్ ధోనీ మాత్రం వీలైనంతవరకు మేయప్పన్ పై వచ్చిన ఆరోపణల తీవ్రత తగ్గించేందుకు గతంలో ప్రయత్నించారన్నది తాజా వివేదికలో వెల్లడవుతోంది.
ముకుల్ కమిటీ నివేదిక వెల్లడైన నేపథ్యంలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిక్సింగ్ కుంభకోణంలో పాత్ర ప్రత్యక్షంగా ఉందని తెలిసినా మేయప్పన్ ను ధోనీ ఎందుకు వెనుకేసుకొచ్చాడు? పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన బీసీసీఐ చీఫ్ అల్లుడిని కాపాడాల్సిన అవసరం ధోనీకి ఏముంది? విందూ సింగ్ తో ధోనీ సతీమణి సన్నిహిత సంబంధాలు ఫిక్సింగ్ కు దారితీశాయా? స్పాట్ ఫిక్సింగ్ లో దోనీ పాత్ర కూడా ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ ప్రతిష్ట గంగలో కలువక ముందే ధోనీ స్పందించాల్సిన సమయం వచ్చిందని పలువురు పండితులు అంటున్నారు. ముకుల్ కమిటీ నివేదిక వెల్లడైన నేపథ్యంలో అన్ని వేళ్లు ధోనీ వైపే ఉన్నాయి. ఫిక్సింగ్ కుంభకోణంలో తనపై వస్తున్న ఆరోపణల్ని, తన పాత్రపై వస్తున్న అనుమానాలకు ధోనీ ఎలా సమాధానం చెబుతాడో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement