శ్రీనివాసన్ ఎంపిక లాంఛనమే(నా)!
ముంబై: బీసీసీఐ అధ్యక్ష పదవిని మరో ఏడాది పాటు కొనసాగించుకునేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నారు. ఈనెల 29న చెన్నైలో జరిగే బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరుగనుంది. అయితే శ్రీని పోటీని అడ్డుకోవాలంటూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) ఇదివరకే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది నేడు (శుక్రవారం) విచారణకు రానుంది. ఒకవేళ ఈ తీర్పు వ్యతిరేకంగా వస్తే తప్ప శ్రీనివాసన్ ఎన్నిక దాదాపు లాంఛనమే కానుంది. దక్షిణాది యూనిట్ల నుంచి ఆయనకు పూర్తి మద్దతు లభించింది.
ఇప్పటిదాకా ఆరు క్రికెట్ సంఘాలలో గోవా క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) శ్రీనికి మద్దతిచ్చే విషయంలో కాస్త డోలాయమనంగా వ్యవహరించినా ప్రస్తుతం స్పష్టంగానే ఉన్నాయి. మిగిలిన తమిళనాడు, హైదరాబాద్, కేరళ, కర్ణాటక ముందు నుంచే శ్రీనికి గట్టి మద్దతుదారులుగా నిలిచాయి. అలాగే నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులకు ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తి జోన్ నుంచి కనీసం రెండు యూనిట్లు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ విషయంలోనూ శ్రీనికి ఎదురులేకుండా ఉంది. ఇప్పటికే ఈ సభ్యులందరినీ మూడు రోజుల ఆహ్లాదకర పర్యటన పేరిట మహాబలిపురానికి ఆహ్వానించారు. వీరిలో చాలామంది అక్కడే ఉన్నారు. మరోవైపు ఈయనకు పోటీగా నిలుస్తారని ప్రచారం జరుగుతున్న మాజీ అధ్యక్షులు శశాంక్ మనోహర్, శరద్ పవార్ ఇప్పటిదాకా ఈ విషయంలో బహిరంగంగా స్పందించింది లేదు. కాబట్టి... బీసీసీఐ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ తమిళనాడు బిజినెస్‌మ్యాన్ మరో ఏడాది పదవీ బాధ్యతలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.