Bihar cricket association
-
ఒక్క మ్యాచ్ కోసం రెండు వేర్వేరు జట్లు.. రోజర్ బిన్నీ లేదంటే జై షా?!
Ranji Trophy 2023-24 Bihar Vs Mumbai: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో ముంబై- బిహార్ మ్యాచ్ ఆరంభం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబైతో టెస్టులో తలపడేందుకు.. బిహార్ నుంచి రెండు వేర్వేరు క్రికెట్ జట్లు మైదానానికి రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో శుక్రవారం నాటి తొలి రోజు ఆట కాస్త ఆలస్యంగా మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే...?! ప్రెసిడెంట్ వర్సెస్ సెక్రటరీ బిహార్ క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) అధ్యక్షుడు రాకేశ్ తివారి- కార్యదర్శి అమిత్ కుమార్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. పాట్నా వేదికగా ముంబైతో ఆడేందుకు రాకేశ్ తివారి, అమిత్ కుమార్ తమ తమ జట్లను ఎంపిక చేశారు. తాము సెలక్ట్ చేసిన జట్టే మైదానంలో దిగుతుందని ఆటగాళ్లకు చెప్పారు. మైదానంలోకి రెండు జట్లు వీరిద్దరి అత్యుత్సాహం కారణంగా ఈ జట్లలోని సభ్యులంతా మైదానానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి.. వివాదం సద్దుమణిగేలా చేశారు. ఈ క్రమంలో.. బీసీఏ ప్రెసిడెంట్ రాకేశ్ తివారి ఎంపిక చేసిన జట్టే ఆట మొదలుపెట్టింది. అతడి జట్టే ఆడుతోంది ఈ వివాదం గురించి రాకేశ్ తివారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రతిభ ఆధారంగా మేము సరైన జట్టును ఎంపిక చేశాం. బిహార్ నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు రావడం మీరు చూస్తూనే ఉన్నారు. మా రాష్ట్రం నుంచి సకీబ్ హుసేన్ లాంటి వాళ్లు ఐపీఎల్‌కు సెలక్ట్ అయ్యారు. ఈ రోజు 12 ఏళ్ల చిచ్చరపిడుగును కూడా అరంగేట్రం చేయిస్తున్నాం. బీసీఏ కార్యదర్శిని ఇప్పటికే మేము సస్పెండ్ చేశాం. కాబట్టి అతడు ఎంపిక చేసిన జట్టుకు అసలు విలువే లేదు’’ అని పేర్కొన్నాడు. రోజర్ బిన్నీ లేదంటే జై షా?! ఇందుకు బదులుగా అమిత్ కుమార్.. ‘‘అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. నేను ఎన్నికల్లో గెలిచి అధికారికంగా కార్యదర్శి పదవి చేపట్టాను. నన్ను సస్పెండ్ చేసే అధికారం ఎవరికీ లేదు. అయినా.. బోర్డు ప్రెసిడెంట్ ఎప్పుడైనా జట్టు ఎంపికలో జోక్యం చేసుకుంటాడా? బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ భారత జట్టును ప్రకటించడం చూశారా? జట్టు ఎంపిక గురించిన సమాచారాన్ని అధికారికంగా కార్యదర్శి జై షానే వెల్లడిస్తారు కదా! నేను కూడా బీసీఏకు కార్యదర్శినే’’ అంటూ రాకేశ్ తివారికి కౌంటర్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. శుక్రవారం నాటి మొదటిరోజు ఆటలో టాస్ గెలిచిన బిహార్ ముంబైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ముంబై జట్టు 76.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ కాగా.. శనివారం బ్యాటింగ్‌కు దిగిన బిహార్ 26 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. 12 ఏళ్ల 284 రోజులకు... రంజీ ట్రోఫీలో పిన్న వయస్సులోనే అరంగేట్రం చేసిన నాలుగో ప్లేయర్‌గా బిహార్ జట్టుకు చెందిన వైభవ్ సూర్యవంశీ (12 ఏళ్ల 284 రోజులు) గుర్తింపు పొందాడు. పట్నాలో ముంబై జట్టుతో శుక్రవారం మొదలైన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో వైభవ్ బరిలోకి దిగాడు. రంజీ ట్రోఫీలో పిన్న వయస్సులోనే మ్యాచ్ ఆడిన ప్లేయర్ల జాబితాలో అలీముద్దీన్ (రాజ్‌పుతానా; 12 ఏళ్ల 73 రోజులు; 1942), ఎస్కే బోస్ (బిహార్; 12 ఏళ్ల 76 రోజులు; 1959), మొహమ్మద్ రంజాన్ (నార్తర్న్ ఇండియా; 12 ఏళ్ల 247 రోజులు; 1937) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: T20 WC 2024: అద్భుతమైన ఫీల్డర్లు.. కోహ్లి, రోహిత్‌లను ఆడించాలి: టీమిండియా దిగ్గజం -
VHT 2022: సెంచరీతో చెలరేగిన అశ్విన్.. బిహార్‌పై ఆంధ్ర ఘన విజయం
బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 132 పరుగుల తేడాతో బిహార్‌ను చిత్తు చేసింది. ముందుగా ఆంధ్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. అశ్విన్ హెబర్ (141 బంతుల్లో 154; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగగా...రికీ భుయ్ (65 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), హనుమ విహారి (70 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం బిహార్ 44.3 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. వీర్‌ప్రతాప్ సింగ్ (49 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సకీబుల్ ఘని (42) మినహా అంతా విఫలమయ్యారు. హరిశంకర్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా...అయ్యప్ప, షోయబ్, నితీశ్ కుమార్ తలా 2 వికెట్లు తీశారు. చదవండి: IND vs NZ: అతడు చాలా డేంజరేస్.. టీమిండియా ఓపెనర్‌గా రావాలి -
విచారణ కమిటీ వివాదాస్పదం!
ముగ్గురు సభ్యులపైనా అభ్యంతరాలు నేడు సుప్రీం ముందుకు బీసీసీఐ ప్రతిపాదన ముంబై: ఐపీఎల్ ఫిక్సింగ్ వివాదంపై స్వతంత్రంగా మరోసారి విచారిస్తామంటూ బీసీసీఐ ప్రతిపాదిస్తున్న కొత్త కమిటీపై వివాదం కొనసాగుతూనే ఉంది. ముగ్గురు సభ్యుల కమిటీలో ముందుగా రవిశాస్త్రి ఎంపికపై అభ్యంతరాలు ఎదురు కాగా...ఇప్పుడు మిగతా ఇద్దరి నేపథ్యంపై కూడా కొత్త చర్చ మొదలైంది. వీరు ముగ్గురూ బీసీసీఐతో ఏదో ఒక రకంగా సంబంధం కలిగి ఉండటం కమిటీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. బీసీసీఐ చేస్తున్న ఈ ప్రతిపాదన మంగళవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. కోర్టు దీనికి అంగీకారం తెలుపుతుందా, అభ్యంతరం వ్యక్తం చేస్తుందా చూడాలి. ఈ కమిటీని వ్యతిరేకిస్తామని బీహార్ క్రికెట్ సంఘం ఇప్పటికే ప్రకటించింది. రవిశాస్త్రి: ఈ మాజీ క్రికెటర్ బీసీసీఐ ఉద్యోగిగా ఉన్నారు. కామెంటేటర్‌గా బోర్డునుంచే జీతభత్యాలు పొందుతున్నారు. ఫిక్సింగ్ వివాదం బయటపడిన తర్వాత అనేక సందర్భాల్లో బహిరంగంగానే శ్రీనివాసన్‌కు మద్దతు ప్రకటించారు. కమిటీలో తనను చేర్చడం పట్ల స్వయంగా శాస్త్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సరిగ్గా తన బాధ్యత ఏమిటో కూడా తనకు తెలీదని ఆయన అన్నారు. జై నారాయణ్ పటేల్: కలకత్తా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అయిన పటేల్, బోర్డు ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్‌కు స్వయానా బావ (సొంత సోదరి భర్త) కావడం వివాదానికి కారణమైంది. అయితే బోర్డు సమావేశంలో ఆయన పేరును శివలాల్ వర్గం కాకుండా శశాంక్ మనోహర్ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. కాబట్టి తన ఎంపికపై అభ్యంతరం అనవసరం అని ఆయన చెబుతున్నారు. ఆర్కే రాఘవన్: సీబీఐ మాజీ డెరైక్టర్ రాఘవన్‌కు సంబంధించి కొత్త నేపథ్యం సోమవారం బయటపడింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ)కు అనుబంధంగా ఉన్న కామ్యుత్ క్లబ్‌కు ఆయన స్వయంగా యజమాని/కార్యదర్శి. రాఘవన్‌కు టీఎన్‌సీఏ ఎన్నికల్లో ఓటు హక్కు కూడా ఉంది. దీంతో ఆయనా శ్రీనివాసన్‌కు సన్నిహితుడేనని తెలుస్తోంది. -
శ్రీనివాసన్ ఎంపిక లాంఛనమే(నా)!
ముంబై: బీసీసీఐ అధ్యక్ష పదవిని మరో ఏడాది పాటు కొనసాగించుకునేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నారు. ఈనెల 29న చెన్నైలో జరిగే బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరుగనుంది. అయితే శ్రీని పోటీని అడ్డుకోవాలంటూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) ఇదివరకే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది నేడు (శుక్రవారం) విచారణకు రానుంది. ఒకవేళ ఈ తీర్పు వ్యతిరేకంగా వస్తే తప్ప శ్రీనివాసన్ ఎన్నిక దాదాపు లాంఛనమే కానుంది. దక్షిణాది యూనిట్ల నుంచి ఆయనకు పూర్తి మద్దతు లభించింది. ఇప్పటిదాకా ఆరు క్రికెట్ సంఘాలలో గోవా క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) శ్రీనికి మద్దతిచ్చే విషయంలో కాస్త డోలాయమనంగా వ్యవహరించినా ప్రస్తుతం స్పష్టంగానే ఉన్నాయి. మిగిలిన తమిళనాడు, హైదరాబాద్, కేరళ, కర్ణాటక ముందు నుంచే శ్రీనికి గట్టి మద్దతుదారులుగా నిలిచాయి. అలాగే నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులకు ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తి జోన్ నుంచి కనీసం రెండు యూనిట్లు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ శ్రీనికి ఎదురులేకుండా ఉంది. ఇప్పటికే ఈ సభ్యులందరినీ మూడు రోజుల ఆహ్లాదకర పర్యటన పేరిట మహాబలిపురానికి ఆహ్వానించారు. వీరిలో చాలామంది అక్కడే ఉన్నారు. మరోవైపు ఈయనకు పోటీగా నిలుస్తారని ప్రచారం జరుగుతున్న మాజీ అధ్యక్షులు శశాంక్ మనోహర్, శరద్ పవార్ ఇప్పటిదాకా ఈ విషయంలో బహిరంగంగా స్పందించింది లేదు. కాబట్టి... బీసీసీఐ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ తమిళనాడు బిజినెస్‌మ్యాన్ మరో ఏడాది పదవీ బాధ్యతలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.