ఒక్క మ్యాచ్ కోసం రెండు వేర్వేరు జట్ల ఎంపిక (PC: X)
Ranji Trophy 2023-24 Bihar Vs Mumbai: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో ముంబై- బిహార్ మ్యాచ్ ఆరంభం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబైతో టెస్టులో తలపడేందుకు.. బిహార్ నుంచి రెండు వేర్వేరు క్రికెట్ జట్లు మైదానానికి రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో శుక్రవారం నాటి తొలి రోజు ఆట కాస్త ఆలస్యంగా మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే...?!
ప్రెసిడెంట్ వర్సెస్ సెక్రటరీ
బిహార్ క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) అధ్యక్షుడు రాకేశ్ తివారి- కార్యదర్శి అమిత్ కుమార్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. పాట్నా వేదికగా ముంబైతో ఆడేందుకు రాకేశ్ తివారి, అమిత్ కుమార్ తమ తమ జట్లను ఎంపిక చేశారు. తాము సెలక్ట్ చేసిన జట్టే మైదానంలో దిగుతుందని ఆటగాళ్లకు చెప్పారు.
మైదానంలోకి రెండు జట్లు
వీరిద్దరి అత్యుత్సాహం కారణంగా ఈ జట్లలోని సభ్యులంతా మైదానానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి.. వివాదం సద్దుమణిగేలా చేశారు. ఈ క్రమంలో.. బీసీఏ ప్రెసిడెంట్ రాకేశ్ తివారి ఎంపిక చేసిన జట్టే ఆట మొదలుపెట్టింది.
అతడి జట్టే ఆడుతోంది
ఈ వివాదం గురించి రాకేశ్ తివారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రతిభ ఆధారంగా మేము సరైన జట్టును ఎంపిక చేశాం. బిహార్ నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు రావడం మీరు చూస్తూనే ఉన్నారు. మా రాష్ట్రం నుంచి సకీబ్ హుసేన్ లాంటి వాళ్లు ఐపీఎల్‌కు సెలక్ట్ అయ్యారు.
ఈ రోజు 12 ఏళ్ల చిచ్చరపిడుగును కూడా అరంగేట్రం చేయిస్తున్నాం. బీసీఏ కార్యదర్శిని ఇప్పటికే మేము సస్పెండ్ చేశాం. కాబట్టి అతడు ఎంపిక చేసిన జట్టుకు అసలు విలువే లేదు’’ అని పేర్కొన్నాడు.
రోజర్ బిన్నీ లేదంటే జై షా?!
ఇందుకు బదులుగా అమిత్ కుమార్.. ‘‘అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. నేను ఎన్నికల్లో గెలిచి అధికారికంగా కార్యదర్శి పదవి చేపట్టాను. నన్ను సస్పెండ్ చేసే అధికారం ఎవరికీ లేదు.
అయినా.. బోర్డు ప్రెసిడెంట్ ఎప్పుడైనా జట్టు ఎంపికలో జోక్యం చేసుకుంటాడా? బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ భారత జట్టును ప్రకటించడం చూశారా? జట్టు ఎంపిక గురించిన సమాచారాన్ని అధికారికంగా కార్యదర్శి జై షానే వెల్లడిస్తారు కదా! నేను కూడా బీసీఏకు కార్యదర్శినే’’ అంటూ రాకేశ్ తివారికి కౌంటర్ ఇచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. శుక్రవారం నాటి మొదటిరోజు ఆటలో టాస్ గెలిచిన బిహార్ ముంబైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ముంబై జట్టు 76.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ కాగా.. శనివారం బ్యాటింగ్‌కు దిగిన బిహార్ 26 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
12 ఏళ్ల 284 రోజులకు...
రంజీ ట్రోఫీలో పిన్న వయస్సులోనే అరంగేట్రం చేసిన నాలుగో ప్లేయర్‌గా బిహార్ జట్టుకు చెందిన వైభవ్ సూర్యవంశీ (12 ఏళ్ల 284 రోజులు) గుర్తింపు పొందాడు. పట్నాలో ముంబై జట్టుతో శుక్రవారం మొదలైన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో వైభవ్ బరిలోకి దిగాడు.
రంజీ ట్రోఫీలో పిన్న వయస్సులోనే మ్యాచ్ ఆడిన ప్లేయర్ల జాబితాలో అలీముద్దీన్ (రాజ్‌పుతానా; 12 ఏళ్ల 73 రోజులు; 1942), ఎస్‌కే బోస్ (బిహార్; 12 ఏళ్ల 76 రోజులు; 1959), మొహమ్మద్ రంజాన్ (నార్తర్న్ ఇండియా; 12 ఏళ్ల 247 రోజులు; 1937) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: T20 WC 2024: అద్భుతమైన ఫీల్డర్లు.. కోహ్లి, రోహిత్‌లను ఆడించాలి: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment