న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ఆరోపణలను విచారించాల్సిన కమిటీ ఏర్పాటును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎన్.శ్రీనివాసన్‌తో పాటు మరో 12మందిపై విచారణ జరిపేందుకు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిషన్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారనే కథనాలు వినిపించాయి. అయితే ఈ కమిటీపై బీసీసీఐ అభ్యంతరం లేవనెత్తింది. ఈ కమిషన్ స్థానంలో తాజాగా మరో కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో జస్టిస్ ఏకే పట్నాయక్‌తో కూడిన బెంచ్ తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇంతకుముందు ఇదే అంశంపై బోర్డు వర్కింగ్ కమిటీ... త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ముద్గల్ కమిటీయే ఈ విచారణకు ముందుకు వస్తే బాగుంటుందని సూచనప్రాయంగా వెల్లడించింది. దీనికి అటు ముద్గల్ కమిటీ కూడా సానుకూలంగా స్పందించింది.
అయితే ఆ కమిటీపై తమకు నమ్మకం లేదని, వారు ఇప్పటిదాకా అందించిన నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీసీఐ ఆరోపించింది. శ్రీనివాసన్, మరో 12 మందిపై ముద్గల్ కమిటీ చేసిన ఆరోపణలపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయానికి రాలే దని, కొత్తగా ఏర్పాటయ్యే కమిటీ ఈ వ్యవహారాన్ని చూస్తుందని కోర్టు తెలిపింది. కమిటీ నివేదికలో ఉన్న విషయాలను రహస్యంగా ఉంచేందుకే ముద్గల్ కమిటీకి విచారణ అధికారం అప్పగించాలని భావించామని, మరో కమిటీ వస్తే ఇందులోని విషయాలు వారికి కూడా తెలిసిపోతాయని కోర్టు అభిప్రాయపడింది.
సిద్ధంగా ఉన్న ముద్గల్ కమిటీ
స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపేందుకు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తమ సంసిద్ధతను తెలిపింది. ఈ విషయంలో తమకు సహాయకంగా ఉండేందుకు సీబీఐ (స్పెషల్ డెరైక్టర్) మాజీ అధికారి ఎంఎల్ శర్మ సేవలను వినియోగించుకుంటామని కోర్టుకు తెలిపింది. శర్మతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నైలకు చెందిన ఒక్కో పోలీస్ అధికారి... ఓ మాజీ క్రికెటర్ ఉంటాడని బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
విచారణ కమిటీ ఏర్పాటుపై తీర్పు వాయిదా
Published Wed, Apr 30 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement
Advertisement