నన్ను పెళ్లి చేసుకోవూ! | Lasha Talakhadze sets world record to claim gold in over 105-kilogram weightlifting | Sakshi
Sakshi News home page

నన్ను పెళ్లి చేసుకోవూ!

Published Thu, Aug 18 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

నన్ను పెళ్లి చేసుకోవూ!

నన్ను పెళ్లి చేసుకోవూ!

 వెయిట్ లిఫ్టింగ్‌లో లాషా ప్రపంచ రికార్డు
 రియో డి జనీరో: అథ్లెటిక్స్‌లో 100మీ. పరుగు గెలిచిన వ్యక్తిని ప్రపంచంలో వేగవంతమైన మనిషి అంటారు. అలాగే వెయిట్ లిఫ్టింగ్‌లో 105 ప్లస్ కిలోల సూపర్ హెవీ వెయిట్ విభాగంలో గెలిచిన వ్యక్తిని ఉక్కుమనిషి అంటారు. ఈసారి ఒలింపిక్స్‌లో జార్జియా వెయిట్ లిఫ్టర్ లాషా తలఖజ్దే ‘ఉక్కుమనిషి’గా అవతరించారు. స్నాచ్‌లో 215 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 258 కిలోల బరువు ఎత్తిన లాషా... రెండూ కలిపి మొత్తం 473 కిలోలతో ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణపతకం సాధించాడు. అర్మెనియా లిఫ్టర్ గోర్ మినస్యాన్ 451 కేజీలతో రజతాన్ని, జార్జియాకే చెందిన ఇరాకీ తుర్మానిజ్దే 448 కిలోలతో కాంస్య పతకాన్ని సాధించారు. అయితే.. స్నాచ్‌లో ఇరాన్ లిఫ్టర్ బెహ్దాద్ సలీమీకోర్దసైబీ 216 కిలోల బరువు ఎత్తి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పినా... క్లీన్ అండ్ జర్క్‌లో విఫలమై తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
 
 ‘హర్డిల్స్’ దాటిన జమైకా
 స్ప్రింట్‌లో ప్రపంచాన్ని వెనక్కు నెట్టి ముందుకెళ్తున్న జమైకన్లు ఇప్పుడు హర్డిల్స్‌లోనూ మేమున్నామంటున్నారు. రియోలో 110 మీటర్ల హర్డిల్స్‌లో జమైకన్ ఓమర్ మెక్ లియోడ్ 13.05 సెకన్లలోనే రేసు పూర్తి చేసి శభాష్ అనిపించాడు. క్యూబా అథ్లెట్ ఓర్లాండో ఓర్టెగా 13.17 టైమింగ్‌తో రజతం, ఫ్రాన్స్‌కు చెందిన దిమిత్రి బాస్కౌ 13.24 టైమింగ్‌తో కాంస్యాన్ని చేజిక్కించుకున్నారు. 1992లో బార్సిలోనా ఒలింపిక్స్ తర్వాత 110 మీటర్ల హర్డిల్స్ ఒలింపిక్స్ ఫైనల్లో ఇంత తక్కువ టైమింగ్ నమోదవటం ఇదే తొలిసారి. అమెరికాకు 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో హర్డిల్స్‌లో మెడల్ రాకపోవటం కూడా ఇదే మొదటిసారి.
 
 తీరిన బ్రెజిల్ కల
 బ్రెజిల్ లైట్‌వెయిట్ బాక్సర్ రాబ్సన్ కాన్సీకావ్ ఆతిథ్య జట్టు తరపున ఒలింపిక్స్‌లో రికార్డు సృష్టించాడు. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో బ్రెజిల్‌కు తొలి స్వర్ణం అందించాడు. స్థానిక అభిమానుల సమక్షంలో వారి నినాదాల స్ఫూర్తితో.. ఫైనల్లో ఫ్రాన్స్ బాక్సర్ సొఫైన్ ఔహిమాను 3-0తో ఓడించాడు. ‘ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవటం నమ్మశక్యంగా లేదు. నా ప్రత్యర్థి చాలా మంచి ఆటగాడు. అతనిపై గెలవటం ఆనందంగా ఉంది. ఈరోజుకోసం కలగన్నాను, సాధించాను’ అని రాబ్సన్ తెలిపాడు. బాక్సింగ్‌ను ప్రొఫెషన్‌గా తీసుకోకముందు రాబ్సన్ కూరగాయలు అమ్ముకునేవాడు.
 
 84 ఏళ్ల తర్వాత...
 కెనడా హైజంప్ అథ్లెట్ కొరున్నా రియో ఒలింపిక్స్‌లో 2.38 మీటర్ల ఎత్తుకు ఎగిరి స్వర్ణం సాధించాడు. 2.39 మీటర్లతో ఉన్న ఒలింపిక్స్ రికార్డును బ్రేక్ చేసే ప్రయత్నంలో విఫలమైనా.. మొదటి స్థానంలో నిలిచాడు. రియో ఒలింపిక్స్‌లో కెనడాకు తొలి పురుషుల విభాగంలో స్వర్ణం ఇది. దీంతోపాటు 1932 లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ తర్వాత కెనడాకు హై జంప్‌లో  ఇదే మొదటి బంగారుపతకం. ముతాజ్ (ఖతార్) 2.36 మీటర్లు, బోహ్‌దన్ (ఉక్రెయిన్) 2.33 మీటర్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
 
 నన్ను పెళ్లి చేసుకోవూ!
 రియో ఒలింపిక్స్ మొదలైనప్పటినుంచి క్రీడాకారులు.. మెడల్స్ గెలిచాక తమ ప్రేయసిలను కలిసి పెళ్లికి ప్రతిపాదించటం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ జాబితాలోకి ఓ అమెరికన్ అథ్లెట్ల జంట చేరింది. అమెరికన్ ట్రిపుల్ జంపర్ విల్ క్లే మంగళవారం రజతం గెలిచాడు. ఈ ఆనందంలో వెంటనే స్టాండ్స్‌లో కూర్చున్న అమెరిన్ హర్డిల్స్ క్రీడాకారిణి క్వీన్ హారిసన్‌కు ప్రపోజ్ చేశాడు. దీనికి క్వీన్ వెంటనే ‘యస్’ చెప్పటంతో ఆనందంతో ఎగిరిగంతేశాడు. క్వీన్ హారిసన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోయినా.. విల్ క్లే కోసమే బ్రెజిల్‌కు వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement