కోహ్లీకి లతాజీ అరుదైన బహుమతి
క్రికెట్ తమ దేశంలోనే పుట్టిందని గప్పాలు కొట్టుకునే ఇంగ్లండ్ టీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఒక విశిష్టమైన వ్యక్తి నుంచి అరుదైన బహుమతి అందింది. 235 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. జట్టును విజయపథంలో నడిపించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్‌కు భారతదేశం గర్వించదగ్గ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కూడా ఎంతగానో మురిసిపోయారు. ఈ టెస్టు మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా గెలుచుకున్న విరాట్‌ను పలువురు అభినందనల్లో ముంచెత్తారు.
లతాజీ కూడా అలాగే కోహ్లీని అభినందించాలనుకున్నారు. అయితే అందరిలా మామూలుగా విష్ చేసి ఊరుకుంటే ఏం బాగుంటుందని అనుకున్నారో.. ఏమో గానీ తాను పాడిన ఆణిముత్యాల్లాంటి పాటల్లోంచి ఒక మంచి ముత్యాన్ని ఏరి తీసి అతడికి ఇచ్చారు. కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. అందులో.. ''235 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి అభినందనలు తెలియజేస్తున్నాను'' అని చెప్పడమే కాక, తాను పాడిన 'ఆకాశ్ కే ఉస్ పార్ భీ' అనే పాట యూట్యూబ్ లింకును కూడా పెట్టారు. కోహ్లీ ప్రతిభ వినువీధుల్లో ఎక్కడికో దూసుకెళ్లిపోతోందని చెప్పడానికి సింబాలిక్‌గా ఈ పాటను ఆమె అతడికి బహుమతిగా ఇచ్చారు.