
తూ జహా జహా చలేగా...
సచిన్‌కు ‘గాన కోకిల’ జ్ఞాపిక
ముంబై: ఆ ఇద్దరూ ‘భారత రత్న’లు... ఇరువురి మధ్య తరాల అంతరం ఉన్నా తమదైన రంగంలో దేశానికి ప్రతిష్ట తెచ్చిన దిగ్గజాలు... వారిద్దరి కలయిక ఎన్నో జ్ఞాపకాల సమాహారం. ‘గాన కోకిల’ లతా మంగేష్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒక్క చోట కలిశారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే ఇంట్లో ఆదివారం ఈ భేటీ జరిగింది.
తన క్లాసిక్ పాటలైన తూ జహా జహా చలేగా (మేరా సాయా), పియా తుఝ్‌సే నైనా లాగే రే (గైడ్) పాటల సాహిత్యం రాసి ఉన్న రెండు ఫ్రేమ్‌లను సచిన్‌కు లతా మంగేష్కర్ అందజేశారు. ఈ సందర్భంగా వీరిద్దరు తమకు మరొకరిపై ఉన్న గౌరవభావాన్ని, ప్రేమను చాటుకున్నారు. ‘నేను కొత్త ఇంట్లోకి మారుతున్నాను. మ్యూజిక్ రూమ్‌లో లతా దీదీకి సంబంధించిన ఏదైనా వస్తువు ఉంచాలనుకున్నా.
ఆమె నాకు తల్లిలాంటిది. ఎక్కడ క్రికెట్ ఆడినా ఆమె పాటలు వింటుంటే నాతోనే ఉన్నట్లనిపించేది’ అని సచిన్ వ్యాఖ్యానించారు. ‘సచిన్ ఆటంటే నాకు చాలా ఇష్టం. అతని వ్యక్తిత్వం అంటే ఇంకా ఇష్టం. సచిన్ మరికొంత కాలం క్రికెట్ ఆడాల్సింది’ అని లతా పేర్కొన్నారు. తన 200వ టెస్టు మ్యాచ్ జెర్సీని ఈ సందర్భంగా లతా మంగేష్కర్‌కు సచిన్ బహుకరించారు.