మరో 24 గంటలు! | Lehmann to stay on as Australia head coach | Sakshi
Sakshi News home page

మరో 24 గంటలు!

Published Wed, Mar 28 2018 1:14 AM | Last Updated on Wed, Mar 28 2018 7:41 AM

Lehmann to stay on as Australia head coach - Sakshi

ఇప్పటివరకు క్రికెట్‌లో ఉత్కంఠఅంటే మనకు తెలిసింది మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకు పోటాపోటీగా సాగడం... ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టో... వికెట్‌ తీసో జట్టును గెలిపించడం! అచ్చంగా వీటిని తలపించేలా ‘బాల్‌ ట్యాంపరింగ్‌ ఎపిసోడ్‌ ఫలితం’ సాగుతోంది! ఇటు ట్యాంపరింగ్‌ మోసంపై కొనసాగిన విమర్శలు! అటు ఘటనకు కారకులుగా భావిస్తున్న ఆటగాళ్లతో పాటు కోచ్‌పై ఆ తరహా చర్యలుంటాయి... ఈ తరహా చర్యలుంటాయంటూ రోజంతా ఊహాగానాలు! వీటన్నిటికీ జవాబు కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ వైపు అందరి చూపు! ‘విషయం తేల్చేశాం’ అన్నట్లు మంగళవారం రాత్రి ఆయన గంభీరంగా మీడియా సమావేశానికి వచ్చారు. కానీ... సగం తీర్పే చెప్పారు. తదుపరి వివరాలను 24 గంటల్లో వెల్లడిస్తామని ప్రకటించి ముగించారు. మొత్తానికిదోషులెవరో స్పష్టమైంది. మిగిలింది
వారి క్రీడా భవితవ్యంపై కీలకనిర్ణయమే! బుధవారంతో ఈ సస్పెన్స్‌ కూడా వీడిపోనుంది.  

జొహన్నెస్‌బర్గ్‌: తమ దేశ క్రికెట్‌ను కుదిపేస్తూ... అవమానాల పాల్జేస్తున్న ‘బాల్‌ ట్యాంపరింగ్‌’ ఘటన వెనుక ఉన్నదెవరో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ అధికారికంగా వెల్లడించారు. తమ బోర్డు అధికారుల విచారణ వివరాలతో మంగళవారం రాత్రి ఆయన ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. ట్యాంపరింగ్‌ ఉదంతంలో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్, ఓపెనర్‌ కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌లు దోషులుగా తేలినట్లు ప్రకటించారు. కోచ్‌ డారెన్‌ లీమన్‌ సహా మిగతా ఆటగాళ్లెవరికీ ఇందులో పాత్ర లేదని స్పష్టం చేశారు. విచారణ ముగిశాక, ముగ్గురు ఆటగాళ్లపై తాము తీసుకునే చర్యలను 24 గంటల తర్వాత తెలియజేస్తామన్నారు. వేటుపడినవారు తక్షణమే స్వదేశానికి పయనమవుతారని వారి స్థానాలను మాథ్యూ రెన్‌షా, జో బర్న్స్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌తో భర్తీ చేయనున్నట్లు.... వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌ నాలుగో టెస్టుకు సారథ్యం వహిస్తాడని పేర్కొన్నారు. లీమన్‌ రాజీనామా చేశాడన్న వార్తలు నిజం కాదని... ప్రస్తుత కాంట్రాక్ట్‌తోనే అతడు కొనసాగుతాడని వివరించారు. ‘కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో మా ఆటగాళ్ల ప్రవర్తనకు క్షమాపణలు కోరుతున్నాం. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లే ట్యాంపరింగ్‌లో భాగస్వాములని సీఏ విచారణలో తేలింది. విస్తృత స్థాయి పేరు ప్రఖ్యాతులు ముడిపడి ఉన్న ఈ ఘటనలో తీసుకునే చర్యలు కూడా అంతే కఠినమైనవి. విచారణలో స్పష్టమైన అంశాలతో ఇది ముందుకు సాగుతుంది. ఈ ఉదంతంతో మా పురుషుల జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై నిపుణుల బృందంతో స్వీయ సమీక్ష చేసుకుంటాం’ అని సదర్లాండ్‌ అన్నారు.

కలుపు మొక్క వార్నర్‌! 
క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) విచారణలో ముగ్గురు ఆటగాళ్లు దోషులుగా తేలినా జట్టు గత రెండు రోజులుగా సాగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అంతర్గత సమాచారం ప్రకారం ట్యాంపరింగ్‌కు అసలు సూత్రధారి డేవిడ్‌ వార్నరే అని వినిపిస్తోంది. బంతిని టేపుతో ట్యాంపరింగ్‌ చేయాలనే ఆలోచన తనదే అని, ఓపెనింగ్‌ సహచరుడు బాన్‌క్రాఫ్ట్‌తో ఆ పని చేయించాలని కూడా అతనే చెప్పాడని తెలిసింది. దీనికి ఊ కొట్టడం వరకే స్మిత్‌ పరిమితమయ్యాడు. ట్యాంపరింగ్‌కంటే కూడా ‘అసలు సమస్య వార్నర్‌’ అని ఒక సీనియర్‌ ఆసీస్‌ బోర్డు అధికారి చెప్పడం పరిస్థితిని సూచిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఆసీస్‌ జట్టులోని ఆటగాళ్లంతా వార్నర్‌ను వెంటనే జట్టు నుంచి బయటకు పంపించాలని కూడా కోరుకున్నట్లు సమాచారం. తమతో ఎలాంటి సంప్రదింపులు జరగకపోయినా ట్యాంపరింగ్‌కు సంబంధించి తమ పేర్లను చేర్చడంపై పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్, స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన దగ్గరి నుంచి అతను సహచరులతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు. టీమ్‌ వాట్సప్‌ గ్రూప్‌ నుంచి వార్నర్‌ తనంతట తానుగా తప్పుకోవడం కూడా జట్టుతో అతనికి ప్రస్తుతం ఉన్న సంబంధాల పరిస్థితి గురించి చెబుతోంది!  2013లో బార్‌లో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జో రూట్‌ను కొట్టిన నాటి నుంచి తమ బోర్డుతో వార్నర్‌కు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. గత ఏడాది ఆటగాళ్ల జీతాల పెంపు విషయంలో అతను గట్టిగా పోరాడాడు. ఇప్పుడు సరిగ్గా అదను చూసి బోర్డు కూడా వార్నర్‌ను బద్నామ్‌ చేసే కార్యక్రమంలో చేరింది. 2014లో యాషెస్‌తో 0–5తో ఇంగ్లండ్‌ చిత్తుగా ఓడిన తర్వాత కెవిన్‌ పీటర్సన్‌పై వేటు పడింది. నిజానికి జట్టు మొత్తం విఫలమైనా... వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడనే సాకుతో అతనిపై బోర్డు చర్య తీసుకుంది. ఆసీస్‌ జట్టులో తాజా పరిణామాలు కూడా సరిగ్గా అదే తరహాలో సహచరులతో సమస్యలు చూపిస్తూ వార్నర్‌ కెరీర్‌కు ముగింపు పలకవచ్చు!

లీమన్‌కు ఏమీ తెలీదా!
బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం గురించి సదర్లాండ్‌ చేసిన ప్రకటనలో అన్నింటికంటే ఆశ్చర్యకరమైంది కోచ్‌ డారెన్‌ లీమన్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వడం. అతను ఎలాంటి తప్పు చేయలేదని, తన కాంట్రాక్ట్‌ ప్రకారం కోచ్‌గా కొనసాగుతాడని సదర్లాండ్‌ చెప్పారు. కానీ ఘటన జరిగిన రోజు వీడియోను చూస్తే లీమన్‌ పాత్ర ఏమిటో చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు. టీవీ స్క్రీన్‌పై బాన్‌క్రాఫ్ట్‌ టేపు దృశ్యాలు కనిపించగానే వాకీటాకీలో హ్యాండ్స్‌కోంబ్‌కు సమాచారం ఇవ్వడం... అతడు దానిని బాన్‌క్రాఫ్ట్‌కు చేరవేయడం స్పష్టంగా కనిపించింది. జట్టు కోచ్‌గా అతని ప్రమేయం ఏమీ లేకుండా ఇంత పెద్ద ఘటన జరిగిందనడం నమ్మశక్యంగా లేదు. కాబట్టి లీమన్‌ను కావాలనే రక్షిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నైపుణ్యం పరంగా గొప్ప కోచ్‌ కాకపోయినా కేవలం బోర్డులో తనకు ఉన్న సంబంధాలతో ‘సిఫారసు’ వ్యక్తిగా లీమన్‌ కోచ్‌గా కొనసాగుతున్నాడనేది చాలా కాలంగా ఉన్న ఆరోపణే. ఐదేళ్ల క్రితం మికీ ఆర్థర్‌తో ఆస్ట్రేలియా బోర్డుకు గొడవ జరిగిన సమయంలో అప్పటికప్పుడు తాత్కాలికంగా ఎంపిక చేయబడిన లీమన్, ఆ తర్వాత ఎన్ని వైఫల్యాలు ఎదురైనా వేటు పడకుండా తప్పించుకోగలగడం అతనికి ఉన్న పట్టును సూచిస్తోంది.

మరోవైపు తమ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యను కూడా సదర్లాండ్‌ ‘అబద్ధం’గా మార్చేశారు. లంచ్‌ సమయంలో తమ మధ్య చర్చ జరిగిందని, ‘లీడర్‌షిప్‌ గ్రూప్‌’ కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయమని ఆ రోజు స్మిత్‌ చెప్పాడు. కానీ కేవలం ముగ్గురే దోషులంటూ తాజా విచారణలో తేల్చారు. జట్టులో అందరికంటే తక్కువగా ఏడు టెస్టుల అనుభవం ఉన్న బాన్‌క్రాఫ్ట్‌ లీడర్‌షిప్‌ గ్రూప్‌లో ఏ రకంగా చూసినా భాగం కాదు. అంటే కేవలం వార్నర్, స్మిత్‌ మాత్రమే కలిసి వ్యూహం రచించారా! అన్నింటికి మించి ఒక్క బౌలర్‌కు కూడా ట్యాంపరింగ్‌లో పాత్ర లేదనేని మరింత ఆశ్చర్యపరిచే విషయం. సాధారణంగా బాల్‌ ట్యాంపరింగ్‌ చేస్తే దానిని సమర్థంగా వాడుకోగలిగేది బౌలర్‌ మాత్రమే. అప్పటి వరకు బంతి ఏ మేరకు స్వింగ్‌ అయింది? అసలు రివర్స్‌ స్వింగ్‌ అవుతోందా లేదా? ఒక వేళ బంతి ఆకారాన్ని దెబ్బ తీస్తే అది ఏమేరకు ప్రభావం చూపిస్తుందో ఒక బౌలర్‌ మాత్రమే అంచనా వేయగలడు. కానీ సదర్లాండ్‌ చెప్పిన దాని ప్రకారం ఆ జట్టు బౌలర్లకు పనికొచ్చేలా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ కలిసి కుట్ర పన్నారు! మొత్తం సదర్లాండ్‌ ప్రకటన చూస్తే ఈ ఘటన పట్ల తామంతా బాధపడిపోతున్నట్లు, జాతికి క్షమాపణలు కోరుతున్నట్లు కనిపించినా... మొత్తం మీడియా సమావేశంలో ఒక్కసారి ‘చీటింగ్‌’ పదం వాడకపోవడం గానీ చూస్తే ఇప్పటి వరకు జరిగిన విచారణలో మాత్రం నిజాయితీ లేదనేది వాస్తవం. బుధవారం ముగ్గురు క్రికెటర్లపై శిక్షలు ఖరారయ్యాక గానీ ఆసీస్‌ బోర్డు ఈ వ్యవహారంలో ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement