ఆనంద్‌కు తొమ్మిదో స్థానం
* లండన్ క్లాసిక్ చెస్ టోర్నీ
* చాంపియన్ కార్ల్‌సన్
లండన్: ప్రపంచ చెస్ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2015 సీజన్‌ను నిరాశజనకంగా ముగించాడు. లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో ఆనంద్ 3.5 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో తలపడిన ఆనంద్ గేమ్‌ను 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) విజేతగా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత కార్ల్‌సన్, అనీష్ గిరి, మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ను నిర్వహించారు.
మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా కార్ల్‌సన్ నేరుగా ఫైనల్‌కు వెళ్లగా... అనీష్, లాగ్రెవ్ మధ్య సెమీఫైనల్‌ను నిర్వహించారు. సెమీస్‌లో లాగ్రెవ్ 2-1తో అనీష్ గిరిని ఓడించి కార్ల్‌సన్‌తో ఫైనల్లో తలపడ్డాడు. ర్యాపిడ్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో కార్ల్ సన్ 1.5.-0.5తో లాగ్రెవ్‌ను ఓడించి లండన్ క్లాసిక్ చాంపియన్‌గా అవతరించాడు.
ఈ టైటిల్‌తోపాటు గ్రాండ్ చెస్ టూర్‌లోనూ కార్ల్‌సన్‌కే టైటిల్ దక్కింది. నార్వే ఓపెన్, సింక్యూఫీల్డ్ కప్, లండన్ క్లాసిక్ టోర్నీలను కలిపి గ్రాండ్ చెస్ టూర్‌గా పరిగణించారు. ఈ మూడు టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా కార్ల్‌సన్ మొత్తం 26 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఆనంద్ 14 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.