
లండన్: వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయీస్ మెరుపు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లండ్‌తో ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో వన్డేలో లూయీస్ (130 బంతుల్లో 176 రిటైర్డ్‌హర్ట్; 17 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగి భారీ శతకం సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ డబుల్ సెంచరీకి చేరువలో అతను రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. జేక్ బాల్ వేసిన 47వ ఓవర్ రెండో బంతిని లూయీస్ తన కాలి మడమపైకి షాట్ ఆడుకున్నాడు.
నొప్పితో విలవిల్లాడుతూ అతను మైదానం వీడాల్సి వచ్చింది. చివర్లో కెప్టెన్ జేసన్ హోల్డర్ (62 బంతుల్లో 77; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడటంతో వెస్టిండీస్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది. కడపటి వార్తలు అందే సమయానికి ఇంగ్లండ్ 34 ఓవర్లలో 5 వికెట్లకు 245 పరుగులు చేసింది.