ఇండోర్: ఆ జట్టు గెలవాలంటే 343 పరుగులు చేయాలి. కానీ మూడు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. గెలుపు కోసం కాస్తయినా పోరాడదా అని అభిమానులు భావించారు. కానీ స్కోర్ బోర్డుపై మరో పరుగు చేర్చకుండానే మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయి మధ్యప్రదేశ్ ఘోర అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో 307 పరుగుల భారీ తేడాతో మధ్యప్రదేశ్ జట్టు ఓటమి మూటగట్టుకుంది. రంజీట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మెన్‌ను ఆంధ్ర బౌలర్లు హడలెత్తించారు. ఆంధ్ర బౌలర్ల ధాటికి ఏకంగా ఏడుగురు బ్యాట్స్‌మెన్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఇక రంజీ మ్యాచ్‌ల్లో అత్యల్ప స్కోర్ నమోదు కావడం ఇదే మొదటి సారి కాదు. 2010-11 రంజీ సీజన్‌లో రాజస్తాన్ జట్టు హైదరాబాద్‌ను 21 పరుగులకే ఆలౌట్ చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ కూడా 91 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరణ్ షిండే(103 నాటౌట్) అద్భుత శతకంతో రాణించడంతో 301 పరుగులకు ఆంధ్ర జట్టు ఆలౌటైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు ఏ క్రమంలోనూ కనీస పోరాటపటిమను ప్రదర్శించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర బౌలర్లలో కేవీ శశికాంత్( 6/18), విజయ్‌కుమార్(3/17)లు రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment