
ధోనీ దూకుడు.. విండీస్ బేజారు
విశాఖపట్టణం: వెస్టిండీస్తో ఆదివారమిక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. విండీస్ ముందు 289 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లి మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు.
కోహ్లీ 99, రోహిత్ శర్మ 12, ధావన్ 35, యువరాజ్ సింగ్ 28, రైనా 23, జడేజా 10, అశ్విన్ 19 పరుగులు చేసి అవుటయ్యారు. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడిన ధోనీ తర్వాత విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో రామ్పాల్ 4 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్, పెర్మాల్, సమీ తలో వికెట్ దక్కించుకున్నారు.