మెల్‌బోర్న్: గత పదేళ్ల అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) అధికారిక వెబ్‌సైట్ ఈ దశాబ్దపు టెస్టు, వన్డే జట్లను ప్రకటించింది. ఇందులో పలువురు ఆ్రస్టేలియన్లను వెనక్కి నెట్టి వన్డే జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని, టెస్టు జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లి ఎంపిక కావడం విశేషం. గత పదేళ్ల కాలంలో 70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన కోహ్లి 50కు పైగా సగటుతో అన్ని ఫార్మాట్‌లలో కలిపి 21,444 పరుగులు సాధించాడు. ఆసీస్ గడ్డపైనే కోహ్లి 6 టెస్టు సెంచరీలు, 3 వన్డే సెంచరీలు చేయడం విశేషం. 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన ధోనికి వన్డే కెప్టెన్ గా గుర్తింపు దక్కింది. cricket.com.au ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ జట్ల జాబితా:
టెస్టులు: కోహ్లి (కెప్టెన్), అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లయన్, జేమ్స్ అండర్సన్
వన్డేలు: ధోని (కెప్టెన్), రోహిత్, ఆమ్లా, కోహ్లి, డివిలియర్స్, షకీబ్, బట్లర్, రషీద్ ఖాన్, మిషెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ
టెస్టుల్లోనూ నంబర్‌వన్‌గా... ఏడాదిని ముగించిన కోహ్లి
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లోనూ అగ్రస్థానంతో 2019ని ముగించాడు. ఐసీసీ ప్రకటించిన తాజా బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌ల్లో కోహ్లి (928 పాయింట్లు) తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆ్రస్టేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (911)కంటే కోహ్లి 17 పాయింట్లు ముందంజలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (864)కు మూడో స్థానం దక్కింది. ఇతర భారత బ్యాట్స్‌మెన్‌లో చతేశ్వర్ పుజారా (4వ స్థానం), అజింక్య రహానే (7వ స్థానం)లకు టాప్–10లో చోటు లభించగా, మయాంక్ 12వ, రోహిత్ 15వ స్థానంలో నిలిచారు. ప్యాట్ కమిన్స్ (ఆ్రస్టేలియా) నంబర్‌వన్‌గా ఉన్న బౌలర్ల జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రాకు ఆరో స్థానం దక్కింది. ఆల్‌రౌండర్లలో జేసన్ హోల్డర్ (వెస్టిండీస్) అగ్రస్థానం సాధించగా, రవీంద్ర జడేజా (భారత్) రెండో ర్యాంక్‌తో 2019ని ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment