‘సున్నా’లే సిగ్గుపడేలా..! | mahendra singh dhoni stands tall as India fold for 152 | Sakshi
Sakshi News home page

‘సున్నా’లే సిగ్గుపడేలా..!

Published Fri, Aug 8 2014 1:34 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

‘సున్నా’లే సిగ్గుపడేలా..! - Sakshi

‘సున్నా’లే సిగ్గుపడేలా..!

ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్ డకౌట్
తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌట్
అర్ధసెంచరీతో ధోని ఒంటరిపోరాటం
 బ్రాడ్‌కు 6 వికెట్లు  తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 113/3

 
 ఎంత విడ్డూరం..!  చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో చిరస్మరణీయ విజయం సాధించిన జట్టేనా ఇది! గొప్ప విజయం తరువాత ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయంలో ఆడే తీరేనా ఇది! దెబ్బతిన్న పులుల్లా విజృంభించాల్సిన సందర్భంలో ఇంగ్లండ్ పేస్‌కు దాసోహమంటూ భారత బ్యాట్స్‌మెన్ పిల్లుల్లా తోక ముడిచారు. ఆడుతున్నది టెస్టు మ్యాచేనా అన్న అనుమానం కలిగేలా.. కనీసం 50 ఓవర్లు కూడా ఆడకుండా ఒకరి వెనకాల మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
 
 ఒకరిద్దరు కాదు, ముగ్గురు కాదు.. ఏకంగా అరడజను మంది పరుగుల ఖాతా తెరవకుండానే తమకేదో అత్యవసర పని ఉన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నారు. వీరు చుట్టిన ‘సున్నా’ లకు నిజంగా ‘సున్నా’లే సిగ్గుపడుతున్నాయి. అవును.. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడమన్నది గతంలో ఎప్పుడూ
 జరగలేదు. ఏదేమైనా ధోనిసేన ఈ ఘనతనూ సొంతం చేసుకుంది.
 
 మాంచెస్టర్: టెస్టుల్లో ధోని ఆరో ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు వస్తాడని ఎవరైనా ఊహిస్తారా? భారత్ 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోతుందని అంచనా వేస్తారా? సగటు భారత అభిమాని కలలో కూడా ఊహించని ఈ పరిణామాలు మాంచెస్టర్ టెస్టులో జరిగాయి. ఇంగ్లండ్ పేసర్లు బ్రాడ్ (6/25), అండర్సన్ (3/46)  సంచలన బౌలింగ్‌తో.... నాలుగో టెస్టులో భారత్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు.  గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది.

ధోని (133 బంతుల్లో 71; 15 ఫోర్లు) ఒంటరిపోరాటం చేయగా.... అశ్విన్ (42 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్సర్) కాసేపు తోడుగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో  35 ఓవర్లలో 3 వికెట్లకు 113 పరుగులు చేసింది. బెల్ (45 బ్యాటింగ్), జోర్డాన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బ్యాలెన్స్ (37) ఫర్వాలేదనిపించినా... కుక్ (17), రాబ్సన్ (6) విఫలమయ్యారు. ఆరోన్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం కుక్‌సేన 39 పరుగులు వెనుకబడి ఉంది. వర్షం వల్ల మ్యాచ్ ఆరగంట ఆలస్యంగా ఆరంభమైంది.
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) కుక్ (బి) అండర్సన్ 0; గంభీర్ (సి) రూట్ (బి) బ్రాడ్ 4; పుజారా (సి) జోర్డాన్ (బి) బ్రాడ్ 0; కోహ్లి (సి) కుక్ (బి) అండర్సన్ 0; రహానే (సి) బెల్ (బి) జోర్డాన్ 24; ధోని (సి) జోర్డాన్ (బి) బ్రాడ్ 71; జడేజా ఎల్బీడబ్ల్యు (బి) అండర్సన్ 0; అశ్విన్ (సి) రాబ్సన్ (బి) బ్రాడ్ 40; భువనేశ్వర్ (బి) బ్రాడ్ 0; ఆరోన్ నాటౌట్ 1; పంకజ్ సింగ్ (బి) బ్రాడ్ 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (46.4 ఓవర్లలో ఆలౌట్) 152.
 
 వికెట్ల పతనం: 1-8; 2-8; 3-8; 4-8; 5-62; 6-63; 7-129; 8-137; 9-152; 10-152
 బౌలింగ్: అండర్సన్ 14-3-46-3; బ్రాడ్ 13.4-6-25-6; వోక్స్ 10-1-43-0; జోర్డాన్ 9-4-27-1.
 
 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) పంకజ్ (బి) ఆరోన్ 17; రాబ్సన్ (బి) భువనేశ్వర్ 6; బ్యాలెన్స్ ఎల్బీడబ్ల్యు (బి) ఆరోన్ 37; బెల్ బ్యాటింగ్ 45; జోర్డాన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (35 ఓవర్లలో 3 వికెట్లకు) 113.
 
 వికెట్ల పతనం: 1-21; 2-36; 3-113
 బౌలింగ్: భువనేశ్వర్ 9-4-17-1; పంకజ్ సింగ్ 11-1-50-0; ఆరోన్ 8-2-26-2; అశ్విన్ 7-0-16-0.
 
 భారత్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్ కావడం ఇదే తొలిసారి. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ల ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. అయితే ఒక ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్ అయిన సందర్భంలో భారత్‌దే (152) అత్యధిక స్కోరు కావడం విశేషం.
 
 తొలి 4 వికెట్లు కోల్పోయిన దశలో భారత్ ఇంతకంటే చెత్త ప్రదర్శన 1952లో హెడింగ్లీ టెస్టులో కనబర్చింది. అప్పుడు సున్నాకే భారత్ మొదటి 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మరోసారి 1952లోనే ఓవల్‌లో 6 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.
 
 ఎందుకిలా జరిగింది..?
 మాంచెస్టర్ టెస్టులో టాస్ గెలవగానే ధోని నవ్వాడు. అటు కుక్ కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని అనుకున్నానని చెప్పాడు. అంటే ఇరు జట్ల కెప్టెన్లు వికెట్‌ను ఒకేలా చదివారు. కానీ అరగంట తర్వాత కుక్ నవ్వాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు నలుగురు భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌లో కూర్చున్నారు. వికెట్ మీద పేస్ ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసినా... మ్యాచ్ ఆరంభానికి ముందు కొద్దిసేపు వర్షం పడటంతో వచ్చిన తేమను ఇంగ్లండ్ పేసర్లు సమర్థంగా వినియోగించుకున్నారు.

 దీనికితోడు అండర్సన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌తో బంతిని స్వింగ్ చేశాడు. మరో ఎండ్‌లో బ్రాడ్ అద్భుతంగా బౌన్స్ రాబట్టాడు. లంచ్ తర్వాత అశ్విన్, ధోని షాట్లు ఆడిన తీరు చూస్తే ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం అసాధ్యమేం కాదనే విషయం అర్థమైంది. ఇంగ్లండ్‌లో ఏ వేదికలో టెస్టు జరిగినా తొలి సెషన్‌లో బౌలర్లకు సహకారం లభిస్తుందనేది జగమెరిగిన సత్యం. కానీ భారత ‘టాప్’ బ్యాట్స్‌మెన్ ఈ విషయాన్ని గ్రహించలేకపోయారు. ఓ గంట, రెండు గంటల పాటు పరుగులు రాకపోయినా నష్టమేం లేదు.
 
 వికెట్లు చేతిలో ఉంటే రెండు, మూడు సెషన్లలో పరుగులు చేసుకోవచ్చు. దీనికి తోడు బంతి స్వింగ్ అవుతున్నప్పుడు డ్రైవ్‌లు ఆడాల్సిన అవసరం ఏంటో తెలియదు. మొత్తానికి టాస్ గెలవడం ద్వారా లభించిన అడ్వాంటేజ్‌ను భారత బ్యాట్స్‌మెన్ కేవలం అరగంటలోనే నాశనం చేశారు. ధోని, అశ్విన్ కలిసి ఆడుతున్న సమయంలో భారత్ తిరిగి పుంజుకునే అవకాశం లభించింది. ఎదురుదాడి ఆయుధంగా ఆడిన అశ్విన్... కాస్త పరిస్థితి చక్కబడుతున్న సమయంలో సంయమనం చూపకుండా అవుటయ్యాడు. ఆ తర్వాత ఏ దశలోనూ భారత్ కోలుకోలేదు. ఎప్పుడూ దూకుడుగా ఆడే ధోని ఈసారి తన శైలికి భిన్నంగా ఆడి అర్ధసెంచరీ చేయకపోతే... తీవ్రమైన అవమాన భారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది.
 
 ఇక టెస్టు పోయినట్లే (నా)!
 పేలవ బ్యాటింగ్‌తో తొలి రోజు కేవలం రెండు సెషన్లలోనే ఆలౌటైన భారత్... ఇక ఈ టెస్టును కాపాడుకున్నా అద్భుతమే అనుకోవాలి. మొదటి రోజు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడటంతో.. ఆ జట్టు ఇప్పటికే భారత్ స్కోరుకు చేరువయింది. ఇంగ్లండ్ పేసర్లు ప్రభావం చూపిన పిచ్‌పై భారత సీమర్లు ఇప్పటికే తేలిపోయారు. భువనేశ్వర్, ఆరోన్ ఆకట్టుకున్నా... పంకజ్ సింగ్‌ను ఆతిథ్య బ్యాట్స్‌మెన్ తేలికగా ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే భారత బౌలర్లు అద్భుతం చేయాలి. అది కూడా రెండో రోజు ఉదయం సెషన్‌లో నాలుగు వికె ట్లు తీయగలిగితేనే మ్యాచ్‌లో నిలబడతారు. ఒకవేళ కుక్‌సేనకు తొలి ఇన్నింగ్స్‌లో 150పై చిలుకు ఆధిక్యం వస్తే మాత్రం మ్యాచ్‌తో పాటు సిరీస్‌పై పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిందే..!
 - సాక్షి క్రీడావిభాగం
 
  సెషన్ 1: ‘టాప్’లేచింది
 వాతావరణం మేఘావృతంగా ఉండటంతో ఆరంభంలోనే ఇంగ్లండ్ పేసర్లు అండర్సన్, బ్రాడ్ బంతితో చుక్కలు చూపారు. తొలి 5.1 ఓవర్లలో భారత ‘టాప్’లేపి మ్యాచ్‌ను ఆధీనంలో తెచ్చుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత టెస్టు ఆడుతున్న గంభీర్ (4)ను బ్రాడ్ వెనక్కి పంపాడు.
 
 తర్వాత మూడు బంతుల వ్యవధిలో విజయ్ (0), కోహ్లి (0)లను అండర్సన్ దెబ్బతీశాడు. వదిలేయాల్సిన అవుట్ స్వింగర్‌ను ఆడిన కోహ్లి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఆ వెంటనే పుజారా (0) అవుట్ కావడంతో భారత్ 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత రహానే (24), ధోని ఇన్నింగ్స్‌ను ఆదుకునే బాధ్యతను తీసుకున్నారు. ఐదో వికెట్‌కు 54 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించినా లంచ్‌కు ముందు జోర్డాన్ ఈ జోడిని విడదీశాడు. ఓవరాల్‌గా ఈ సెషన్‌లో ఇంగ్లండ్ పేస్‌కు భారత్ దాసోహమైంది.
 ఓవర్లు: 25; పరుగులు: 63; వికెట్లు: 5
 
 సెషన్ 2: ధోని నిలకడ
 లంచ్ తర్వాత రెండో ఓవర్‌లో అండర్సన్ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు జడేజా (0) వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్ మరోసారి కష్టాలపాలైంది. క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ను ఇంగ్లండ్ పేసర్లు టార్గెట్ చేసినా నాణ్యమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ 34వ ఓవర్‌లో భారత్ 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. 35వ ఓవర్‌లో ఇచ్చిన క్యాచ్‌ను బట్లర్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న అశ్విన్... ఫీల్డర్లను దగ్గరగా మొహరించడంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. ఫలితంగా బ్రాడ్ వేసిన షార్ట్ బంతిని గాల్లోకి లేపి రాబ్సన్ చేతికి చిక్కాడు. ఓవరాల్‌గా టాప్ బ్యాట్స్‌మన్ కంటే మెరుగ్గా ఆడిన అశ్విన్...ధోనితో కలిసి ఏడో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. 115 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కెప్టెన్ నిలకడగా ఆడినా బ్రాడ్ దెబ్బకు లోయర్ ఆర్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. బ్రాడ్ 21 బంతుల వ్యవధిలో ఆరు పరుగులకు ధోనితో సహా చివరి నాలుగు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.  
 ఓవర్లు: 21.4; పరుగులు: 89; ఓవర్లు: వికెట్లు: 5
 
  సెషన్ 3: మూడు వికెట్లు
 టీ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను కాసేపు భారత పేసర్లు ఇబ్బందిపెట్టారు. భువనేశ్వర్ లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో 9వ ఓవర్‌లో ఫలితం వచ్చింది. భువీ బంతిని అద్భుతంగా ఇన్‌స్వింగ్ చేసి రాబ్సన్ (6)ను అవుట్ చేశాడు. పంకజ్ స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన ఆరోన్ తన రెండో ఓవర్‌లోనే కుక్ (17)ను వెనక్కి పంపడంతో భారత్ శిబిరంలో ఆనందం నెలకొంది. 22వ ఓవర్‌లో అశ్విన్‌ను బౌలింగ్‌కు దించడంతో బెల్ భారీ సిక్సర్‌తో స్వాగతం పలికాడు.
 
 రెండో ఎండ్‌లో బ్యాలెన్స్ కూడా వికెట్‌ను కాపాడుకుంటూనే వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడిని విడదీసేందుకు ధోని బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించాడు. ఈ వ్యూహం రోజు చివరి ఓవర్‌లో ఫలించింది. వేగంగా దూసుకొచ్చిన ఫుల్‌లెంగ్త్ బంతి మిస్సయి బ్యాలెన్స్ ప్యాడ్‌ను తాకింది. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన జోర్డాన్ మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు.
 ఓవర్లు: 35; పరుగులు: 113; వికెట్లు: 3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement