
41 ఫోర్లు, 13 సిక్సర్లు
మణికంఠ ట్రిపుల్ సెంచరీ
సెంచరీ కొట్టిన ఆర్యన్ ∙
తొలి వికెట్‌కు 518 పరుగుల భాగస్వామ్యం
డీపీఎస్ ఘనవిజయం l
హెచ్‌సీఏ అండర్–16 స్కూల్ లీగ్
చిలకలగూడ: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–16 స్కూల్ లీగ్ క్రికెట్‌లో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. సుల్తాన్ ఉల్ ఉలూమ్ స్కూల్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్, నాచారం) బ్యాట్స్‌మన్ ఆదం మణికంఠ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నమ్మశక్యంకానిరీతిలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు. 142 బంతులు ఆడిన మణికంఠ 41 ఫోర్లు, 13 సిక్సర్ల సహాయంతో 316 పరుగులు చేసి అవుటయ్యాడు. మణికంఠతోపాటు మరో ఓపెనర్ గడ్డం ఆర్యన్ (129 బంతుల్లో 159; 16 ఫోర్లు) కూడా కదంతొక్కాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 240 బంతుల్లో 518 పరుగులు జోడించడం విశేషం. మరో బ్యాట్స్‌మన్ సాయి కౌశిక్ (25 బంతుల్లో 57; 10 ఫోర్లు) కూడా రాణించాడు. మరోవైపు సుల్తాన్ ఉల్ ఉలూమ్ జట్టు ఎక్స్‌ట్రాల రూపంలో 107 పరుగులు ఇవ్వడం గమనార్హం. దాంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన డీపీఎస్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 649 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 650 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సుల్తాన్ ఉల్ ఉలూమ్ స్కూల్ జట్టు పృథ్వీ (6/35), మనీశ్ (3/9)ల ధాటికి 14 ఓవర్లలోనే 54 పరుగులకు కుప్పకూలింది. దాంతో డీపీఎస్ జట్టు 595 పరుగుల భారీ తేడాతో విజయం దక్కించుకుంది. ‘ట్రిపుల్’ సెంచరీతో చెలరేగిన మణికంఠతోపాటు సెంచరీ సాధించిన ఆర్యన్‌లకు స్కూల్ యాజమాన్యంతోపాటు తండ్రి ఆదం విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ ఆదం ఉమాదేవి అభినందించారు.
చిలుకూరులోని వీజీ రావు క్రికెట్ గ్రౌండ్స్‌లో నారాయణ కాన్సెప్ట్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ మోడల్ స్కూల్ ఘనవిజయాన్ని సాధించింది. ఈమ్యాచ్‌లో 293 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన గౌతమ్ మోడల్ స్కూల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్ష్ (103 బంతుల్లో 107; 13 ఫోర్లు), బి. రూపేశ్ (102 బంతుల్లో 84; 5 ఫోర్లు) తొలివికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీస్కోరును అందించారు. రాహుల్ రెడ్డి (55) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం నారాయణ కాన్సెప్ట్ స్కూల్ 22 ఓవర్లలోనే కేవలం 70 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అనికేత్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, తర్షిత్ కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను దక్కించుకున్నాడు.