ఫైనల్లో ఈస్ట్‌జోన్
- మనోజ్ తివారీ సెంచరీ
- సెమీస్‌లో నార్త్‌పై గెలుపు
- దేవధర్ ట్రోఫీ
ముంబై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఈస్ట్‌జోన్ జట్టు... దేవధర్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ మనోజ్ తివారీ (121 బంతుల్లో 151; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో ఈస్ట్ 52 పరుగుల తేడాతో నార్త్‌జోన్‌పై విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. తివారీ మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. నార్త్ జోన్ బౌలర్లలో సందీప్ శర్మ 3, రిషీ ధావన్ 2 వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్ చేసిన నార్త్‌జోన్ 47.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. గురుకీరత్ సింగ్ (99 బంతుల్లో 83; 10 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. మన్‌దీప్ సింగ్ (40), రిషీ ధావన్ (38) రాణించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. యువరాజ్ సింగ్ (4) మరోసారి నిరాశపర్చాడు. లాహిరి 3, దిండా, సామంత్రే చెరో రెండు వికెట్లు తీశారు. సౌత్, వెస్ట్‌జోన్‌ల మధ్య రెండో సెమీస్ ముంబైలో నేడు
జరగనుంది.