మాస్కో: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా గ్రూప్-డి నుంచి శనివారం అర్జెంటీనా, ఐస్‌ల్యాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ ఆట ముగిసే సమయానికి 1-1తో సమంగా నిలిచి డ్రాగా ముగించాయి. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న అతిచిన్న దేశమైన ఐస్‌ల్యాండ్ జట్టు, ఈసారి కప్ ఎలాగైనా గెలవాలనే తపనతో ఉన్న సీజన్ ఫేవరెట్ అర్జెంటీనాకు గట్టి పోటీనిచ్చింది. అయితే దీనిపై అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు, మాజీ కోచ్ డిగో మారడోనా అర్జెంటీనా ప‍్రస్తుత కోచ్ జార్జ్ సంపౌలీని తీవ్రంగా హెచ్చరించాడు. రెండు ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన జట్టు తొలి మ్యాచ్ ఆడుతున్న ఐస్‌ల్యాండ్ తో డ్రాగా ముగించడమేంటని మండిపడ్డాడు. దీనికి పూర్తి బాధ్యత కోచ్‌దేనన్నాడు. ఇలా అయితే కోచ్ సంఫౌలీ తిరిగి స్వదేశానికి వచ్చే ఆశల్ని వదులుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘పెనాల్టీ రూపంలో వచ్చిన అవకాశాన్ని దిగ్గజ ఆటగాడు మెస్సీ గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. మెస్సీ పెనాల్టీతో కలుపుని అర్జెంటీనా రెండు పాయింట్లు సాధించే అవకాశాన్ని కోల్పోయిందని నేను అనుకోవడం లేదు. పసికూనతో అర్జెంటీనా ఆటగాళ్లు ఆడిన తీరును కూడా నేను నిందించను. అర్జెంటీనా గెలవకపోవడానికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకపోవడమే. కోచ్ ప్రణాళికలు సరిగా లేవు. వీరి ప్రదర్శన ఇలాగే కొనసాగితే కోచ్ సంపౌలీ దేశంలో అడుగుపెట్టలేవు. కుటుంబాన్ని మార్చడానికి ఏదైనా దేశం వెతుక్కోవాలి’ అని మారడోనా మండిపడ్డాడు.
ఇదే మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో పొగ తాగిన మారడోనా ఫిఫా యాజమాన్యం ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు అర్జెంటీనా మాజీ ఆటగాడు, ప‍్రస్తుత కోచ్ సంఫౌలీకి వార్నింగ్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment