షరపోవాకు ఊరట
డోపింగ్ కేసులో నిషేధానికి గురైన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు ఊరట లభించింది. షరపోవాపై విధించిన రెండేళ్ల నిషేధిత కాలాన్ని 15 నెలలకు తగ్గించారు. స్పోర్ట్ ఆర్బిట్రేషన్ కోర్టు (సీఏఎస్) ఈ మేరకు తీర్పు చెప్పింది. మొత్తం నిషేధిత కాలంలో తొమ్మిది నెలల శిక్షను సస్సెండ్ చేసింది.
ఈ ఏడాది జనవరి 26 నుంచి ఆమెపై నిషేధం కొనసాగుతోంది. తాజా తీర్పుతో వచ్చే ఏడాది ఏప్రిల్ 26 నాటికి షరపోవాపై నిషేధితం ముగుస్తుంది. ఆ తర్వాత ఆమె అంతర్జాతీయ టెన్నిస్ ఆడేందుకు అర్హురాలు అవుతుంది. వచ్చే ఏడాది జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె పాల్గొనే అవకాశం ఉంటుంది.
షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్టు డోపింగ్ పరీక్షల్లో తేలడంతో గత జనవరిలో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఆమెపై వేటువేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ సలహా మేరకు కొన్నేళ్లుగా మెల్డోనియం టాబ్లెట్లు వాడుతున్నానని, అయితే వీటిని నిషేధిత జాబితాలో చేర్చినట్టు తెలియక పొరపాటును తీసుకున్నానని అప్పట్లో షరపోవా బహిరంగంగా ప్రకటించింది. షరపోవా ఉద్దేశ్యపూర్వకంగా ఈ నిషేధిత డ్రగ్‌ను తీసుకోలేదని భావించడంతో తక్కువ శిక్ష వేశారు. కోర్టును ఆశ్రయించడంతో నిషేధిత కాలాన్ని మరికొంత తగ్గించింది.